revolvers
-
సులభ్ కాంప్లెక్స్‌లో తపంచాల కలకలం
నాంపల్లి: హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో రెండు రివాల్వర్లు దొరికాయి. శుక్రవారం రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వా«దీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్నవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆధారాలతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. శనివారం మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్, సైఫాబాదు డివిజన్ ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్లు ఖలీల్ పాష, అదనపు ఇన్స్పెక్టర్ కిషోర్, ఎస్సై రెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దోపిడీదారులు, రౌడీ షీటర్లు,నక్సలైట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు నగరానికి వచ్చి, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అలాగే విక్రయించడం కోసం ఎవరైనా తీసుకువచ్చారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎదురైతే... ఎదుర్కోగలమా?
సిమి ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అనుమానాలు హైదరాబాద్: పోలీసుల్నే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న సిమి ముఠాకు చెందిన ముగ్గురు రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుడుగట్టిన ఈ ముఠాను సాధారణ విధుల్లో ఉండే పోలీసులు తమ దగ్గరున్న ఆయుధాలతో ఎదుర్కోగలరా..? వీటిని వినియోగించే సామర్థ్యం సిబ్బందిలో ఎందరికుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పీ బలగాలు మినహా పోలీసుస్టేషన్లలో తాతల కాలం నాటి మస్కట్లు... తండ్రుల తరం నాటి .303లే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ప్రతి పోలీస్స్టేషన్లోనూ ఇన్స్పెక్టర్, ఎస్సైలతో పాటు దాదాపు 50 మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల దగ్గర పిస్టల్ ఉంటుంది. ఎస్సైల దగ్గర రివాల్వర్లు ఉంటున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా అనేకచోట్ల ఇవి కూడా అందరికీ అందుబాటులో లేవు. మరోపక్క పోలీసుస్టేషన్ మొత్తానికీ కలిసి 10 నుంచి 15 వరకు మాత్రమే మస్కట్లు, .303లు ఉంటాయి. మస్కట్‌తో ఒకసారికి ఒక తూటా (రౌండ్) మాత్రమే పేల్చే వీలుంది. మళ్లీ పేల్చాలంటే ఇంకో రౌండ్ అందులో లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక .303 విషయానికి వస్తే... ఏకకాలంలో 10 రౌండ్లు అందులో పెట్టే అవకాశం ఉన్నా... ఒక రౌండ్ పేల్చిన తరవాత లివర్ లాగి కాగ్ చేసి మరో రౌండ్ కాల్చాలి. ఎల్ఏఆర్ వ ంటి ఆటోమాటిక్, ఎస్ఎల్ఆర్ వంటి సెమీ ఆటో మేటిక్ ఆయుధాలు కేవలం బందోబస్తు, భద్రతా విధుల్లో ఉండే బలగాల వద్ద మినహా ఏ పోలీస్ స్టేషన్లోనూ కనిపించవు. ఇక అందుబాటులో ఉన్న కొద్దిపాటి గ్లోక్ పిస్టల్స్ కేవలం ఉన్నతాధికారుల దగ్గరే ఉంటున్నాయి. ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసుస్టేషన్లలో వినియోగిస్తున్న ఆయుధాలన్నీ కాలం చెల్లినవే. ఇతర పోలీసు విభాగాలు ఏనాడో మర్చిపోయిన .98 పిస్టల్, .38 రివాల్వర్, .303 రైఫిల్స్, 410 మస్కట్లను ప్రజలను రక్షించడానికి ‘పొదుపుగా’ కేటాయిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖుల రక్షణకు కేటాయించే గన్మెన్లకు మాత్రం అత్యాధునిక ఆయుధాలైన ఎస్ఎల్ఆర్, ఏకే-47, కార్బైన్లు ఇస్తున్నారు. పోలీసుల వద్ద ఆయుధాలు లేకపోవడం ఒక సమస్య అయితే... ఉన్న వాటిని పోలీసులు ఎంతవరకు సమర్థంగా వినియోగించగలరనేది సందేహం మరోవైపు ఉత్పన్నమవుతోంది. ఎప్పుడో శిక్షణ కాలంలో తప్ప ఆ తరవాత తుపాకీ పేల్చిన అధికారులు అరుదు. కేవలం ఏఆర్, ఏపీఎస్పీ బలగాలకే ఫైరింగ్ ప్రాక్టీసు ఉంటోంది. సాధారణ పోలీసులకూ గతంలో నిర్వహించే యాన్యువల్ ఫైరింగ్స్ని పోలీసులు ఇప్పుడు మర్చిపోయారు. ఓ జిల్లా ఎస్పీనో, కమిషనరేట్లకు చెందిన కమిషనరో తమ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయిద్దామనుకున్నా ఆ స్థాయిలో తూటాల సరఫరా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆయుధం అలంకార ప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘దాడులు జరగకుండా చూడాలి’ హైదరాబాద్: అత్యాధునిక ఆయుధాలు పోలీసుల వద్ద లేకపోవడం, వారి భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం ఈ ‘ఉగ్ర’దాడి ఘటనలో స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ సీపీఎం కమిటీ పేర్కొంది. భవిష్యత్‌లోనైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది. -
జనశక్తి నక్సల్స్ అరెస్ట్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం జనశక్తి గ్రూప్ నక్సల్స్‌ను ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తపంచాలు, ఒక రివాల్వర్, కొన్ని డిటొనేటర్లు, బుల్లెట్లు, విప్లవసాహిత్యం, బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వేంపటి కుమార్ అలియాస్ గంగన్న అలియాస్ జీవన్, ఏదులకంటి లింగారెడ్డి అలియాస్ శ్యాం, జంగలం శంకర్, చండ్రుపట్ల సురేష్, అక్కల రాజు ఉన్నారు. అలాగే, వీరికి ఆశ్రయం కల్పించిన నేరంపై మరో ఐదుగురిని బైండోవర్ చేశారు. అంతేకాకుండా జనశక్తి గ్రూపుకు చెందిన కూర రాజన్న, దేవేందర్, విమలక్క తదితర నేతలపై కుట్ర కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విలేకరులకు తెలిపారు. -
బెజవాడ ఆటోనగర్‌లో ఆయుధాల తయారీ!
తెలుగు రాష్ట్రాల్లోనే పేరొందిన విజయవాడ ఆటోనగర్‌లో ఆయుధాల వ్యవహారం కలకలం రేపింది. ఆటోనగర్‌లో ఉన్న లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్‌పై ఏలూరు పోలీసులు దాడి చేశారు. అక్కడ తుపాకుల కార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. విజయవాడలో ఆయుధాల తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది. దాంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ ఆటోనగర్‌కు వచ్చి, ఇక్కడ తనిఖీ చేయగా ఆయుధాల తయారీ గుట్టు బయటపడింది. సాధారణంగా ఆయుధాలు కావాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇక్కడే విడిభాగాలను తయారుచేయడం ఇదే తొలిసారి. మధురానగర్ ప్రాంతంలో రివాల్వర్లకు కావల్సిన స్ప్రింగులు కొనుగోలు చేశారు. అక్కడ విచారించగా, తాము స్ప్రింగులు అమ్మిన విషయం వాస్తవమే గానీ, అవి తుపాకుల కోసమన్నది తెలియదని వ్యాపారులు చెప్పారు. దాంతో ఆటోనగర్‌లో ఆయుధాలు తయారుచేస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!
హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ ఆశ్రమం మీద పోలీసులు దాడిచేసి, ఆయన్ను అరెస్టు చేసినప్పుడు అక్కడ దొరికిన వస్తువుల జాబితాలో ఏవేం ఉన్నాయో తెలుసా? రివాల్వర్లు, మిరపకాయ బాంబులు.. వాటితో పాటు గర్భనిర్ధారణ కిట్లు! బల్వారాలోని సత్లోక్ ఆశ్రమంలో గల రాంపాల్ వ్యక్తిగత గదిలో కూడా ఇలాంటి ఓ కిట్ బయటపడింది. రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలానికి కింద సొరంగం లాంటి గది ఒకటుంది. అందులో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్గన్లు, రెండు .12 బోర్ రైఫిళ్లు, రెండు .315 బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు కూడా ఆశ్రమంలో ఉన్నాయి. భారీమొత్తంలో ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా కనిపించాయి. రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఆశ్రమ ప్రాంగణంలో కనిపించాయి. ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేశామని, వాళ్లలో ఎవరైనా నక్సలైట్లు కూడా ఉన్నారేమో పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక రాంపాల్ అయితే.. జైల్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. గత రాత్రి మొత్తం ఆయన ఏమీ తినలేదు, తాగలేదు. పూర్తి నిరాహారదీక్ష పాటిస్తున్నారు. శుక్రవారం ఉదయం రెండుసార్లు టీ తాగారు, గురువారం నాటి మధ్యాహ్నం నాలుగు చపాతీలు పప్పుతో తిన్నారు. ఆ తర్వాత పూర్తి నిరాహారంగానే ఉన్నారు. -
గప్‌చుప్‌గా బుల్లెట్ల అమ్మకాలు
రివాల్వర్లకు అక్రమంగా సరఫరా చిత్తూరు, వేలూరుకు చెందిన ముఠాలపనే ఇది పలమనేరు, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్ డివిజన్ తో పాటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతా ల్లో కొందరు అక్రమంగా ఉంచుకొన్న రివాల్వర్లకు చిత్తూరు, వేలూరుకు చెందిన ముఠాలు బుల్లెట్లను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తమిళనాడులోని వేలూరుకు చెందిన ఓ ముఠా తన కార్యకలాపాలను జిల్లాలో భారీగా చేస్తుండేది. రెండేళ్ల నుంచి చిత్తూరులోనూ ఓ ముఠా బుల్లెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. బంగారుపాళెం మండలం బొమ్మాయిపల్లెకు చెందిన శరవణ చిత్తూరులో ఓ వ్యక్తి నుంచి తన రివాల్వర్‌కు సరిపోయే బుల్లెట్లను కొనుగోలు చేసేందుకు వెళ్లి వస్తుండగానే నాకాబందీలో అతని రివాల్వర్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి చిత్తూరులోనూ బుల్లెట్లను విక్రయించే ముఠా ఉన్నట్లు పోలీసులకు అర్థమైంది. అసలు ఈ ప్రాంతంలోని నాటు రివాల్వర్లకు బుల్లెట్లు ఎలా వస్తున్నాయో పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. పదేళ్లుగా వేలూరే ఇందుకు కేంద్రం... ఈ ప్రాంతంలో రివాల్వర్లు కలిగిన వ్యక్తులు తమిళనాడులోని వేలూరు ముఠా నుంచి అవసరమైన బుల్లెట్లను రహస్యంగా కొనుగోలు చేసేవారు. చెన్నైలోని లెసైన్స్ డీలర్లు లెసైన్స్ కలిగిన గన్ హోల్డర్ల పరిమితిని తగ్గించి కొన్ని బుల్లెట్లను దాచి వాటిని అధిక ధరలకు విక్రయించేవారు. అయితే అక్కడి ప్రభుత్వం లెసైన్స్ డీలర్లపై నిఘాను పెంచడంతో అక్రమ బుల్లెట్ల విక్రయాలు కొంతమేరకు తగ్గాయని తెలుస్తోంది. వేలూరు ముఠాలోని కొందరు ఏజెంట్లు ఫోన్ కాంటాక్ట్ ద్వారా పలమనేరు ప్రాంతంలోని ఆయుధాలు కలిగిన వారికి నేరుగా చేరవేసేవారనే సమాచారం కూడా ఉంది. మూడేళ్ల క్రితం స్థానికంగా నాటు రివాల్వర్‌తో పాటు మూడు బుల్లెట్లు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లో వాటిని వేలూరు నుంచే అక్రమంగా కొనుగోలు చేసినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే ఈ ముఠా కార్యకలాపాలు ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. పోలీస్ ఫైరింగ్‌లో చేతివాటం.. ఏటా పోలీసులకు నిర్వహించే పునశ్చరణ తరగతుల్లో భాగంగా ఫైరింగ్‌లో ఒక్కొక్కరికి నిర్ధేశించిన మేరకు బుల్లెట్లను పోలీస్‌శాఖలోని ఆర్మ్డ్ అధికారులు అందజేస్తారు. ఫైరింగ్ పూర్తయ్యాక బుల్లెట్ల నుంచి ఊడిపడే కాట్రెడ్జిలను తిరిగి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అయితే వాటిల్లో కొన్నింటిని ఫైరింగ్‌కు ఇవ్వకుండానే ఫైరింగ్ జరిగినప్పుడు గాల్లో ఎగిరిపోయాయని వారు లెక్కల్లోకి ఎక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలించుకున్న బుల్లెట్లను అమ్మకాలు జరిపే ముఠా సభ్యులు కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. రివాల్వర్ సైజును బట్టి .32, .22 బుల్లెట్లను రూ.500 వరకు నాటు రివాల్వర్లు కలిగిన వారికి విక్రయిస్తున్నట్లు సమాచారం.