నాలుగేళ్లలో 5వేల పడకలకు!
♦ ఏడాది చివరికల్లా వెయ్యి పడకల ఆసుపత్రులు
♦ వచ్చేనె ల్లో బంజారాహిల్స్ ఆసుపత్రి ప్రారంభం
♦ 600 పడకలు; 300 కోట్ల వ్యయం
♦ వైద్యానికి టెక్నాలజీని జోడించటమే మా ప్రత్యేకత
♦ ‘విరించి’ సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల
సాక్షి, బిజినెస్ బ్యూరో: ‘‘వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులొస్తున్నాయి. కానీ అవి మన దేశంలో అందుబాటులోకి రావటానికి చాలాకాలం పడుతోంది. టెలీ మెడిసిన్, రొబోటిక్ సర్జరీలు కూడా జరుగుతున్న ఈ రోజుల్లోనూ ఇంత సమయం పట్టడం సరికాదు’’ అని ‘విరించి’ సంస్థ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల చెప్పారు. ఐటీ సొల్యూషన్స్‌తో మొదలుపెట్టిన ఈ సంస్థ హెల్త్‌కేర్ టెక్నాలజీస్‌పై దృష్టిపెట్టింది. నూరు శాతం అనుబంధంగా ఉన్న ‘విరించి హెల్త్‌కేర్ సొల్యూషన్స్’ ద్వారా ఇప్పటికే హైదరాబాద్‌లోని బర్కత్‌పుర, హయత్‌నగర్‌లో రెండు ఆసుపత్రులుండగా...
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్-1లో 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తోంది. వచ్చేనెలలో ఇది ఆరంభం కానున్న నేపథ్యంలో బుధవారమిక్కడ విలేకరులతో విశ్వనాథ్‌తో పాటు సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు విశాల్ రంజన్, శ్రీనివాస్ మైనా, డాక్టర్ మూర్తి నెక్కంటి మాట్లాడారు. హెల్త్‌కేర్‌లో తాము అందుబాటులోకి తెస్తున్న టెక్నాలజీని వివరించారు. ఈ ఏడాది చివరకు తమ ఆసుపత్రులు వెయ్యి పడకలకు విస్తరిస్తాయని, 2020 చివరి నాటికి 5వేల పడకలకు విస్తరించాలన్నది లక్ష్యమని చెప్పారు. ‘సైన్స్ అందరికీ అందుబాటులో ఉండాలి. అందులో వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరికీ కావాలి. ఇవి అందించటమే లక్ష్యంగా హెల్త్‌కేర్‌లో అడుగులేస్తున్నాం’’ అని విశ్వనాథ్ చెప్పారు.
రూపు మారిన అశోకా మాల్!!
బంజారాహిల్స్‌లోని అశోకామాల్ హైదరాబాదీలందరికీ సుపరిచితమే. పెద్ద పెద్ద సంస్థలు తమ దుకాణాలు తెరిచినా ఎందుకనో సక్సెస్ కాలేదు. దాన్ని 30 ఏళ్లపాటు లీజుకు తీసుకుని విరించి సంస్థ ఆసుపత్రిగా మార్చింది. దీనికోసం రూ.300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు విశ్వనాథ్ చెప్పారు. దీన్ని అంతర్గత వనరులు, రుణం ద్వారా సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘వచ్చేనెల్లో దీన్ని ఆరంభిస్తాం. మొత్తం ఆసుపత్రి 4.50 లక్షల చదరపు అడుగుల్లో వస్తుంది’’ అన్నారాయన. అమెరికాలో తమ సంస్థకున్న శాఖల ద్వారా అక్కడి వైద్య పరిజ్ఞానాన్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
మున్ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని, అవసరమైతే ఇతర ఆసుపత్రులను కొంటామని, నిధుల సేకరణకు షేర్ల జారీ వంటి మార్గాలను కూడా పరిశీలిస్తామని ఆయన తెలియజేశారు. ఈ ఆసుపత్రులన్నీ 200 నుంచి 500 పడకల మధ ్య ఉండే అవకాశముందని తెలిపారు. ఆసుపత్రుల విస్తరణకు అవసరాన్ని బట్టి ఎంత మొత్తం సమీకరించాలనేది నిర్ణయిస్తామని చెప్పారాయన. బంజారాహిల్స్ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సహా అత్యాధునిక పరికరాలన్నీ తెస్తున్నామని 15000 రకాల పరీక్షలు చేసే ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. బహుశా! ఇలాంటి ల్యాబ్ దేశంలో ఇదే మొదటిది కావొచ్చన్నారు.
వైద్యంతో పాటు టెక్నాలజీ...
‘‘అత్యుత్తమ వైద్యం అందించటమే ఏ ఆసుపత్రికైనా గీటురాయి. దానికి మేం టెక్నాలజీని జోడిస్తున్నాం. విరించి ఆసుపత్రిలో కంప్యూటర్లుండవు. మొబైల్స్, ట్యాబ్లెట్లతోనే వ్యవస్థ నడుస్తుంది. పేషెంట్ చేరిన వెంటనే యాప్‌లో రిజిస్టర్ చేస్తాం. అక్కడి నుంచి ప్రతి వైద్య పరీక్షా అందులో నమోదవుతుంది. దాన్ని వేరే వైద్యుడికి పంపటమూ ఈజీనే. వైద్య పరీక్షల ఫలితాలు ఏడాది తరవాత చూసుకున్నా భద్రంగా ఉంటాయి. అదే కాదు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో మాకున్న నైపుణ్యాన్నంతా వినియోగించి విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన అత్యుత్తమ వైద్యాన్ని ఇక్కడికి తెస్తాం. వీడియో కన్సల్టింగ్ సహా రకరకాల మార్గాల ద్వారా అమెరికాలోని నిపుణుల సాయం తీసుకుంటాం. డిశ్చార్జి అయ్యేటపుడు బిల్లు కూడా మొబైల్‌కే వస్తుంది. లైన్లో నిల్చుని చెల్లించే బాధ కూడా ఉండదు’’ అంటూ తమ ఆసుపత్రి గురించి విశ్వనాథ్ వివరించారు.