virabhadra swamy
-
ఉత్కంఠ భరితం.. పిడకల సమరం
ఆస్పరి, న్యూస్‌లైన్: దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం గ్రామానికి పెద్ద సంబరం. గ్రామస్తులంతా రెండుగా విడిపోయి పిడకలతో తలపడటం, ఆతరువాత అంతా కలసిపోయి ఆనందాన్ని పంచుకోవడం మండలంలోని కైరుప్పల గ్రామ ప్రత్యేకత. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పిడకల సమరం వేలాది మంది జనం మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. అరగంటపాటు సాగిన నుగ్గులాట చివరకు ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలే కాకుండా కర్ణాటక, మహరాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాతో రెండు గ్రూపులుగా విడిపోయి పిడకలతో దాడి చేసుకోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు. సమరంలో ముందుగా ఆనవాయితీగా కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్తుడు విష్ణువర్దన్‌రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి గుర్రంపై కైరుప్పల గ్రామంలోకి మంది మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో చేరుకున్నాడు. ఆయన దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే పిడకల సమరం మొదలైంది. గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటు ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటు గుంపులు, గుంపులుగా కదిలారు. తమ వర్గం గెలవాలనే తపనతో మహిళలు పురుషులకు పిడకలు అందిస్తు సాయంగా నిలిచారు. అక్కడ కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు ఈపోరు కొనసాగింది. దాదాపు 70 మందికి పైగా గాయపడ్డారు. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు పూసుకున్నారు. జనంతో కైరుప్పల కిట కిటలాడింది. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి రాంప్రసాద్, సర్పంచ్ శరవన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పిడకల సమరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, కిరణ్ ఆధ్వర్యంలో 80 మంది పోలీస్ బందో బస్తు నిర్వహించారు. పిడకల సమరం ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. -
పులకించిన కొత్తకొండ
కొత్తకొండ(భీమదేవరపల్లి), న్యూస్‌లైన్: మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. పలుప్రాంతాల నుంచి వీరంతా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. బ్రహ్మోత్సావాల్లో భోగి, సంక్రాంతి బండ్లు తిరిగే ఘట్టాలు ఈ నెల 14, 15తేదీల్లో ఉన్నా సోమవారం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. కోడె కట్టుట, తలనీలాల సమర్పణ, గండదీపం వద్ద పూజలు చేసేందుకు భక్తులు ప్రత్యేక దర్శనాల వద్ద క్యూ కట్టారు. చైర్మన్ చిట్టంపల్లి అయిలయ్య, ఈవో రామేశ్వర్రావు, ప్రధాన అర్చకుడు తాటికొండ వీరభద్రయ్య, అర్చకులు రాజన్న, సదానందం, రాంబాబు, వినయ్‌శర్మ, ధర్మకర్తలున్నారు. వాహనాలకు నో ఎంట్రీ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా మూడుచోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తె ప్రమాదం ఉన్నందున వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేస్తున్నారు. హుజూరాబాద్ డీఎస్సీ సత్యనారాయణరెడ్డి, హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్, ముల్కనూర్ ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో 500మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.