ఆ డబ్బుకు లెక్కల్లేవ్!
* సిద్ధార్థ అకాడమీలో రూ.3.8 కోట్లు స్వాధీనం
* పొంతనలేని లెక్కలు చెప్పిన యాజమాన్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ఎన్నికల అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం గా కేవలం రూ.3.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఓటర్లకు అక్రమంగా పంపిణీ చేసేందుకు డబ్బు దాచిపెట్టారని సమాచారం రావడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇన్కంటాక్స్ అధికారులు మంగళవారం దాడి చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన తనిఖీలు బుధవారం వేకువజామున 4 గంటల వరకూ జరిగాయి. అకాడమీ కోశాధికారి వెంకటేశ్వరరావు తాళాలు లేవని చెప్పటంతో మూడు బీరువా(లాకర్లు)ల ను పగులగొట్టి రూ.3.8 కోట్లు మాత్రమే ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో రూ.3.77 కోట్లు నగదు కాగా, రూ.3 లక్షల విలువైన బంగారు డాలర్ల రూపంలో ఉన్నాయని కేంద్ర ఎన్నికల అధికారి సుబ్బారాయుడు చెప్పారు. సుమారు 200 కవర్లలో రెండు, మూడు వేలు రూపాయల వంతున పెట్టి ఉన్నాయని, అవి ప్రొఫెసర్లకు సిబ్బందికి ఇవ్వడానికి ఉంచామని చెప్పారని తెలిపారు. అయితే, కేవలం కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే దొరికాయని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నగదుపై అకాడమీ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పింది. రూ. 50 లక్షలు సిబ్బం ది జీతాలకోసం, రూ. 80 లక్షలు స్థలం కొనుగోలు కోసం అకాడమీ చైర్మన్ ఇచ్చారని పేర్కొంది. కానీ సరైన ఆధారాలను చూపించలేకపోయారు. దీంతో మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. కాగా, పట్టుపడిన డబ్బు లెక్కింపుపై కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం తీరుపట్ల భన్వర్లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని గదుల్లోనూ తనిఖీలు నిర్వహించి నివేదిక పంపాలని ఆదేశించారు.