శవాన్ని వదిలి పరిగెత్తారు
కరీంనగర్: తేనెటీగలు తరచూ మనుషులపై దాడి చేసి తమ సత్తా చూపుతున్నాయి. అవి ఊరకనే ఎందుకు దాడి చేస్తాయి? వాటిని కదిలిస్తేనో, వాటికి ఇబ్బంది కలిగిస్తేనో దాడి చేస్తుంటాయి. తేనెటీగల దాడి వల్ల కొన్ని సందర్భాలలో ఆస్పత్రిపాలుకావలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు బోయిన్పల్లి మండలంలో శవాన్ని శ్మశానానికి తీసుకువెళుతున్నవారిపై తేనెటీగలు దాడి చేయడంతో వారు శవాన్ని అక్కడే వదిలి దౌడు తీశారు. విలాసాగర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శవయాత్ర నిర్వహిస్తున్న వారిపై అవి దాడి చేయడంతో జనం ఒక్కసారిగా తోచుకుంటూ పరుగులు తీశారు. ఆ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శవయాత్ర సందర్భంగా సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. ఆ కడ్డీల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న తేనె తుట్టిపై సోకడంతో అవి దాడి చేసినట్లు భావిస్తున్నారు.
గత నెలలో వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో ఆదిమానవులు గీచిన చిత్రాలు చూసేందుకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులపైన తేనెటీగలు దాడి చేయడంతో 24 మంది ఆస్పత్రి పాలయ్యారు. తేనెతుట్టెపై కొందరు విద్యార్థులు సరదాగా రాళ్లు విసరడంతో అవి ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను, ఉపాధ్యాయులను కుట్టివదిలిపెట్టాయి. వారికి ముద్దనూరు, జమ్మలమడుతు ఆస్పత్రులలో చికిత్స చేశారు. అందు వల్ల తేనెటీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా!