virinchi Healthcare Solutions
-
ఎన్ఎస్ఈలో విరించి లిస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విరించి లిమిటెడ్ తాజాగా తమ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎక్సే్చంజీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు మాధవీ లత కొంపెల్ల, లోపాముద్ర కొంపెల్ల, ఈడీ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంటను మోగించడం ద్వారా షేర్ల లిస్టింగ్‌ను ప్రకటించారు. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు ఎన్ఎస్ఈలో లిస్టింగ్ దోహదపడగలదని వారు పేర్కొన్నారు. ఐటీ, హెల్త్ కేర్, పేమెంట్ తదితర సర్వీసులు అందించే విరించి షేర్లు ఇప్పటికే బీఎస్ఈలో ట్రేడవుతున్నాయి. సంస్థ షేరు బుధవారం ఎన్ఎస్ఈలో రూ. 35.70 వద్ద క్లోజయ్యింది. -
‘విరించి’పై వేటు!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్న మరో కార్పొరేట్ ఆస్పత్రిపై ప్రభుత్వం వేటు వేసింది... సదరు ఆసుపత్రికి ఇచ్చిన కోవిడ్ చికిత్సల అనుమతిని రద్దు చేసింది. ఇప్పటికే ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్సలందించాలని స్పష్టం చేసింది. ఇకపై కొత్త కేసులను తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నంబర్–1లో ఉన్న విరించి ఆస్పత్రి కోవిడ్ చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అబిడ్స్‌కు చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి జూలై 22న విరించి ఆస్పత్రిలో చేరగా.. 31న మృతి చెందారు. కేవలం 8 రోజులకు రూ. 8 లక్షలకుపైగా బిల్లు వేశారు. ఇందులో 246 పీపీఈ కిట్లు వాడినట్లు చూపించి రూ.2,23,560 బిల్లు వేయడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఇదే అంశంపై ‘పీపీఈ కిట్లు...రూ.2,23,560’ శీర్షికతో ఆగస్టు 1న ‘సాక్షి’ సిటీ ఎడిషన్‌లో ప్రత్యేక కథనం ప్రచురించింది. అదే విధంగా కోవిడ్ వ్యర్థాల నిర్వహణ, తరలింపు విషయంలోనూ ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటు జలమండలి సహా ట్రాఫిక్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే అంశంపై ‘జనావాసాల మధ్య నుంచే కోవిడ్ వ్యర్థాలు... బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’ సిటీ ఎడషన్‌లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. వీటితో పాటు కోవిడ్ చికిత్సల పేరుతో చంపాపేటకు చెందిన ఓ యువ న్యాయవాది నుంచి రూ.16 లక్షలకుపైగా బిల్లు వసూలు చేశారని వైద్య ఆరోగ్యశాఖ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు అందింది. వరుస కథనాలకు తోడు బాధితుల ఫిర్యాదులకు స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో కోవిడ్ చికిత్సలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా విరించిపై వేటు వేయడం కొసమెరుపు. -
వేలికి చికిత్స కోసం వస్తే..
