లవ్ ఫెస్టివల్ను అడ్డుకుంటాం: రోజా
విశాఖ : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాగా ఈ నెల ఆరో తేదీన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షణ నిమిత్తం పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ విశాఖ విచ్చేశారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.... నారావారి నరకాసుర పాలన పోవాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా అవసరమని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రోజా వ్యాఖ్యానించారు.
కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు.
ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. లవ్ ఫెస్టివల్ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రేమ ఉత్సవాల పేరిట ఆడవాళ్ల శరీర ప్రదర్శనను అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.