'అవినీతిపై హజారే కంటే ఎక్కువ పోరాటం చేశా'
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి పి. శంకర్రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నత్తి సీఎం కిరణ్, సత్తి బొత్సకు వచ్చే నెల 7 తర్వాత ఉద్వాస తప్పదని ఆయన జోస్యం చెప్పారు. విజయవాడలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం కిరణ్ పార్టీ పెడితే పార్టీ పాతాళానికి, అందులో చేరినవారు కైలాసానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని అన్నారు. అవినీతిపై అన్నా హజారే కంటే తానే ఎక్కువ పోరాటం చేశానని ఆయన సొంత డబ్బా కొట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని అంతకుముందు శంకర్రావు అన్నారు. కిరణ్ కంటే తానే బెటర్ అని కూడా వ్యాఖ్యానించారు.