
సీనియర్లను అగౌరవ పరిచారు
చెన్నై : సీనియర్ నటులను అగౌరవ పరచే విధంగా సత్యదూర ఆరోపణలు చేశారని, ఇది సంస్కారం అనిపించకోదని హీరో సూర్య... నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ జట్టు, విశాల్ జట్లు పోటీ పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాల్ జట్టుకు నటుడు కమలహాసన్ మద్దతు తెలిపారు. అదే విధంగా నటుడు శరత్‌కుమార్, రాధారవిలపై నటుడు శివకుమార్ ఫిర్యాదు చేశారు.
దీంతో కమలహాసన్ విశ్వాస ఘాతకుడు అంటూ శరత్‌కుమార్ ధ్వజమెత్తారు. విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేశానని, అవన్నీ కమల్ మరచిపోయారని ఆరోపణలు గుప్పించారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న సూర్య ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గానికి ఓ లేఖ రాశారు.
అందులో ఈ ఎన్నికలు పలు పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు బాధాకరమైన విషయాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయన్నారు. సామరస్య ప్రయత్నాలు ఫలించలేదు. పదవుల్లో ఉన్నప్పుడు చేసిన వాటిని బాధ్యతగా భావించకుండా సాయంగా చిత్రీకరించారని సూర్య ఆందోళన వ్యక్తం చేశారు.
ఇష్టమైన వారికి మద్దతు ప్రకటించిన పలు సీనియర్ నటులను ఈ సందర్భంగా అగౌరవపరిచారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతంకాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నడిగర్ సంఘం సభ్యుల శ్రేయస్సుకు పాటు పడాలి అని లేఖలో సూర్య పేర్కొన్నారు.