సాక్షి, సిటీబ్యూరో: ఎడమపాదం చిటికెన వేలికి చికిత్స చేయించుకుంటే..చివరకు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. నడుచుకుంటూ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి విగత జీవిగా మారాడు. మృతుని బంధువులకు సమాచారం ఇవ్వకుండానే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన సంఘటన ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలియడంతో బంధువులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులను నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి చనిపోయాడని,. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు చేశారు. బాధితుల పిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం, రామవరానికి చెందిన సంగీతరావు(53) సింగరేణి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అతడి భార్య పదేళ్లక్రితమే మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కుటుంబానికి ఆయనే పెద్దదిక్కు. గత కొంతకాలంగా సంగీతరావు ఎడమకాలి చిటికెన వేలిలో రక్తం గడ్డకట్టింది. రక్తప్రసరణ లేకపోవడంతో వేలిపై వాపు వచ్చి ఇన్ఫెక్షన్ సోకి చీముకారుతోంది. చికిత్స కోసం స్థానిక సింగరేణి ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, వేలిని తొలగించాల్సి ఉంటుందని సూచించారు. మెరుగైన చికిత్స కోసం విరించి ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అడ్మిట్ కావడంతో పరీక్షించిన వైద్యులు కాలి వేలికి రక్తం సరఫరా నిలిచిపోయినందున, సర్జరీ చేయాల్సి ఉందని సూచించారు. ఇందుకు ఆయన అంగీకరించడంతో ఈ నెల 22న ఎడమ కాలి చిటికెన వేలికి శస్త్రచికిత్స చేసి, ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పిన వైద్యులు ప్రస్తుతం సర్జరీ సమయంలో మత్తుమందు ఇచ్చినందున మగతగా ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులకు చెప్పారు. ఆ మరుసటి రోజు కూడా అతను స్పృహలోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు వైద్యులను నిలదీశారు. అప్పటికే సంగీతరావు కోమాలోకి వెళ్లిపోవడంతో ఐసీసీయూలోకి తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్యులు నమ్మబలికారు. తీరా ఆదివారం రాత్రి 11.43 నిమిషాలకు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు బంధువులకు కనీసం సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోలీసుల సహాయంతో గాంధీ మార్చురీకి తరలించారు. దీనిపై సమాచారం అందడంతో బంధువులు ఆస్పత్రికి చేరుకునేందుకు ముందే పోలీసులు భారీగా అక్కడ మోహరించడం, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆరోగ్యంగా స్వయంగా ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి.. సర్జరీ తర్వాత చనిపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్డియో ఫల్మొనరీ ఫెయిల్యూర్‌తోనే మృతి: ‘విరించి’ యాజమాన్యం సంగీతరావు ఎడమపాదం చిన్నవేలికి పుండుతో పాటు వాపు, చీముకారుతుండటం, ఇన్ఫెక్షన్ తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. మధుమేహం, హైపర్‌టెన్షన్, రెస్ట్ఫెయిన్ సమస్యలు ఉన్నాయి. స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. వాపు వల్ల పక్కన ఉన్న చర్మం కూడా దెబ్బతింది. నిపుణులతో కూడిన వైద్య బృందం అతడికి చికిత్స చేసింది. ఆ తర్వాత రోజు ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించాం. కార్డియో ఫల్మొనరీ అరెస్ట్‌తో మృతి చెందాడు. ఇందులో ఎలాంటి వైద్యపరమైన నిర్లక్ష్యం లేదు. -
