న్యాయం.. జైలు పాలు
నవనిర్మాణ దీక్షలో అవినీతిపై గళం విప్పిన మహిళ
ఆరోపణలు అవాస్తవమని ఆర్డీఓ నివేదిక
ఆర్డీఓతో వాగ్వాదానికి దిగిన మహిళ, సీపీఐ నేతలు
నలుగురిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు
అరెస్ట్ చేసిన పోలీసులు
నంద్యాల: పొలం పాసు పుస్తకం కోసం రూ.10వేలు లంచం ఇచ్చినా, భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ.5వేలు ఇచ్చినా అధికారులు పని చేయలేదని నవనిర్మాణదీక్షలో నిలదీసిన మహిళపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. న్యాయం చేయమని అడిగిన ఆమెను, మద్దతుగా నిలిచిన సీపీఐ నేతలపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈనెల 7వ తేదీన ఆళ్లగడ్డలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సదస్సులో వితంతువు విమలారాణి.. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులకు షాక్ ఇచ్చింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో అవినీతి అధికమైందని, ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, లంచాలు తీసుకున్నా, పనులు చేయడం లేదని ఆరోపించింది. తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ.5వేలు, పొలం పాసు పుస్తకం కోసం రూ.10వేలు లంచం తీసుకున్న అధికారులు ఏడాది గడిచిన పనులు కూడా చేయలేదని చెప్పింది. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి స్పందించి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని చెప్పారు.
ఈ మేరకు ఆమె శుక్రవారం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. అయితే ఆర్డీఓను కలిసే అవకాశం ఇవ్వలేదు. మధ్యాహ్నం వరకు ఆమె కార్యాలయం ప్రాంగణంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆమెకు సీపీఐ నేత మురళీ, మరో ముగ్గురు నేతలు అండగా నిలబడ్డారు. వీరు ఆర్డీఓ వద్దకు వెళ్లి విమలారాణికి మద్దతుగా మాట్లాడారు. అయితే విమలారాణి ఆరోపణలు సరిగ్గా లేవని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో ఆర్డీఓ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో త్రీటౌన్ పోలీసులు విమలారాణి, సీపీఐ నేత మురళీ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని సీఐ వెంకటరమణ తెలిపారు. తన అనుమతి లేకుండా చాంబర్లోకి ప్రవేశించారని, విధులకు ఆటంకం కల్పించారని ఆర్డీఓ ఫిర్యాదును అందజేశారని, ఈ మేరకు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశామని చెప్పారు.
అవినీతిని ప్రశ్నించినందుకే
తాము అవినీతిని ప్రశ్నించినందుకే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ పాలు చేశారని సీపీఐ నేత మురళీ తెలిపారు. విమలారాణి ఫిర్యాదు చేశాక రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే విచారణ జరిపి అవాస్తవమని తేల్చారని చెప్పారు. ఆరోపణలకు గురైన అధికారితోనే విచారణ జరిపిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డీఓను నిలదీయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.