అఖిలేశ్ యాదవ్‌కు సుప్రీంకోర్టు వార్నింగ్!
న్యూఢిల్లీ: లోకాయుక్త నియామకం విషయంలో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇక తామే తేల్చుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహంగా వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా మాజీ జడ్జి వీరేంద్రసింగ్ నియామకాన్ని కొనసాగించాలా? లేక రద్దుచేయాలా? అన్నది తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
దాదాపు ఏడాది జాప్యం తర్వాత గత నెలలో యూపీ లోకాయుక్తగా జస్టిస్ (రిటైర్డ్) వీరేంద్రసింగ్‌ను సుప్రీంకోర్టును నియమించింది. అయితే, ఈ నియామకం విషయంలో యూపీ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టించిందని, ఈ నేపథ్యంలో ఈ నియామకం సరైనదా? కాదా? అన్నది తామే నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన కమిటీ వీరేంద్రసింగ్ నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
అయితే, జస్టిస్ వీరేంద్రసింగ్‌కు సరైన వ్యక్తిత్వం లేదని అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. యూపీ ప్రతిపక్ష నాయకుడు, బీఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య కూడా ఈ నియామకాన్ని వ్యతిరేకించినట్టు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో తమను తప్పుదోవ పట్టించిన అఖిలేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకాయుక్త నియామకం విషయం తామే చూసుకుంటామని తేల్చి చెప్పింది.