ఒకే చికిత్సతో రెండు సమస్యలకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: టైప్–2 డయాబెటిస్ సహా అధిక బరువుతో బాధపడుతున్న బాధితులకు శుభవార్త. ఒకే చికిత్సతో రెండు రకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంది. క్లిష్టమైన ఈ అరుదైన చికిత్స ‘లియల్ ఇంటర్ పొజిషన్ సర్జరీ’ని బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అందిస్తున్నారు. తాజాగా ల్యాప్రోస్కోపిక్ ప్రక్రియలో నలుగురు బాధితులకు ఈ తరహా చికిత్స చేశారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా ఈ తరహా చికిత్సలు వెయ్యికి పైగా నిర్వహించగా, 80 శాతానికి పైగా సక్సెస్ రేటు సాధించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రియోడిపౌలా, డాక్టర్ సురేంద్ర ఉగాలా, డాక్టర్ అమర్.వి, డాక్టర్ అభిషేక్ కటక్వార్, డాక్టర్ నాగేశ్వర్రావు, డాక్టర్ దీపక్‌తంపి, డాక్టర్ ఆయూస్ కౌగాలేల బృందం చిన్నపేగు మార్పిడి చికిత్స ‘లియల్ ఇంటర్ పొజిషన్ సర్జరీ’కి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ తరహా చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, పెద్దపేగు సైజును తగ్గించడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. దేశంలో చాలా తక్కువ మంది వైద్యులు మాత్రమే ఈ తరహా చికిత్స చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మందులు, ఇన్సులిన్ వాడుతున్న వారు లియల్ ఇంటర్ పొజిషన్ సర్జరీ తర్వాత ఆ మందులు వాడాల్సిన అవసరం ఉండదని వైద్యులు స్పష్టం చేశారు. సర్జరీ ఎలా చేస్తారంటే? పెద్దపేగు కింద చిన్నపేగు మధ్యలో పాంక్రియాస్ ఉంటుంది. తీసుకున్న ఆహారం పెద్దపేగు నుంచి చిన్నపేగుకు చేరుకునే మార్గం మధ్య(పెద్దపేగు, చిన్నపేగు కలిసే ప్రదేశం)లో బీటాసెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత చిన్నపేగు చివరి భాగంలో అంతే మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా మధుమేహుల్లో పాంక్రియాస్ నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చిన్నపేగు చివరి భాగాన్ని కట్ చేసి, దాన్ని పెద్దపేగు చివరి భాగంలో అమర్చడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి వేగంగా జరిగి శరీరానికి అందిస్తుంది. టైప్–1 మధుమేహులకు ఈ చికిత్స పనికిరాదు. కేవలం టైప్–2 మధుమేహం సహా అధిక బరువుతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈ చికిత్స చేస్తారు. పెద్దపేగు సైజును కూడా తగ్గిస్తారు. దీని వల్ల తిన్న వెంటనే కడుపు నిండిపోయి చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. ఒక చికిత్సతో రెండు రకాల ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ తరహా చికిత్సకు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. -
నాలుగేళ్లలో 5వేల పడకలకు!
♦ ఏడాది చివరికల్లా వెయ్యి పడకల ఆసుపత్రులు ♦ వచ్చేనె ల్లో బంజారాహిల్స్ ఆసుపత్రి ప్రారంభం ♦ 600 పడకలు; 300 కోట్ల వ్యయం ♦ వైద్యానికి టెక్నాలజీని జోడించటమే మా ప్రత్యేకత ♦ ‘విరించి’ సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల సాక్షి, బిజినెస్ బ్యూరో: ‘‘వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులొస్తున్నాయి. కానీ అవి మన దేశంలో అందుబాటులోకి రావటానికి చాలాకాలం పడుతోంది. టెలీ మెడిసిన్, రొబోటిక్ సర్జరీలు కూడా జరుగుతున్న ఈ రోజుల్లోనూ ఇంత సమయం పట్టడం సరికాదు’’ అని ‘విరించి’ సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల చెప్పారు. ఐటీ సొల్యూషన్స్‌తో మొదలుపెట్టిన ఈ సంస్థ హెల్త్‌కేర్ టెక్నాలజీస్‌పై దృష్టిపెట్టింది. నూరు శాతం అనుబంధంగా ఉన్న ‘విరించి హెల్త్‌కేర్ సొల్యూషన్స్’ ద్వారా ఇప్పటికే హైదరాబాద్‌లోని బర్కత్‌పుర, హయత్‌నగర్‌లో రెండు ఆసుపత్రులుండగా... బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్-1లో 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తోంది. వచ్చేనెలలో ఇది ఆరంభం కానున్న నేపథ్యంలో బుధవారమిక్కడ విలేకరులతో విశ్వనాథ్‌తో పాటు సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు విశాల్ రంజన్, శ్రీనివాస్ మైనా, డాక్టర్ మూర్తి నెక్కంటి మాట్లాడారు. హెల్త్‌కేర్‌లో తాము అందుబాటులోకి తెస్తున్న టెక్నాలజీని వివరించారు. ఈ ఏడాది చివరకు తమ ఆసుపత్రులు వెయ్యి పడకలకు విస్తరిస్తాయని, 2020 చివరి నాటికి 5వేల పడకలకు విస్తరించాలన్నది లక్ష్యమని చెప్పారు. ‘సైన్స్ అందరికీ అందుబాటులో ఉండాలి. అందులో వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరికీ కావాలి. ఇవి అందించటమే లక్ష్యంగా హెల్త్‌కేర్‌లో అడుగులేస్తున్నాం’’ అని విశ్వనాథ్ చెప్పారు. రూపు మారిన అశోకా మాల్!! బంజారాహిల్స్‌లోని అశోకామాల్ హైదరాబాదీలందరికీ సుపరిచితమే. పెద్ద పెద్ద సంస్థలు తమ దుకాణాలు తెరిచినా ఎందుకనో సక్సెస్ కాలేదు. దాన్ని 30 ఏళ్లపాటు లీజుకు తీసుకుని విరించి సంస్థ ఆసుపత్రిగా మార్చింది. దీనికోసం రూ.300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు విశ్వనాథ్ చెప్పారు. దీన్ని అంతర్గత వనరులు, రుణం ద్వారా సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘వచ్చేనెల్లో దీన్ని ఆరంభిస్తాం. మొత్తం ఆసుపత్రి 4.50 లక్షల చదరపు అడుగుల్లో వస్తుంది’’ అన్నారాయన. అమెరికాలో తమ సంస్థకున్న శాఖల ద్వారా అక్కడి వైద్య పరిజ్ఞానాన్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మున్ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని, అవసరమైతే ఇతర ఆసుపత్రులను కొంటామని, నిధుల సేకరణకు షేర్ల జారీ వంటి మార్గాలను కూడా పరిశీలిస్తామని ఆయన తెలియజేశారు. ఈ ఆసుపత్రులన్నీ 200 నుంచి 500 పడకల మధ ్య ఉండే అవకాశముందని తెలిపారు. ఆసుపత్రుల విస్తరణకు అవసరాన్ని బట్టి ఎంత మొత్తం సమీకరించాలనేది నిర్ణయిస్తామని చెప్పారాయన. బంజారాహిల్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా అత్యాధునిక పరికరాలన్నీ తెస్తున్నామని 15000 రకాల పరీక్షలు చేసే ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. బహుశా! ఇలాంటి ల్యాబ్ దేశంలో ఇదే మొదటిది కావొచ్చన్నారు. వైద్యంతో పాటు టెక్నాలజీ... ‘‘అత్యుత్తమ వైద్యం అందించటమే ఏ ఆసుపత్రికైనా గీటురాయి. దానికి మేం టెక్నాలజీని జోడిస్తున్నాం. విరించి ఆసుపత్రిలో కంప్యూటర్లుండవు. మొబైల్స్, ట్యాబ్లెట్లతోనే వ్యవస్థ నడుస్తుంది. పేషెంట్ చేరిన వెంటనే యాప్‌లో రిజిస్టర్ చేస్తాం. అక్కడి నుంచి ప్రతి వైద్య పరీక్షా అందులో నమోదవుతుంది. దాన్ని వేరే వైద్యుడికి పంపటమూ ఈజీనే. వైద్య పరీక్షల ఫలితాలు ఏడాది తరవాత చూసుకున్నా భద్రంగా ఉంటాయి. అదే కాదు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో మాకున్న నైపుణ్యాన్నంతా వినియోగించి విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన అత్యుత్తమ వైద్యాన్ని ఇక్కడికి తెస్తాం. వీడియో కన్సల్టింగ్ సహా రకరకాల మార్గాల ద్వారా అమెరికాలోని నిపుణుల సాయం తీసుకుంటాం. డిశ్చార్జి అయ్యేటపుడు బిల్లు కూడా మొబైల్‌కే వస్తుంది. లైన్లో నిల్చుని చెల్లించే బాధ కూడా ఉండదు’’ అంటూ తమ ఆసుపత్రి గురించి విశ్వనాథ్ వివరించారు.