ఎన్సీపీ నేత హత్యకేసు పునర్విచారణ
సాక్షి, ముంబై: 2004లో జరిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విలాస్ జాదవ్ హత్య కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. వచ్చే నెలలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో శివసేన తరఫున ఏరోలి నియోజక వర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్ చౌగులే ఇబ్బందుల్లో పడిపోయారు.
ఈ హత్య కేసుతో చౌగులేతోపాటు మరో ఇద్దరికి సంబంధాలున్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకు తగిన సాక్షాధారాలు లభించకపోవడ ం వల్ల వీరంతా నిర్దోషులుగా విడుదలయ్యారు. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ విచారణ ప్రారంభించారు. తప్పకుండా తమకు న్యాయం జరుగుందని అతని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ వివాదాల కారణంగానే..
నవీ ముంబైలోని దిఘా రామ్నగర్ ప్రాంతంలో ఉంటున్న విలాస్ జాదవ్, విజయ్ చౌగులే మధ్య రాజకీయ వివాదం ఉంది. పలుమార్లు జాదవ్ ఇంటిపై దాడులు కూడా చేసినట్లు అప్పట్లో చౌగులే పై ఆరోపణలు వచ్చాయి.
చివరకు 2004 జూలై ఏడో తేదీన జాదవ్ హత్యకు గురికావడంతో ఇది చౌగులే చేశాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తరువాత ఈ కేసు పలుమార్లు కోర్టుకు విచారణకు వచ్చినప్పటికీ తగిన సాక్షాలు లేకపోవడంతో ఇతనితోపాటు మరో ఇద్దరు సహచరులు నిర్ధోషులుగా విడుదలయ్యారు.
ఈ హత్య తమ కళ్ల ముందే చేశారని ఆరోపిస్తూ మరోసారి బాధితులు కోర్టులో అపిల్ చేసుకున్నారు. ఈ కేసు పునర్విచారణ జరపాలని 2012 సెప్టెంబర్ 23న అత్యున్నత న్యాయస్థానం హై కోర్టును ఆదేశించింది. ఆ ప్రకారం ఈ హత్యకేసు ఇప్పుడు మళ్లీ విచారణకు రావడం చర్చనీయాంశమైంది.