గప్‌చుప్‌గా బుల్లెట్ల అమ్మకాలు
- రివాల్వర్లకు అక్రమంగా సరఫరా
- చిత్తూరు, వేలూరుకు చెందిన ముఠాలపనే ఇది
పలమనేరు, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్ డివిజన్ తో పాటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతా ల్లో కొందరు అక్రమంగా ఉంచుకొన్న రివాల్వర్లకు చిత్తూరు, వేలూరుకు చెందిన ముఠాలు బుల్లెట్లను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తమిళనాడులోని వేలూరుకు చెందిన ఓ ముఠా తన కార్యకలాపాలను జిల్లాలో భారీగా చేస్తుండేది.
రెండేళ్ల నుంచి చిత్తూరులోనూ ఓ ముఠా బుల్లెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. బంగారుపాళెం మండలం బొమ్మాయిపల్లెకు చెందిన శరవణ చిత్తూరులో ఓ వ్యక్తి నుంచి తన రివాల్వర్‌కు సరిపోయే బుల్లెట్లను కొనుగోలు చేసేందుకు వెళ్లి వస్తుండగానే నాకాబందీలో అతని రివాల్వర్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి చిత్తూరులోనూ బుల్లెట్లను విక్రయించే ముఠా ఉన్నట్లు పోలీసులకు అర్థమైంది. అసలు ఈ ప్రాంతంలోని నాటు రివాల్వర్లకు బుల్లెట్లు ఎలా వస్తున్నాయో పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది.
పదేళ్లుగా వేలూరే ఇందుకు కేంద్రం...
ఈ ప్రాంతంలో రివాల్వర్లు కలిగిన వ్యక్తులు తమిళనాడులోని వేలూరు ముఠా నుంచి అవసరమైన బుల్లెట్లను రహస్యంగా కొనుగోలు చేసేవారు. చెన్నైలోని లెసైన్స్ డీలర్లు లెసైన్స్ కలిగిన గన్ హోల్డర్ల పరిమితిని తగ్గించి కొన్ని బుల్లెట్లను దాచి వాటిని అధిక ధరలకు విక్రయించేవారు. అయితే అక్కడి ప్రభుత్వం లెసైన్స్ డీలర్లపై నిఘాను పెంచడంతో అక్రమ బుల్లెట్ల విక్రయాలు కొంతమేరకు తగ్గాయని తెలుస్తోంది.
వేలూరు ముఠాలోని కొందరు ఏజెంట్లు ఫోన్ కాంటాక్ట్ ద్వారా పలమనేరు ప్రాంతంలోని ఆయుధాలు కలిగిన వారికి నేరుగా చేరవేసేవారనే సమాచారం కూడా ఉంది. మూడేళ్ల క్రితం స్థానికంగా నాటు రివాల్వర్‌తో పాటు మూడు బుల్లెట్లు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లో వాటిని వేలూరు నుంచే అక్రమంగా కొనుగోలు చేసినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే ఈ ముఠా కార్యకలాపాలు ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
పోలీస్ ఫైరింగ్‌లో చేతివాటం..
ఏటా పోలీసులకు నిర్వహించే పునశ్చరణ తరగతుల్లో భాగంగా ఫైరింగ్‌లో ఒక్కొక్కరికి నిర్ధేశించిన మేరకు బుల్లెట్లను పోలీస్‌శాఖలోని ఆర్మ్‌డ్ అధికారులు అందజేస్తారు. ఫైరింగ్ పూర్తయ్యాక బుల్లెట్ల నుంచి ఊడిపడే కాట్రెడ్జిలను తిరిగి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అయితే వాటిల్లో కొన్నింటిని ఫైరింగ్‌కు ఇవ్వకుండానే ఫైరింగ్ జరిగినప్పుడు గాల్లో ఎగిరిపోయాయని వారు లెక్కల్లోకి ఎక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలించుకున్న బుల్లెట్లను అమ్మకాలు జరిపే ముఠా సభ్యులు కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. రివాల్వర్ సైజును బట్టి .32, .22 బుల్లెట్లను రూ.500 వరకు నాటు రివాల్వర్లు కలిగిన వారికి విక్రయిస్తున్నట్లు సమాచారం.