మనిషి మూడు రకాల రుణాలతో జన్మిస్తాడు
శంకర విజయేంద్ర సరస్వతి
రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రతి మనిషి దేవరుణం, రుషి రుణం, పితృరుణం అనే మూడు రకాల అప్పులతో జన్మిస్తాడని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని నందం గనిరాజు సెంటరులో కందుకూరి శివానందమూర్తి సత్సంగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. తపస్సు ద్వారా దేవతల రుణాన్ని, వేదాధ్యయనం ద్వారా రుషి రుణాన్ని, సంతానం ద్వారా పితృరుణాన్ని తీర్చుకోవాలన్నారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే తాపత్రాయాలతో మనిషి జీవితం గడుపుతాడు కానీ, సత్సంగాన్ని మనిషి అలవరుచుకోవాలని హితవు చెప్పారు. ఆత్మనియంత్రణ, ఆత్మపరిశోధన చాలా అవసమని, ఆత్మానుభూతి కలిగితే, ఇక లోకంతో పని ఉండదన్నారు. సర్వసంగ పరిత్యాగం అందరికీ కుదరదని, దేశభక్తి, దైవభక్తి, సంస్కృతభాషాభిమానం, సదాచారంపై ఆసక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. సత్సంగం నిర్వాహకులు వాడ్రేవు మల్లపరాజు దంపతులు, వాడ్రేవు వేణుగోపాల్ దంపతులు, ప్రముఖ ఆడిటర్ వి.భాస్కరరామ్, డాక్టర్ టీవీ నారాయణరావు, ప్రముఖ న్యాయవాది మామిడన్న శేషగిరిరావు పాల్గొన్నారు.
వేద విద్యార్థులతో ముఖాముఖి
కార్యక్రమానికి హాజరైన వేదవిద్యార్థులతో శంకర విజయేంద్ర సరస్వతి ముఖాముఖి మాట్లాడారు. అగ్నికార్యమంత్రాలు విద్యార్థులు చదువుతుంటే ఆసక్తిగా విన్నారు. మేధావీ భూయాసం, తేజస్వీభూయాసం ఇత్యాదులను పలుకుతున్నప్పుడు, వేళ్లతో శిరస్సును, ఇతర అంగాలను ఎలా తాకాలో చూపించారు.