Vijayendra Saraswati
-
అయోధ్యలో పర్యటించిన విజయేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి అయోధ్యలో పర్యటించి యాగశాలలో హోమాలను, రామ మందిరంలో ప్రాణ ప్రతిస్టకు సంబంధించిన క్రతువులను పర్యవేక్షించి ఆశీర్వదించారు. అయోధ్య చేరుకున్న స్వామీజీ నేరుగా శ్రీరాముని కులదేవత అయిన దేవకాళి మందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించి, అనంతరం శంకర మఠాన్ని చేరుకున్నారు. అక్కడ ఆయనకు భయ్యా జోషి ఆహ్వానం పలికారు. అక్కడ రామ షడాక్షరి హోమాలు జరిగిన రామ సన్నిధిలో ఆయన కలశాభిషేకాన్ని నిర్వహించారు. శంకర మఠంలో రామసన్నిధిని శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రతిష్ఠించారు. అనంతరం విజయేంద్ర సరస్వతీ స్వామి అయోధ్య శంకర మఠం వెబ్సైట్ www.kanchimuttayodhya.in ప్రారంభించారు. రామజన్మ భూమికి వెళ్ళిన స్వామివారికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి శ్రీ గోవింద్ దేవ్ జీ మహారాజ్, శ్రీ జ్ఞానేశ్వర్ ద్రావిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్, ఇతర వైదిక పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. యజ్ఞశాలలో కలయదిరిగిన స్వామి అన్ని కలశాలకు పూలను సమర్పించారు. తర్వాత ప్రధాన కలశానికి మంత్రోచ్ఛారణలతో పూలను సమర్పించి హారతి ఇచ్చారు. శ్రీరాముడిపై ప్రత్యేక మంత్రాలను పూజ్యశ్రీ స్వామివారు ఉచ్ఛరించి కలశపూజ పూర్తి చేశారు. అనంతరం మందిరానికి బయలుదేరిన స్వామివారు ఈ సందర్భంగా శ్రీ జ్ఞానేశ్వర్ శాస్త్రి ద్రావిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ లు, జరుగనున్న ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు, పూజా విధి విధానాల గురించి వివరించారు. మందిరంలోకి ప్రవేశించే మొదటి మెట్టుకు కొబ్బరికాయను కొట్టి, అనంతరం గణేశుని చెక్కిన మొదటి రెండు స్తంభాలకు కొబ్బరికాయలను సమర్పించారు. అనంతరం పూజ్య శ్రీ స్వామివారు మహామంటపం, అర్ధ మంటపం సందర్శించి, తర్వాత గర్భగృహానికి వెళ్లారు. అక్కడ ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ జీ మహారాజ్, కార్యదర్శి చంపత్‌రాయ్ ఆయనకు ఆహ్వానం పలికారు. నేత్రోన్మీలనం : గర్భగుడిలో నేత్రోన్మీలనం క్రతువును ప్రారంభించి, విగ్రహానికి న్యాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముడికి ప్రత్యేక ఆభరణాలను సమర్పించారు. స్వామివారికి అర్థమంటపంలో వైదిక మంత్రోచ్ఛారణల నడుమ శాలువను బహుకరించారు. స్వామివారు తిరిగి యజ్ఞశాలకు వెళ్ళారు. ఈ సందర్భంగా దేశానికి సురక్ష, సుభిక్ష, ప్రజలకు సువిద్య కలగాలని ఆశీర్వదించారు. -
సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు
కొవ్వూరు: మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపుతుందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత దశ సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ మార్గశిర ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం వల్ల విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన మహిళా బృందం సౌందర్యలహరి పారాయణ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు, సంగీత విభావరీ, హరికథ నిర్వహించారు. -
నేటి నుంచి మహాకుంభాభిషేకం
కంచి పీఠాధీశుల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహణ శ్రీకాళహస్తి: ముక్కంటిక్షేత్రం మహాకుంభాభిషేకం మహోత్సవాలకు ముస్తాబైంది. 17ఏళ్ల తర్వాత రాహుకేతు క్షేత్రంలో కుంభాభిషేకం శోభ నెలకొంది. గురువా రం నుంచి 8వతేదీ వరకు అంగరంగ వైభవంగా కంచి పీఠాధీశులు శ్రీజయేంద్ర సరస్వతి, శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. 12వ శతాబ్దానికి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదోసారి మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారు. నాలుగో కుంభాభిషేకాన్ని 2000లో కంచి పీఠాధీశుల పర్యవేక్షణలో వేడుకగా నిర్వహించారు. మరోసారి ఆయన సారథ్యంలోనే ఈసారి కూడా సంప్రదాయపద్ధతులను అనుసరిస్తున్నారు. ఆ యన శిష్య బృందం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతున్నారు. 2వతేదీన గాలిగోపురం కుంభాభిషేకం, గణపతి హో మం, వాస్తుశాంతి, 3వతేదీ గోపూజ, ధనపూజ, మత్స్యగ్రహణం, 4వతేదీ యాగప్రవేశం కుంభస్థాపన, నైవేద్యాలు, దీపారాధన, 5వ తేదీన పరివార దేవతల గోపురాలకు కంచుగడప గోపురానికి స్వర్ణ కలశ స్థాపన, 6వతేదీన యాత్రదానం, యాగపూజ, కుంభోద్వాసన, 7వ తేదీన స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి వార్ల విమాన గోపురాలకు స్వర్ణ కలశస్థాపన, 8న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి కుంబాభిషేకంతో మహాకుంభాభిషేకం మహాత్సోవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో 4 నుంచి 8వ తేదీ వరకు స్వామి,అమ్మవార్ల మూలవిరాట్ దర్శనాలు రద్దు చేశారు. అలంకార మండపంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాత్రమే భక్తులు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. -
'పుష్కరస్నానంతో ఈశ్వరకటాక్షం'
అనుష్టాన కేంద్రాన్ని సందర్శించిన విజయేంద్ర సరస్వతి ఆత్రేయపురం : పుష్కర స్నానంతో ఈశ్వర కటాక్షం లభిస్తుందని కంచి కోమకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అన్నారు. మండల కేంద్రం ఆత్రేయపురం శివారు ఆగ్రహరంలో శనివారం రాత్రి అనంత విభూషిత చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుష్టాన కేంద్రాన్ని కంచికామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి సందర్శించి భక్తులకు ప్రవచనాలు చేశారు. గోదావరి తీరంలో శాస్త్రోత్తంగా పుష్కరస్నానం అచరిస్తే ఈశ్వర కటాక్షం లభిస్తుందన్నారు. హిందూ ధర్మ ప్రకారం పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు ఆచరించడం ద్వారా శ్రేయస్కరమన్నారు. గోదావరిలో స్నానం ఆచరించడం ద్వారా ఏడేడు జన్మల పుణ్య ఫలాలు లభిస్తాయన్నారు. విజయేంద్ర సరస్వతికి నిర్వాహకులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎస్.జానకిరామయ్య, ఎ.ప్రభాకర్‌రావు, శ్రీపాద గణేష్ శర్మ, ట్రెజరర్ సీహెచ్ రాధాకృష్ణ, సెక్రటరీ బీహెచ్ సత్యనారాయణ, మెంబర్లు ఐ.పద్మావతి, సిహెచ్ సత్యమూర్తి, చందు, మాధవరావు పాల్గొన్నారు.