నాంపల్లి: హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో రెండు రివాల్వర్లు దొరికాయి. శుక్రవారం రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వా«దీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్నవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆధారాలతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు.
శనివారం మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్, సైఫాబాదు డివిజన్ ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్లు ఖలీల్ పాష, అదనపు ఇన్స్పెక్టర్ కిషోర్, ఎస్సై రెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దోపిడీదారులు, రౌడీ షీటర్లు,నక్సలైట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు నగరానికి వచ్చి, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అలాగే విక్రయించడం కోసం ఎవరైనా తీసుకువచ్చారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment