కొత్తా కొలువులండి
సీఆర్డీఏలో నేరుగా నియామకాలు
ఖరారు చేసిన ప్రభుత్వం
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
విజయవాడ బ్యూరో : సీఆర్డీఏ ఉద్యోగుల నియామక విధానం ఖరారైంది. మంజూరైన పోస్టులను నేరుగా భర్తీ చేసుకునేందుకు సీఆర్డీఏకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏకు 778 పోస్టుల్ని మంజూరు చేసిన ప్రభుత్వం తొలి దశలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 128 మంది ఉద్యోగులను డిప్యుటేషన్పైన, సుమారు 250 మందిని నేరుగా నియమించుకునే అవకాశం ఇచ్చింది. నేరుగా జరిపే నియామకా లు ఎలా ఉండాలనేదానిపై విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పావ్), జేఎన్టీయూకే ప్రొఫెసర్లతో చర్చలు జరిపి ప్రతిపాదనలను సీఆర్డీఏ ప్రభుత్వానికి పంపింది. వాటిని ప్రభుత్వం ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది.
నియామక పద్ధతి ఇలా..
డిప్లమో, డిగ్రీ అర్హతల ద్వారా భర్తీ చేసే పోస్టులను విభజించి విభాగాలవారీగా రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, సబ్జెక్టు ప్రశ్నలు కలిసి గాని విడిగా గాని ఉంటాయి. రాతపరీక్ష ఫలితాల ఆధారంగా ప్రతి పోస్టుకు సంబంధించి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. మెరిట్ లిస్ట్ రూపకల్పనలో అభ్యర్థి అర్హత, రిజర్వేషన్ కేటగిరీ, స్థానికత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో చోటు సంపాదించిన వారికి పోస్టులవారీగా ఓరల్ పరీక్ష నిర్వహిస్తారు. అది ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్స్, రెండు కలిపి గానీ ఉంటాయి. ఓరల్ పరీక్షను వీడియోలో రికార్డు చేస్తారు. రాత పరీక్షకు 80 శాతం, ఓరల్ పరీక్షకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రిక్రూటింగ్ ఏజెన్సీగా ‘స్పావ్’
ఈ మార్గదర్శకాల ప్రకారం నియామకాలు జరిపేందుకు సీఆర్డీఏ కమిషనర్ విజయవాడ స్పావ్ను ప్రతిపాదించగా ప్రభుత్వం అనుమతిచ్చింది. సివిల్ ఇంజినీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాల్లో నిష్ణాతులైన చెన్నయ్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లను కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుని నియామక ప్రక్రియ జరపనున్నారు. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను సీఆర్డీఏ త్వరలో విడుదల చేయనుంది.