Vishwaroopam -2
-
సుందర తెలుంగు
అమ్మ పాట.. ప్రేమ పాట.. హీరోయిజమ్ పాట (టైటిల్ సాంగ్) మొత్తం మూడు పాటలు కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’ కోసం రామజోగయ్య శాస్త్రి రాశారు. వీటిలో ‘అమ్మ..’ పాటను స్వయంగా కమల్‌హాసన్ పాడటం విశేషం. పాడిన తర్వాత ఆయన ఏమన్నారో తెలుసా? ‘సుందర తెలుంగు’ అన్నారు. అంటే ‘అందమైన తెలుగు’ అని అర్థం. ‘‘అమ్మ మీద వచ్చే పాట పాడిన తర్వాత కమల్‌గారు ‘తెలుగు సౌండింగ్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అందుకే భారతియార్ తను రాసిన పాటలో ‘సుందర తెలుంగు’ అని రాశారు’’ అంటూ కమల్ మన భాషను కొనియాడారు అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. ‘‘మన మాతృభాష మీద మనకు చాలా అభిమానం ఉంటుంది. వేరే భాషవాళ్లు మన భాష గొప్పతనం గురించి చెబుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది’’ అని కూడా రామజోగయ్య అన్నారు. ఇక, భారతియార్ గురించి చెప్పాలంటే.. ప్రముఖ తమిళ కవి ఆయన. పూర్తి పేరు సుబ్రమణ్య భారతియార్. 1882లో పుట్టిన ఆయన 1921లో చనిపోయారు. ఆయన బతికున్నప్పుడు రాసిన ‘సింధు నదియిన్ మీసై నిలవినిలే’.. అనే పాటలో ‘సుందర తెలుంగిల్ పాట్టిసైత్తు...’ అనే వాక్యం రాశారు. అంటే.. ‘సుందర తెలుగులో పాట రాసి’ అని అర్థం. దాదాపు వందేళ్ల క్రితమే తెలుగు భాష గొప్పదనం చెబుతూ పాట వచ్చిందన్న మాట. ‘అమ్మ’ పాట పాడాక కమల్ ఆ పాటను గుర్తు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం కమల్ యూఎస్‌లో ఉన్నారు. ‘విశ్వరూపం 2’ ఫైనల్ మిక్సింగ్ పనులు అక్కడ చేయిస్తున్నారు. కమల్ నటించి, స్వీయదర్శకత్వంలో ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా చేసిన ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. -
అక్కణ్ణుంచి మన డబ్బు వెనక్కి తెస్తా!
‘‘ఎంత మంది మనల్ని వ్యతిరేకిస్తున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎవరేమన్నా నేను ముందుకు వెళతాను. అన్ని వ్యతిరేకతలను తీసుకోవడానికి నేను సిద్ధం. ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ ‘నర్పణి ఇయక్కమ్’ (వెల్ఫేర్ అసోసియేషన్) 39వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో కమల్ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నారు. ‘‘నేను రాజకీయల్లోకి వస్తాను. పొలిటికల్ పార్టీ పెడతాను. స్విస్ బ్యాంక్‌లో నేను డబ్బు దాచుకోలేదు. అక్కడ ఉన్న మన డబ్బును వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను’’ అన్నారు. పొలిటికల్ పార్టీ కార్యకలాపాలు సజావుగా జరగడానికి ఓ మొబైల్ యాప్‌ని రూపొందించారట. పుట్టినరోజు (ఈ నెల 7)నాడు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పార్టీకి ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ వివరాలు ఈ యాప్‌లో ఉంటాయట. బర్త్‌డే నాడు ‘విశ్వరూపం–2’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. -
అది నిజం కాదు
‘ఆ వార్తలో నిజం లేదు’ అంటున్నారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, లోక నాయకుడు కమల్‌హాసన్. ఈ ఇద్దరూ చెబుతున్నది ఒకే వార్త గురించి కాదు. రెండు వేరు వేరు వార్తల గురించి. నాగార్జునేమో అఖిల్ సినిమా గురించి.. కమలేమో తన ‘విశ్వరూపం–2’ గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంతకీ ఈ ఇద్దరూ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే...ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు... శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ వెండితెర అరంగేట్రం గురించి ఇప్పటికో క్లారిటీ లేదు. ఈలోపు ఆమె రెండో కూతురు ఖుషీ సినిమాల్లోకి రానుందంటూ వార్తలు మొదలయ్యాయి. అది కూడా అఖిల్ సరసన ఖుషీ నటించనుందనే వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఖుషీని తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఈ వార్తకు స్పందిస్తూ నాగార్జున ‘నాట్ ట్రూ’ అని టూ వర్డ్స్‌తో సింపుల్‌గా క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఇక, కమల్ విషయానికి వస్తే... ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా ఆయన దర్శకత్వం వహించి, నటించిన ‘విశ్వరూపం–2’ హిందీ రిలీజ్ హక్కులను అమ్మారని, రంజాన్‌కి ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘‘ఈ వార్తలో నిజం లేదు. సినీ అభిమానులకు నా సినిమాలకు సంబంధించిన విశేషాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.హిందీ హక్కులు మా దగ్గరే ఉన్నాయి. సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని కమల్ అన్నారు.అయినా గాసిప్పురాయుళ్లు ఏవేవో ప్రచారం చేస్తుంటారు కదా. ఆ మాత్రం దానికే స్పందించాలా? అని కొంతమంది అనుకోవచ్చు. కొన్ని గాసిప్పులకు స్పందించడమే మంచిదని సెలబ్రిటీలు అనుకుంటారు. ఎవరి కారణాలు వాళ్లకుంటాయి కదా! -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
