Vishwara Reddy
-
‘రైతు భరోసా’తో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కూడేరు : రైతు భరోసా యాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అంతరగంగలో ఈ నెల 24న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ‘రైతు భరోసా యాత్ర’ కు మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూడేరులోని ఓ రైస్‌మిల్‌లో గురువారం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆ యన ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన కొనసాగుతోందన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మా్ర తమే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు గుర్తుకొస్తున్నాయన్నారు. కరువు ప్ర భావం వల్ల అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కూడా పాలకులు ముందుకు రావడం లేదని మండిపడ్డారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు వైఎస్సార్ సీపీ నాయకులు, సాక్షి పత్రిక కల్పితాలని స్వయాన జిల్లా మంత్రులు చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆత్యహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి లబ్ధిచేకూర్చేందుకు జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారన్నారు. దీంతో సీఎం చంద్రబాబుకు వణుకు పుట్టి ఆఘమేఘాలపై బాధిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. రైతు భరోసా యాత్రతో రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామగ్రామానా ఈ కార్యక్రమంపై విస్తృత ప్ర చారం చేయాలని ఎమ్మెల్యే సూచిం చారు. రైతులు వారి సమస్యలను జగన్‌కు చెప్పుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజశేఖర్, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, సర్పం చ్‌లు, ఎంపీసీ సభ్యులు, నాయకులు మాదన్న, దేవేంద్ర, తిమ్మారెడ్డి, మలోబులేసు, బాలన్న, మల్లికార్జున, తిమ్మారెడ్డి, సత్యనారాయణ, గంగాధర్, హనుమంతరెడ్డి, సూర్యనారాయణరె డ్డి, సూర్యనారాయణ, నారాయణరెడ్డి, ఆది, పెన్నోబులేసు, చిదంబరం, ఓబులేసు, రాజు, శంకర్‌నాయక్, ఛత్రేనాయక్, శంక ర్‌రెడ్డి, తిరుపతయ్య, ఉజ్జనప్పలు పాల్గొన్నారు. -
చెరువుకు నీరందిస్తా
ఇప్పేరు.. కూడేరు మండలంలో ఉన్న ఈ గ్రామంలో 350 నుంచి 500 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు లభించడం గగనం. ఒకప్పుడు కళకళలాడిన పంట పొలాలు వర్షాభావంతో ఇప్పుడు బీళ్లుగా మారాయి. పనుల్లేక జనం వలసబాట పడుతున్నారు. పాతాళంలోని గంగమ్మ తల్లిని పైకి తెచ్చేందుకు అన్నదాతలు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు దుర్భర జీవితం గడపాల్సి వస్తోంది. అలాంటి ఈ గ్రామాన్ని ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ హోదాలో శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సందర్శించారు. జనంతో మమేకమై వారి కష్టాలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి బతుకుపై భరోసా కల్పించారు. విశ్వేశ్వరరెడ్డి : ఓ పెద్దాయన వద్దకు వెళ్లి ఏమన్నా ఎంత భూముంది. బోర్లలో నీరు బాగానే వస్తున్నాయా? బోయ దానమిక : 20 ఎకరాలుందన్నా. పదెకరాల్లో పత్తి, వేరుశనగ పెట్టా. బోరులో నీరు తగ్గిపోయింది. పంటలు ఎండిపోతాన్నాయ్. 