బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా...
విశాఖ: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. బికినీ ఫెస్టివవల్ నిర్వహించడం తెలుగు సంస్కృతికి మంచిది కాదని, అదొక వింత పోడక అని ఆయన గురువారమిక్కడ అన్నారు. ‘విశాఖలో పాశ్చాత్య దేశాల నుంచి జంటలు వస్తారట. జంటకు ఒక టెంట్ అట.... ఏమిటీ తమాషా. బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా, నెట్ లో చూస్తే అర్థమైంది.
ఎట్టి పరిస్థితుల్లో ఇది అంగీకరించం, బికినీలతో కొత్త సంప్రదాయం కరెక్ట్ కాదు. మహిళలను కించపరచడం, ఎక్స్పోజ్ చేసి బికినీ ఫెస్టివల్ ఎలా నిర్వహిస్తారు. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి ఫెస్టివల్‌ను ఎంచుకోవడం తగదు. మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు అవసరం లేదు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి టూరిజాన్ని అభివృద్ధి చేస్తామంటే అది భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుంది, ఇదొక కుట్ర’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ బీచ్ లవ్ ఫెస్టివల్ పేరుతో ఈ ప్రేమోత్సవం నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్‌ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి.
ప్రఖ్యాత పాప్ గాయని, బెల్లీ డ్యాన్సర్ షకీరా ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, మోడళ్ల క్యాట్ వాక్‌లు, అందాల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి ఏకంగా 9వేల జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తీరంలో ఎక్కడ ఈ ఫెస్టివల్ నిర్వహించాలన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్న విషయం తెలిసిందే.