విజయవాడ: విమర్శలు, నిరసనల నేపథ్యంలో విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్పై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, ఉడా వైస్ చైర్మన్, మున్సిపల్, టూరిజం శాఖ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు.
కాగా బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి ఓ ప్రయివేట్ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించిన మాట వాస్తవమే అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఫెస్టివల్ నిర్వహణకు పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ గత నెల 15వ తేదీన దరఖాస్తు చేసుకుందని ఆయన తెలిపారు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేమికుల రోజులను పురస్కరించుకుని ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.