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి 40 బోర్లు వేయించా. ముగ్గురు ఆడ పిల్లలకు రూ.3 లక్షలు పెట్టి పెళ్లిళ్లు చేశా. అసలు, వడ్డీ దాదాపు రూ.10 లక్షల దంకా ఉంది. భూముండీ ఏం ప్రయోజనం లేకపాయె. ఊర్లో ఉన్న చెరువుకు నీరు వస్తే బోర్లే కాకుండా చెరువు చుట్టూ ఉన్న నాగిరెడ్డిపల్లి, అంతరగంగ, కూడేరు, అరవకూరు, ముద్దలాపురం, మర్తాడు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. విశ్వేశ్వరరెడ్డి : ఏమక్కా బాగున్నావా? నీ పేరేంటి? ఈశ్వరమ్మ : ఎలా బాగుంటామన్నా. గ్రూపుల్లో లోన్ తీసుకున్నా. ఎలక్షన్లప్పుడు సంద్రబాబు ఆడోళ్లు సంఘాలకు డబ్బు కట్టొద్దని, అధికారంలోకి వత్తే అప్పు లేకుండా సేత్తామని చెప్పినాడు. సంబరపడిపోయి ఓటేత్తే ఇబ్బుడు దాని ఊసేలేదు. బ్యాంకోళ్లు అప్పు కట్టమని ఒత్తిడి చేస్తాండారు. వడ్డీ పెరిగిపాయ. అప్పు తీర్చలేక ఇబ్బంది పడతాన్నాం. విశ్వేశ్వరరెడ్డి : ఏమ్మా.. తీరిగ్గా కూర్చున్నారే? సరస్వతి : ఏం చెప్పేదన్నా.. పంటలు పండకపాయె. చేత్తామంటూ కూలి పనులు కూడా లేవు. పని లేక డబ్బు లేక కుటుంబం గడవక నానా అవత్తలు పడతాన్నాం. విశ్వేశ్వరరెడ్డి : ఉపాధి పనులు పెట్టడం లేదామ్మా? సరస్వతి : పనులు అడుగుతాన్నాం. ఆ సారోళ్లు సక్రమంగా పనులు పెట్టలేదు. పనులు కల్పిస్తే వచ్చే డబ్బులతో నెట్టుకురావచ్చు. పిల్లలను బాగా సదివించుకునేదాన్ని. విశ్వేశ్వరరెడ్డి : ఏమన్నా.. ఏ పంట సాగు చేస్తున్నారు? దిగుబడులు ఎలా ఉన్నాయి? పూల తిమ్మారెడ్డి : బోర్లలో గంగమ్మ తల్లి లోలోపలికే పోతాంది. ఏ పంట సాగు చేయాలన్నా ధైర్యం చాలడం లేదు. 9 ఎకరాల భూమి ఉంది. అందులో 4 ఎకరాలు తోట ఉంది. ఈ పొలంలో 10 బోర్లు వేయించినా చుక్క నీరు పడలేదు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పిల్లల పెళ్లిళ్లకు, బోర్లకు దాదాపు రూ. 3 లక్షల వరకు అప్పులు చేశా. వ ర్షాధారం కింద వేరుశనగ పంట పండలేదు. పెట్టుబడులు కూడా దక్కలేదు. అప్పులు అధికమైపోతున్నాయి. ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. కూలి పనులకు వెళదామంటే చేతకావడం లేదు. విశ్వేశ్వరరెడ్డి : అవ్వా పింఛన్ తీసుకున్నావా?( ఇంటి ముందు మూలన కూర్చున్న రెండు కళ్లులేని అవ్వతో) మీనుగ రామక్క : నాయనా నా రెండు కళ్లు కనబడవు. ఏమి చేప్పేది తండ్రీ..పించెన్ కోసం వె ళితే మధ్యలో మనుషులు డబ్బు అడుగుతున్నారు. వాళ్లకిచ్చే స్తోమత నాకు లేదు. రెండు కళ్లు లేక కదిలే పరిస్థితి లేని నా పై ఎవ్వరికీ కనికరం లేకపోయే. అర్జీలు ఇచ్చేందుకే సరిపోతాంది. ఏమి సేత్తామునాయనా. విశ్వేశ్వరరెడ్డి : తమ్ముడూ ఎంత రుణ మాఫీ అయింది? జయరాం : ఏమి చెబుతామన్నా. ఎన్నికల ముందు ఇంటి గోడలపై చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని రాతలు రాశారు. అది నమ్మి ఓట్లు వేత్తే రుణమాఫీ పై ఖచ్చితమైన మాటే చంద్రబాబు చెప్పక పోయే . రూ. 74 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నా. ఇప్పుడు రూ. 10 వేలు మాఫీ చేసినట్లు రుణమాఫీ జాబితాలో వచ్చింది. రుణమాఫీ అంతా మాయే. విశ్వేశ్వరరెడ్డి : ఏం తమ్ముడు ఉద్యోగం చేస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? (తన వద్దకు ఆత్రుతగా యువకుడితో) ప్రదీప్ : సార్.. బీఏ,బిఈడీ వరకు చదివా. ఉద్యోగాల కోసం తిరుగుతున్నా. కానీ ఉద్యోగం రావడం లేదు. ఏదైనా సంపాదించి ఇంట్లో ఇస్తామన్నా ఉద్యోగాల పనిపై తిరగడమే సరిపోతోంది. ఎన్నికలప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భతి కల్పిస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పట కీ ఉద్యోగ, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలే దు. విశ్వేశ్వరరెడ్డి : ఏమ్మా సంఘాల ద్వారా లబ్ధిపొందుతున్నారా? సంఘాలు ఎలా నడుస్తున్నాయి? సాకమ్మ, నీలమ్మ,అంజలి : ఏమి లబ్ధి పొందుతామన్నా. మా సంఘం పేరు ఎస్టీ ధనలక్ష్మి. సంఘంలో 10 మంది ఉన్నాం. రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాం. ఎన్నికల టైంలో చంద్రబాబు అప్పు కట్టవద్దంటే కట్టలేదు. అప్పటికే రూ. 