Vishal team
-
సీనియర్లను అగౌరవ పరిచారు
చెన్నై : సీనియర్ నటులను అగౌరవ పరచే విధంగా సత్యదూర ఆరోపణలు చేశారని, ఇది సంస్కారం అనిపించకోదని హీరో సూర్య... నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ జట్టు, విశాల్ జట్లు పోటీ పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాల్ జట్టుకు నటుడు కమలహాసన్ మద్దతు తెలిపారు. అదే విధంగా నటుడు శరత్‌కుమార్, రాధారవిలపై నటుడు శివకుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో కమలహాసన్ విశ్వాస ఘాతకుడు అంటూ శరత్‌కుమార్ ధ్వజమెత్తారు. విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేశానని, అవన్నీ కమల్ మరచిపోయారని ఆరోపణలు గుప్పించారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న సూర్య ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గానికి ఓ లేఖ రాశారు. అందులో ఈ ఎన్నికలు పలు పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు బాధాకరమైన విషయాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయన్నారు. సామరస్య ప్రయత్నాలు ఫలించలేదు. పదవుల్లో ఉన్నప్పుడు చేసిన వాటిని బాధ్యతగా భావించకుండా సాయంగా చిత్రీకరించారని సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టమైన వారికి మద్దతు ప్రకటించిన పలు సీనియర్ నటులను ఈ సందర్భంగా అగౌరవపరిచారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతంకాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నడిగర్ సంఘం సభ్యుల శ్రేయస్సుకు పాటు పడాలి అని లేఖలో సూర్య పేర్కొన్నారు. -
‘నడిగర్’లో వివాదాలు అందరికీ నష్టమే
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న శరత్‌కుమార్ వర్గం,విశాల్ వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం పరిశ్రమ వర్గాలను కలవర పెడుతోందన్నది నిజం.ఈ వ్యవహారంపై సంఘం సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్, నగరి శాసనసభ సభ్యురాలు,నటి రోజా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.అందులో ఆమె పేర్కొంటూ ఇండియన్ హాలీవుడ్‌గా ఖ్యాతి గాంచిన చెన్నై మహానగరంలో దక్షిణాది చిత్ర నిర్మాణాల స్వర్ణ యుగంలో నెలకొల్పబడిన సంఘం ద క్షిణ భారత నటీనటుల సంఘం. అత్యధిక తమిళసభ్యులు కలిగి ఉండడంతో చెన్నైలోనే దక్షిణ భారత నటీనటుల సంఘం కొనసాగుతోంది. విమర్శలు అందరికీ చేటే ప్రస్తుతం సంఘం ఎన్నికలు జరగన్న నేపథ్యంలో పోటీలో ఉన్న శరత్‌కుమార్ జట్టు,విశాల్ జట్టు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు హర్షనీయం కాదు.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అందరికీ చేటు కలుగుతుంది.అనుభవజ్ఞులైన శరత్‌కుమార్,రాధారవి లాంటి వారు సంఘానికి చేసిన సేవలను మరవరాదు.అప్పుల్లో ఉన్న సంఘాన్ని రుణవిముక్తి కలిగించిన వారిలో విజయకాంత్,శరత్‌కుమార్,రాధారవి లాంటి వారి కృషి ప్రశంసనీయం అన్నారు. విశాల్ వర్గం చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేయలేము.ఇంతకు ముందు కూడా తమిళ నిర్మాతల మండలిలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.అప్పుడు ఆర్కే.సెల్వమణి,పీ.వాసు కల్పించుకుని చక్కదిద్దారు.