ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
కొత్త రైల్వే సర్వీసును ప్రారంభించిన రైల్వేమంత్రి సురేష్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ, విశాఖ సిటీ: న్యూఢిల్లీ-విశాఖపట్టణం (22415/22416) ఏసీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు బుధవారం రిమోట్ ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ-హైదరాబాద్ (12723/12724) ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మారుస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికులు అడ్వాన్సు రిజర్వేషన్లు చేసుకున్న దృష్ట్యా నవంబరు 15 నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా అధికారికంగా రికార్డులోకి ఎక్కనుంది.
ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ నుంచి బుధవారం బయల్దేరగా... దీనిని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సహాయ మంత్రులు మనోజ్‌సిన్హా, సుజనాచౌదరిలతో కలిసి రైల్వేమంత్రి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సులో ప్రారంభించారు.
వేగం పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించాలి: మంత్రి వెంకయ్య
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని 36 గంటల నుంచి 32 గంటలకు తగ్గించాలని, వారంలో ఏడు రోజులపాటు రైలును నడిపించాలని మంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కోరారు. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రైలు ఏర్పాటు చేయాలని విన్నవించారు.
కొత్త రైళ్లు అత్యవసరం: మేకపాటి, వైవీ
ఏపీ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపించే దిశగా ప్రయత్నాలు చేయాలని, తిరుపతి నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్-2 రైలు నడిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కోరారు. తిరుపతి-షిర్డి, విజయవాడ-బెంగళూరు రైళ్లను నడిపించాలని గతంలోనే వినతిపత్రాలను అందచేశామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని చెబుతుండడం బాగానే ఉన్నప్పటికీ, అన్నింటికన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం చాలా అవసరమని చెప్పారు.