1.50 లక్షలు చెల్లించాం. ఇపుడు మళ్లీ బ్యాంక్ అధికారులు బకాయి రుణాన్ని కట్టమంటున్నారు. వడ్డీ , అప్పు పెరిగిపోయింది. బాబు మాటలు విని సంఘాలు సరిగా జరగకపోయా. అప్పు తీరకపోయా. కొత్త రుణాలు పొందలేక లబ్ధిని పొందకుండా పోయాం. విశ్వేశ్వరరెడ్డి : ఏం తాతా..పింఛన్ వస్తోందా? ముసలప్ప : ఆ..ఏమి పింఛన్ నాయనా. నాకు 79 ఏళ్లు దాటే. ఆ సారోళ్లు చెప్పినట్టల్లా ఆధారు, బియ్యం కార్డులిత్తి. పించెన్ రాకపాయ. పించెన్ ఇప్పిత్తామంటే మధ్యలో వాళ్లకి డబ్బు ఇత్తి. ఆ డబ్బు పాయా..పించెన్ రాకపాయా. మాలాంటోళ్లకి ఎలా వత్తాయి నాయనా. అసెంబ్లీలో గళం విప్పుతా ఇప్పేరులో వ్యవసాయ బోర్లలో నీరు లేక రైతులు పంటలు సాగు చేసుకోక భూములన్నీ బీడుగా పెట్టుకున్నారు. పనులు చేసేందుకు ఉపాధి పనులు లేక వలస బాట పడుతున్నారు. గ్రామం దుర్భిక్షం నుంచి బయట పడడానికి ఇక్కడి సమస్యలను సీఎం చంద్రబాబు , జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకుపోతా. అసెంబ్లీలోనూ దీనిపై గళం విప్పుతా. పి.నారాయణపురం- చోళసముద్రం గ్రామాల మధ్య వె ళుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఇప్పేరు చెరువు వరకు కాలువను ఏర్పాటు చేయించి సాగు,తాగు నీరు అందేలా కృషి చేస్తా. కూలీలకు ఉపాధి పనులు వెంటనే కల్పించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతా. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేంత వరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తా. - వై.విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే -
విశ్వేశ్వరరెడ్డి విజయకేతనం
ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆయనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి 2,275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ మినహా తక్కిన 16 రౌండ్లలో విశ్వేశ్వరరెడ్డి స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. తన ఓటమి ఖాయమని తెలుసుకున్న పయ్యావుల కేశవ్ 16వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుండగానే కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో మొత్తం 1,93,398 ఓట్లు ఉండగా 1,65,251 పోలయ్యాయి. ఇందులో విశ్వేశ్వరరెడ్డికి 81,042, కేశవ్‌కు 78,767 ఓట్లు లభించాయి. చివర్లో మళ్లీ కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన పయ్యావుల తన ఓటమిని జీర్ణించుకోలేక అనుచరులతో కలిసి నానా రభస సృష్టించారు. రీకౌంటింగ్ జరిపించాలంటూ జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో కలిసి హంగామా చేశారు. వీరి వాదన న్యాయబద్ధంగా లేకపోవడంతో అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా కౌంటింగ్ పూర్తి చేశారు. విజయం సాధించిన విశ్వేశ్వరరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశిదేవి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విశ్వేశ్వరరెడ్డిని భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు.