Visakha beach love festival
-
బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై కమిటీ ఏర్పాటు
విజయవాడ: విమర్శలు, నిరసనల నేపథ్యంలో విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్‌పై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, ఉడా వైస్ చైర్మన్, మున్సిపల్, టూరిజం శాఖ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. కాగా బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి ఓ ప్రయివేట్ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించిన మాట వాస్తవమే అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఫెస్టివల్ నిర్వహణకు పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ గత నెల 15వ తేదీన దరఖాస్తు చేసుకుందని ఆయన తెలిపారు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేమికుల రోజులను పురస్కరించుకుని ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. -
బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా...
-
బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా...
విశాఖ: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. బికినీ ఫెస్టివవల్ నిర్వహించడం తెలుగు సంస్కృతికి మంచిది కాదని, అదొక వింత పోడక అని ఆయన గురువారమిక్కడ అన్నారు. ‘విశాఖలో పాశ్చాత్య దేశాల నుంచి జంటలు వస్తారట. జంటకు ఒక టెంట్ అట.... ఏమిటీ తమాషా. బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా, నెట్ లో చూస్తే అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది అంగీకరించం, బికినీలతో కొత్త సంప్రదాయం కరెక్ట్ కాదు. మహిళలను కించపరచడం, ఎక్స్పోజ్ చేసి బికినీ ఫెస్టివల్ ఎలా నిర్వహిస్తారు. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి ఫెస్టివల్‌ను ఎంచుకోవడం తగదు. మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు అవసరం లేదు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి టూరిజాన్ని అభివృద్ధి చేస్తామంటే అది భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుంది, ఇదొక కుట్ర’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ బీచ్ లవ్ ఫెస్టివల్ పేరుతో ఈ ప్రేమోత్సవం నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ప్రఖ్యాత పాప్ గాయని, బెల్లీ డ్యాన్సర్ షకీరా ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, మోడళ్ల క్యాట్ వాక్‌లు, అందాల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి ఏకంగా 9వేల జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తీరంలో ఎక్కడ ఈ ఫెస్టివల్ నిర్వహించాలన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్న విషయం తెలిసిందే. -
బీచ్ ఫెస్టివల్‌పై స్పందించిన అధికారులు
విశాఖ : విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ కథనాలపై స్పందించిన అధికారులు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేయటం విశేషం. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి కార్యక్రమంలోనూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తామని టూరిజం శాఖ కార్యదర్శి శ్రీకాంత్ చెబుతుంటూ... బీచ్ లవ్ ఫెస్టివల్ పూర్తిగా ప్రయివేట్ కార్యక్రమం అని, ప్రభుత్వానికి సంబంధం లేదని పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రాములు నాయుడు పేర్కొన్నారు. అధికారుల వేర్వేరు ప్రకటనలతో... ఇంతకీ బీచ్ ఫెస్టివల్ ప్రభుత్వానిదా, లేక ప్రయివేట్ కార్యక్రమమా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు మాత్రం ప్రభుత్వానికి కాదు ప్రయివేట్ కార్యక్రమని చెప్పడం గమనార్హం. -
లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం: రోజా
విశాఖ : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాగా ఈ నెల ఆరో తేదీన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షణ నిమిత్తం పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ విశాఖ విచ్చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.... నారావారి నరకాసుర పాలన పోవాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా అవసరమని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రోజా వ్యాఖ్యానించారు. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. లవ్ ఫెస్టివల్‌ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రేమ ఉత్సవాల పేరిట ఆడవాళ్ల శరీర ప్రదర్శనను అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.