Vinaykumar
-
హిజ్బుల్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్‌గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు. పుల్వామా జిల్లా మలంగ్‌పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
‘అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం'
కోల్‌కతా: నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టుకు కప్ అందించిన దినేశ్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా బౌలర్ వినయ్‌కుమార్, కార్తీక్ గొప్ప ఆటగాడని, అంతకు మించి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడాడు. వీరిద్దరు ఐపీఎల్లో కోల్‌కతా తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గౌతం గంభీర్ కోల్‌కతా జట్టును విడిచి ఢిల్లీకి వెళ్లడంతో టీం మేనేజ్ మెంట్ దినేశ్ కార్తీక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. దీనిపై స్పందించిన వినయ్‌కుమార్.. తమిళనాడు, ఇండియా రెడ్ జట్లకు కార్తీక్ నాయకత్వం వహించాడని, ఆ అనుభవంతో కోల్‌కతా జట్టును ఐపీఎల్లో విజయతీరాలకు తీసుకెళ్తాడని ఈ కర్ణాటక కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న జట్టుపై సంతృప్తి వ్యక్తం చేసిన వినయ్.. సీనియర్లు, జూనియర్లతో సమతుల్యంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆంపైర్ సమీక్షా పద్దతిని ప్రవేశ పెట్టడం ద్వారా ఆటగాళ్లకు ఎంతో మేలు కలుగుతుందని వినయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రంజీలో కూడా డీఆర్ఎస్ ప్రవేశపెడితే బాగుంటుందని వినయ్ అభిప్రాయపడ్డాడు. -
అమ్మా, బైబై..
స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం చిన్నారిని చిదిమేసిన వాహనం అమ్మా, బైబై.. అంటూ స్కూల్‌కు బయల్దేరిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరాడు. ఓ వాహనం బాలుడిపైకి దూసుకు రావడంతో దుర్మరణం చెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. - తూప్రాన్ తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన కొత్తపల్లి శోభ, శంకర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు గ్రామ శివారులో నివాసం ఉంటున్నారు. చిన్న కుమారుడు వినయ్‌కుమార్ (10) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో తల్లికి బైబై.. చెబుతూ బయలుదేరాడు. జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టావేరా వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనగా వినయ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అదే వాహనంలో రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. గజ్వేల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ వెంకటేశం తెలిపారు. తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో తల్లిదండ్రులు... ప్రమాద వార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చిన్నారి జ్ఞాపకాలను తలుచుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినయ్‌కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.