కాల్పుల కలకలం
మతి స్థిమితం లేని ఖైదీ వీరంగం
బెంగళూరు: మానసిక వికలాంగుడైన ఓ విచారణ ఖైదీ నగరంలోని ప్రముఖ వైద్య విద్యా సంస్థ నిమ్హాన్స్లో జరిపిన కాల్పులు పోలీసు శాఖ మొత్తాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ విశ్వనాథ్ మతి స్థిమితం లేని కారణంగా మూడేళ్ల నుంచి నగరంలోని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకోసం తరచుగా నిమ్హాన్స్కు తీసుకొచ్చి తరువాత అతన్ని జైలుకు తరలించేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం సైతం అతన్ని నిమ్హాన్స్ ఆస్పత్రికి జైలు అధికారులు తీసుకొచ్చారు. చికిత్స సమయంలో తాను మూత్రవిసర్జనకు వెళ్లాలని అధికారులను విశ్వనాథ్ కోరాడు. వారు సమ్మతించడంతో భద్రతా సిబ్బంది విశ్రాంతి తీసుకునే గది నుంచి వెళుతున్న విశ్వనాథ్ ఒక్కసారి నియంత్రణ కోల్పోయాడు. అక్కడున్న ఒక 303 ఎస్ఎల్ఆర్ రైఫిల్‌ను తీసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గది నుంచి బయటికి వచ్చి ఆ గదికి బయట తాళం వేసేశారు. దీంతో గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో విశ్వనాథ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. సుమారు పది నిమిషాల పాటు సాగిన కాల్పులతో నిమ్హాన్స్ వైద్యులతోపాటు అక్కడున్న రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురై పరుగులు తీశారు.
మొత్తం 23 రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం విశ్వనాథ్ కాసేపు కాల్పులను ఆపేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న అధికారులు విశ్వనాథ్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ‘మీ అమ్మను ఇక్కడకు తీసుకువస్తాం, కాల్పులు జరపకు విశ్వా’ అని సెక్యూరిటీలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ చెప్పినప్పటికీ వారి మాటలను విశ్వనాథ్ వినిపించుకోలేదు. అయినా కూడా పోలీసులు విశ్వనాథ్ తల్లి భాగ్యమ్మను అక్కడకు తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఇక విశ్వనాథ్ కదలికలను అదే గదిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా గమనించిన అధికారులు అతన్ని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు గరుడా ఫోర్స్ సహాయాన్ని తీసుకున్నారు. రంగంలోకి దిగిన గరుడా ఫోర్స్‌లోని 30 మంది సభ్యులు ‘ఆపరేషన్ విశ్వనాథ్’ను ప్రారంభించారు. ముందుగా టియర్‌గ్యాస్ ప్రయోగించాలని భావించిన ప్పటికీ అత ను నియంత్రణ కోల్పోతుండడంతో గరుడా ఫోర్స్‌లోని సభ్యులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ తూటా విశ్వనాథ్ గుండెకు దగ్గరగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తక్షణమే ఆ గదిలోకి చేరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని నిమ్హాన్స్ నుంచి పక్కనే ఉన్న మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గమధ్యంలోనే విశ్వనాథ్ మృతి చెందాడు. ‘ఆపరేషన్ విశ్వనాథ్’ అనంతరం మీడియాతో మాట్లాడిన నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ ధీన్ని ధ్రువీకరించారు.