కమల్‌హాసన్ ‘విశ్వరూపం–2’ విడుదలవుతుందని ఎవరూ ఊహించలేదు. ‘విశ్వరూపం’ విడుదలై నాలుగేళ్లు అయ్యింది. అప్పట్లో పలు వివాదాలు సినిమాను చుట్టుముట్టినా... కమల్ క్రియేటివిటీకి మంచి పేరొచ్చింది. కానీ, ఏం లాభం? సెకండ్ పార్టు షూటింగ్ పూర్తయినా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల ఆగిందన్నారు. ‘విశ్వరూపం’ విడుదల తర్వాత కమల్ మరో మూడు సినిమాలు చేయడంతో ప్రేక్షకులు పార్ట్–2 సంగతి మర్చిపోయారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ‘విశ్వరూపం–2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మళ్లీ మొదలయ్యాయి. ‘‘పాత టీమ్‌తోనే వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, హిందీ డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి’’ అని కమల్ శిష్యుడు, ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్ సెల్వ ట్వీటారు. కమల్‌హాసన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వి. రవిచంద్రన్ నిర్మాత, జిబ్రాన్ స్వరకర్త. రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
నేను తప్పు చేశాను
విశ్వరూపం -2 విషయంలో తప్పు చేశానని నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. లోక నాయకుడు కమలహాసన్ చిత్రాల్లో కొన్ని ప్రేక్షకులకు నచ్చి ఉండక పోవచ్చు. అయితే, నటుడుగా ఆయన మాత్రం ఫెయిల్ కాలేదు. నటనకు సరి కొత్త భాష్యం ఇచ్చిన కమలహాసన్ ఒక నట పిపాసి అని చెప్పవచ్చు. అలాంటిది ఇటీవల ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాల విడుదల సమయంలో పలు సమస్యలను చవి చూశారు. కమలహాసన్ ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవాల్లో విశ్వరూపం చిత్రం ప్రదర్శించారు. కమల్ విలేకరులతో మాట్లాడుతూ విశ్వరూపం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ పొందినా విడుదలకు చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. కారణం ఆ చిత్రానికి పలు సంఘాలు వ్యతిరేకించడమేనని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఉత్తమ విలన్ చిత్రం విడుదల సమయంలోనూ తాను వివాదాలకు గురి అయ్యానని పేర్కొన్నారు. తానేమి ప్రజా వ్యతిరేక చిత్రాల నటుడ్ని కాదు అని, అలాగే, ప్రేక్షకుల్ని ఎగతాళి చేసే చిత్రాలను ఎప్పడూ తీయనని పేర్కొన్నారు. వారికి వినోదాన్ని పంచే చిత్రాల్నే తాను నిర్మించాననన్నారు. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా విశ్వరూపం -2 రూపొందించానని, ఆ చిత్రం చివరిలో కూడా శుభం లేకుండా, కొనసాగింపు ఉం టుందని సూచించామన్నారు. అయితే, ప్రస్తుతం విశ్వరూపం -3 తీసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఆ చిత్రాన్ని విడుదల హక్కుల్ని వేరే నిర్మాతకు అప్పగించానన్నారు. అదే తాను చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఆయన నటించిన పాపనాశం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ పూంగా వనానికి రెడీ అవుతున్నారు. -
ఆ గుళ్లోనే నా జీవితం మలుపు తిరిగింది
‘‘కమల్‌హాసన్‌తో పరిచయం నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది’’ అంటున్నారు సంగీత దర్శకుడు గిబ్రన్. ప్రస్తుతం ఆయన కమల్ ‘విశ్వరూపం-2’కు సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ హీరోగా ఆయన సంగీతం అందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారాయన. ‘విశ్వరూపం-2’ భారీ సీజీ వర్క్ ఉన్న సినిమా అనీ, అంతటి గొప్ప సినిమాకు సంగీతం అందించడం గర్వంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు. కమల్ ‘ఉత్తమ విలన్’ తర్వాతే ‘విశ్వరూపం-2’ విడుదల అవుతుందని గిబ్రన్ చెప్పారు. తాను స్వరాలందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం చాలా ఆసక్తికరంగా సాగే సినిమా అనీ, సంగీత దర్శకునిగా ఓ కొత్త అనుభూతిని ఈ సినిమా తనకు అందించిందని గిబ్రన్ అన్నారు. ‘‘సంగీత దర్శకుడు కాక ముందు నేను పియానో టీచర్ని. ఎంతో మంది పిల్లలకు పియోనో నేర్పిన అనుభవం నాది. సింగపూర్‌లో చదువుకున్నాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూశాను. పులిహోర పోట్లాల కోసం గుడికెళ్లిన రోజులున్నాయి. ఆ గుళ్లోనే నా జీవితం మలుపుతిరిగింది. నా భార్య పరిచయమైంది అక్కడే. మా కలయిక స్నేహం నుంచి ప్రేమగా మారింది. తను విజయవాడ అమ్మాయి. సైంటిస్ట్. తన పరిచయం నాలో ఊహించని మార్పు తెచ్చింది. ఆమె తర్వాత నా జీవితంపై ప్రభావితం చేసిన మరో వ్యక్తి కమల్‌హాసన్‌గారు. ఆయన్ను కలవక ముందు కలిశాక నా జీవితాన్ని ఊహించుకుంటే... ఉద్వేగం కలుగుతుంది’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు గిబ్రన్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ అరడజను సినిమాల దాకా చేస్తున్నానని, సంగీత దర్శకునిగా కెరీర్ ఆశాజనకంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు.