అది నిజం కాదు
‘ఆ వార్తలో నిజం లేదు’ అంటున్నారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, లోక నాయకుడు కమల్‌హాసన్. ఈ ఇద్దరూ చెబుతున్నది ఒకే వార్త గురించి కాదు. రెండు వేరు వేరు వార్తల గురించి. నాగార్జునేమో అఖిల్ సినిమా గురించి.. కమలేమో తన ‘విశ్వరూపం–2’ గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంతకీ ఈ ఇద్దరూ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే...ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు... శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ వెండితెర అరంగేట్రం గురించి ఇప్పటికో క్లారిటీ లేదు.
ఈలోపు ఆమె రెండో కూతురు ఖుషీ సినిమాల్లోకి రానుందంటూ వార్తలు మొదలయ్యాయి. అది కూడా అఖిల్ సరసన ఖుషీ నటించనుందనే వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఖుషీని తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఈ వార్తకు స్పందిస్తూ నాగార్జున ‘నాట్ ట్రూ’ అని టూ వర్డ్స్‌తో సింపుల్‌గా క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఇక, కమల్ విషయానికి వస్తే... ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా ఆయన దర్శకత్వం వహించి, నటించిన ‘విశ్వరూపం–2’ హిందీ రిలీజ్ హక్కులను అమ్మారని, రంజాన్‌కి ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘‘ఈ వార్తలో నిజం లేదు.
సినీ అభిమానులకు నా సినిమాలకు సంబంధించిన విశేషాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.హిందీ హక్కులు మా దగ్గరే ఉన్నాయి. సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని కమల్ అన్నారు.అయినా గాసిప్పురాయుళ్లు ఏవేవో ప్రచారం చేస్తుంటారు కదా. ఆ మాత్రం దానికే స్పందించాలా? అని కొంతమంది అనుకోవచ్చు. కొన్ని గాసిప్పులకు స్పందించడమే మంచిదని సెలబ్రిటీలు అనుకుంటారు. ఎవరి కారణాలు వాళ్లకుంటాయి కదా!