వైఎస్ జగన్కు శారదా పీఠాధిపతి ఆశీస్సులు
హన్మకొండ: హిందూ ధార్మిక వ్యవస్థ, ఆలయ వ్యవస్థ రక్షణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అభినందనీయమైన కృషి చేస్తున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. హన్మకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.
కార్తీకమాసం సందర్భంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహభాషణం చేస్తూ.. తండ్రి లాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ధార్మిక భావాలు కలవారని, ప్రజాసంక్షేమం కోసం ఏపీలో పోరాటం చేస్తున్నారని, ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వలే తెలంగాణలో దేవాదాయ శాఖకు సారవంతమైన భూములు లేవని, కేవలం వేతనాలపైనే అర్చకులు ఆధారపడుతున్నారని తెలిపారు. ధూప, దీప నైవేద్య పథకం కింద అర్చకుల వేతనాలను పెంచుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. అర్చకుల మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించారు.