ఏపీ అసెంబ్లీలో సాక్షి కథనాలు
అమరావతి: విశాఖపట్టణంలో అసైన్డ్ భూముల కుంభకోణాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చిందని బీజేపీ శానససభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇందుకు సంబంధించిన వార్త కథనాన్ని ఆయన సభలో చూపించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభలో సోమవారం స్వల్ప వ్యవధి ప్రశ్నపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్టణంలో కొంతమంది వ్యక్తులు రైతులను బెదిరించి, బలవంతంగా అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని, వారికి రాజకీయ నాయకులతో పాటు, ఐపీఎస్, ఐఏఎస్, కోర్టు అధికారుల అండదండలూ ఉన్నాయన్నారు.
కేవలం రూ. లక్ష రైతులకు ఇచ్చి రూ. 10 లక్షలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని, భూములకు సంబంధించిన పట్టాలు, ఇతర డాక్యుమెంట్లన్నీ వారి గుప్పిట్లో పెట్టుకున్నారని సభ దృష్టికి తెచ్చారు. ల్యాండ్‌పూలింగ్ జీవో రాకముందే ఇదంతా చేశారని, కోట్లాది రూపాయల భూమిని కారుచౌకగా హస్తగతం చేసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి చేసిన లే అవుట్లు, రోడ్లుతో కూడిన గూగుల్ మ్యాప్‌లను ఆయన సభలో ప్రదర్శించారు. దీనిపై చర్యలు చేపట్టి, అనైన్డ్ రైతులకు న్యాయం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. ఈ విషయంపై 2016 అక్టోబర్‌లో మడపాక గ్రామ అసైన్డ్ రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని మంత్రి నారాయణ అంగీకరించారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. అసలు అసైనీలకు మాత్రమే భూ సమీకరణ యాజమాన్య ధృవపత్రాలను జారీ చేశామని బదులిచ్చారు.