ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆయనపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి 2,275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆయనపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి 2,275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ మినహా తక్కిన 16 రౌండ్లలో విశ్వేశ్వరరెడ్డి స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. తన ఓటమి ఖాయమని తెలుసుకున్న పయ్యావుల కేశవ్ 16వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుండగానే కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో మొత్తం 1,93,398 ఓట్లు ఉండగా 1,65,251 పోలయ్యాయి. ఇందులో విశ్వేశ్వరరెడ్డికి 81,042, కేశవ్‌కు 78,767 ఓట్లు లభించాయి.
చివర్లో మళ్లీ కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన పయ్యావుల తన ఓటమిని జీర్ణించుకోలేక అనుచరులతో కలిసి నానా రభస సృష్టించారు. రీకౌంటింగ్ జరిపించాలంటూ జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో కలిసి హంగామా చేశారు. వీరి వాదన న్యాయబద్ధంగా లేకపోవడంతో అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా కౌంటింగ్ పూర్తి చేశారు. విజయం సాధించిన విశ్వేశ్వరరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశిదేవి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు విశ్వేశ్వరరెడ్డిని భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు.