ఎవరీ వికారుద్దీన్...
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వికారుద్దీన్ అసలెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. మారు వేషాలతో పోలీసులను బురిడీ కొట్టించటంలో దిట్ట. వికారుద్దీన్ అసలు పేరు వికార్ అహ్మద్. అయితే అందరికీ తెలిసిన పేరు అలీభాయ్. స్వస్థలం హైదరాబాద్లోని ఓల్డ్ మలక్ పేట్.
వికారుద్దీన్ చిన్నప్పటి నుంచే మత సంబంధ కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్నాడు. దర్స్ గా జిహాద్ ఏ షహదత్... సంస్థలో శిక్షణ పొందిన తరువాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ముసారాంబాగ్ కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాది బిలాల్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. మే 18, 2007 లో మక్కా పేలుళ్లు జరిగిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
బంగ్లాదేశ్, ఖతర్, ఒమన్, దుబాయ్లో ఉగ్రవాదంపై వికారుద్దీన్ శిక్షణ పొందాడు. 2007 మే 18 మక్కా పేలుళ్లు జరిగింది. అప్పటి నుంచి ప్రతిఏటా అదే రోజున ఏదో ఒక అలజడి సృష్టించటం అలవాటుగా చేసుకున్నాడు.. 2008లో మే 18న సంతోష్ నగర్లో కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయాడు.
2009 మే 18 న ఫలక్ నామాలో డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ సంఘటనలో బాలస్వామి అనే హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో ప్రతి సంవత్సరం ఇలాగే పోలీసులపై దాడులు చేస్తానని తెహరిక్ గల్బా యే ఇస్లాం పేరుతో లెటర్ రాసిపెట్టిన వికారుద్దిన్ అనూహ్యంగా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.