అమ్మా, బైబై.. | student die in bus accident | Sakshi
Sakshi News home page

అమ్మా, బైబై..

Published Sun, Nov 29 2015 1:07 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

అమ్మా, బైబై.. - Sakshi

అమ్మా, బైబై..

స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం
 చిన్నారిని చిదిమేసిన వాహనం
 అమ్మా, బైబై.. అంటూ స్కూల్‌కు బయల్దేరిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరాడు. ఓ వాహనం బాలుడిపైకి దూసుకు రావడంతో దుర్మరణం చెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
                                                                                                                                 - తూప్రాన్

 తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన కొత్తపల్లి శోభ, శంకర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు గ్రామ శివారులో నివాసం ఉంటున్నారు. చిన్న కుమారుడు వినయ్‌కుమార్ (10) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో తల్లికి బైబై.. చెబుతూ బయలుదేరాడు. జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టావేరా వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనగా వినయ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అదే వాహనంలో రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. గజ్వేల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ వెంకటేశం తెలిపారు. తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.
 
 శోకసంద్రంలో తల్లిదండ్రులు...
 ప్రమాద వార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చిన్నారి జ్ఞాపకాలను తలుచుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినయ్‌కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement