చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు. లగడపాటి ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చాలా బాగుందంటూ పొగిడారు. కాగా చంద్రబాబును లగడపాటిని కలవడం విజయవాడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు గతంలో ప్రతినబూనిన లగడపాటి... ఏకంగా చంద్రబాబుతో సచివాలయంలోనే సమావేశం కావడం టీడీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
కాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ...గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో కేశినేని ట్రావెల్స్ నడపనుంటూ ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్న తానే వ్యవస్థనే మార్చలేకపోతున్నానని, ఆ మార్పులు చూసి తట్టుకేలేక తన ట్రావెల్స్ మూసివేస్తున్నానంటూ కేశినేని నాని బాహాటంగానే నిరసన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కేశినేని నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ సీటు లగడపాటికి కేటాయించబోతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ భేటీపై ఇప్పటికే టీడీపీ వర్గాలు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే చంద్రబాబుతో తన భేటీ మర్యాదపూర్వకమే అని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.