నేత్రపర్వం..కలశజ్యోతి మహోత్సవం
విజయవాడ, న్యూస్‌లైన్ : బెజవాడ దుర్గమ్మ కలశజ్యోతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సత్యనారాయణపురంలోని శివరామకృష్ణక్షేత్రం నుంచి కలశజ్యోతి ప్రదర్శన ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన పుష్పకవాహనంపై శ్రీ గంగాపార్వతీసమేత మల్లేశ్వరస్వామి కొలువుదీరారు. ఉత్సవమూర్తులకు ఇన్చార్జి ఈవో త్రినాథ్‌రావు పూజాదికాలు నిర్వహించి ప్రదర్శన ప్రారంభించారు.
భవానీలు కలశాలను చేతబూని జై భవానీ, జై ైజై భవానీ నామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ప్రదర్శన కనులపండువగా సాగింది. బాల భవానీలు జ్యోతులను పట్టుకుని వడివడిగా అడుగులు వేశారు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన వాహనంతోపాటు దేవస్థాన ప్రచార రథంతో ఊరేగింపు గాంధీనగర్, అలంకార్ టాకీస్, చల్లపల్లి బంగళా మీదుగా ప్లైఓవర్ ఎక్కి కెనాల్ రోడ్డు, టోల్‌గేటు మీదుగా ఓం టర్నింగ్ వరకు సాగింది.
అక్కడ జ్యోతులను ఉంచి భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. కలశజ్యోతి ఉత్సవంలో స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాదశర్మ, మల్లేశ్వరాలయ ప్రధాన అర్చకులు యనమండ్ర మల్లయ్యశాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు మురళి, షన్ముఖ, అర్చకులు కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, యజ్ఞనారాయణ, ఆలయ ఈఈ కోటేశ్వరరావు, స్తపతి రామబ్రహ్మం, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.