సిమి ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అనుమానాలు
హైదరాబాద్: పోలీసుల్నే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న సిమి ముఠాకు చెందిన ముగ్గురు రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుడుగట్టిన ఈ ముఠాను సాధారణ విధుల్లో ఉండే పోలీసులు తమ దగ్గరున్న ఆయుధాలతో ఎదుర్కోగలరా..? వీటిని వినియోగించే సామర్థ్యం సిబ్బందిలో ఎందరికుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్మ్‌డ్ రిజర్వ్, ఏపీఎస్పీ బలగాలు మినహా పోలీసుస్టేషన్లలో తాతల కాలం నాటి మస్కట్‌లు... తండ్రుల తరం నాటి .303లే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ ఇన్‌స్పెక్టర్, ఎస్సైలతో పాటు దాదాపు 50 మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల దగ్గర పిస్టల్ ఉంటుంది. ఎస్సైల దగ్గర రివాల్వర్లు ఉంటున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా అనేకచోట్ల ఇవి కూడా అందరికీ అందుబాటులో లేవు. మరోపక్క పోలీసుస్టేషన్ మొత్తానికీ కలిసి 10 నుంచి 15 వరకు మాత్రమే మస్కట్‌లు, .303లు ఉంటాయి. మస్కట్‌తో ఒకసారికి ఒక తూటా (రౌండ్) మాత్రమే పేల్చే వీలుంది.
మళ్లీ పేల్చాలంటే ఇంకో రౌండ్ అందులో లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక .303 విషయానికి వస్తే... ఏకకాలంలో 10 రౌండ్లు అందులో పెట్టే అవకాశం ఉన్నా... ఒక రౌండ్ పేల్చిన తరవాత లివర్ లాగి కాగ్ చేసి మరో రౌండ్ కాల్చాలి. ఎల్‌ఏఆర్ వ ంటి ఆటోమాటిక్, ఎస్‌ఎల్‌ఆర్ వంటి సెమీ ఆటో మేటిక్ ఆయుధాలు కేవలం బందోబస్తు, భద్రతా విధుల్లో ఉండే బలగాల వద్ద మినహా ఏ పోలీస్ స్టేషన్‌లోనూ కనిపించవు. ఇక అందుబాటులో ఉన్న కొద్దిపాటి గ్లోక్ పిస్టల్స్ కేవలం ఉన్నతాధికారుల దగ్గరే ఉంటున్నాయి. ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసుస్టేషన్లలో వినియోగిస్తున్న ఆయుధాలన్నీ కాలం చెల్లినవే. ఇతర పోలీసు విభాగాలు ఏనాడో మర్చిపోయిన .98 పిస్టల్, .38 రివాల్వర్, .303 రైఫిల్స్, 410 మస్కట్‌లను ప్రజలను రక్షించడానికి ‘పొదుపుగా’ కేటాయిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖుల రక్షణకు కేటాయించే గన్‌మెన్‌లకు మాత్రం అత్యాధునిక ఆయుధాలైన ఎస్‌ఎల్‌ఆర్, ఏకే-47, కార్బైన్‌లు ఇస్తున్నారు. పోలీసుల వద్ద ఆయుధాలు లేకపోవడం ఒక సమస్య అయితే... ఉన్న వాటిని పోలీసులు ఎంతవరకు సమర్థంగా వినియోగించగలరనేది సందేహం మరోవైపు ఉత్పన్నమవుతోంది. ఎప్పుడో శిక్షణ కాలంలో తప్ప ఆ తరవాత తుపాకీ పేల్చిన అధికారులు అరుదు. కేవలం ఏఆర్, ఏపీఎస్పీ బలగాలకే ఫైరింగ్ ప్రాక్టీసు ఉంటోంది. సాధారణ పోలీసులకూ గతంలో నిర్వహించే యాన్యువల్ ఫైరింగ్స్‌ని పోలీసులు ఇప్పుడు మర్చిపోయారు. ఓ జిల్లా ఎస్పీనో, కమిషనరేట్లకు చెందిన కమిషనరో తమ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయిద్దామనుకున్నా ఆ స్థాయిలో తూటాల సరఫరా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆయుధం అలంకార ప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘దాడులు జరగకుండా చూడాలి’
హైదరాబాద్: అత్యాధునిక ఆయుధాలు పోలీసుల వద్ద లేకపోవడం, వారి భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం ఈ ‘ఉగ్ర’దాడి ఘటనలో స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ సీపీఎం కమిటీ పేర్కొంది. భవిష్యత్‌లోనైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది.
ఎదురైతే... ఎదుర్కోగలమా?
Published Tue, Apr 7 2015 1:51 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
Advertisement