3.65 లక్షల పింఛన్లు నిలబెట్టిన ‘సాక్షి’
► బాధితుల తరఫున వరుస కథనాలతో కదలిన రాష్ట్ర ప్రభుత్వం
► లక్షల సంఖ్యలో అర్హులేనని పునఃపరిశీలనలో తేలిన వైనం
► రద్దు చేసిన పింఛన్లు దాదాపు 10 లక్షలు
► ‘ఆధార్’తో రద్దైన వాటిల్లోనే 3.65 లక్షలు సక్రమమే
సాక్షి, హైదరాబాద్: వంద కాదు రెండు వందలు కాదు.. దాదాపు ఒక జిల్లా మొత్తం పింఛనుదారుల సంఖ్యకు సమానమైన పింఛన్లను ‘సాక్షి’ నిలబెట్టగలిగింది. ముదిమి వయసులో ఆసరా కోసం ఎదురు చూసే వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం రద్దు చేస్తే ‘సాక్షి’ ఆ బాధితుల గొంతుకై జరిగిన అన్యాయాన్ని జనం ముందు ఉంచింది. ప్రజలతో కలసి ‘సాక్షి’ చేసిన పోరాటం ఫలించింది. పునఃపరిశీలన చేసిన సర్కారు అనర్హులంటూ తొలగించిన 3.65 లక్షల మందిని తిరిగి అర్హులుగా గుర్తిస్తూ పింఛన్లను మంజూరు చేసింది. డిసెంబర్ నెల నుంచే తిరిగి వారికి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించింది.
3.65 లక్షలు అర్హులే
ప్రభుత్వం నియమించిన గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలు 3,34,569 మంది పింఛనుదారులను అనర్హులుగా తేల్చగా.. ఆధార్‌తో అనుసంధానం అనంతరం మరో 4.19 లక్షల మంది అనర్హులని సర్కారు తేల్చింది. గ్రామ కమిటీల పరిశీలన నివేదికలు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి అందక సుమారు మరో 1.62 లక్షల మంది అనర్హులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్‌లో 9,16,310 మంది పింఛన్లను నిలిపివేసింది. అయితే ఆధార్ అనుసంధానం సమయంలో అనర్హులుగా తేలిన 4.19 లక్షల మంది పింఛన్ల విషయంలో మాత్రమే పునఃపరిశీలనకు ఆదేశాలిచ్చింది. వీటిపై పునఃపరిశీలన చేసిన అధికారులు 3.65 లక్షల మంది పింఛన్లకు అర్హులేనని నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. కేవలం ఆధార్ కాకుండా తొలగించిన మొత్తం ఫించనుదారుల విషయంలో ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఉంటే మరింత మంది అర్హులుగా తేలే అవకాశం ఉండేదంటున్నారు.
3,72,655 కొత్త పింఛన్లు మంజూరు
ఏరివేత సమయంలో కొత్త ఫించన్ల కోసం కమిటీలకు దాదాపు ఐదున్నర లక్షల దరఖాస్తులు అందగా పరిశీలన తరువాత 3,72, 655 పింఛన్లు కొత్తగా మంజూరు చేస్తున్నట్టు అక్టోబరు 25వ తేదీన ప్రభుత్వం జీవో ఇచ్చింది. అనర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత అక్టోబరులో పెరిగిన ఫించన్లకు అర్హులుగా తేల్చిన 33,96,223 మందికి తోడు కొత్తగా మంజూరు చేసిన 3,72, 655 మంది, తాజాగా అర్హులుగా తేల్చిన 3.65 లక్షల మందితో కలిపి డిసెంబరులో దాదాపు 41 లక్షల మందికి పింఛన్లు చెల్లిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. జన్మభూమిమరో 5 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవి పరిశీలనలో ఉన్నాయి.
నిలదీసిన బాధితులు
ఏళ్ల తరబడి ఫించన్లు తీసుకుంటున్న వారిని అనర్హులంటూ టీడీపీ ప్రభుత్వం దాదాపు పది లక్షల మంది పింఛన్లను తొలగించింది. సెప్టెంబరు వరకు రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 43.12 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా 15 రోజుల వ్యవధిలో తనిఖీల పేరుతో 9.16 లక్షల మందిని ఏరి వేశారు. పింఛన్లను 33,96,223 మందికి కుదించారు. వెయ్యి రూపాయలకు పెంచిన పింఛన్లును వీరికి మాత్రమే అందజేశారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పింఛను పొందుతున్న సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మకు ఐదెకరాలకంటే ఎక్కు వ భూమి ఉందంటూ ఆమెను జాబితా నుంచి తొలగించారు. గుంటూరు జిల్లా సంతగుడిపాడులో పూరి గుడిసెలో అద్దెకు ఉంటున్న షేక్ గాలిబ్ సాహెబ్‌కు ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉందని సాకు చూపి పింఛను తొలగిం చారు.
ఈ నేపథ్యంలో అర్హత ఉన్నా పింఛన్లు కోల్పోయిన వారి అక్రోశాన్ని ‘సాక్షి’ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కళ్లకు కట్టినట్టు వివరించింది. ఈ ప్రక్రియలో రాజకీయాలు జొప్పిస్తున్నారంటూ ‘సాక్షి’ తప్పుపట్టింది. దీంతో బాధితులు అధికారులు, టీడీపీ నేతలను నిలదీయడంతో పునఃపరిశీలనకు నిర్ణయించిన ప్రభుత్వం 3.65 లక్షల మందిని తిరిగి అర్హులుగా గుర్తించింది.