ఉద్యోగాల కల్పనలో అగ్రగామి
జేఎన్టీయూ: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సభ్యులు జేఎన్టీయూ అనంతపురం శాశ్వత అనుబంధ కళాశాల అయిన శ్రీనివాస రామానుజన్ ఇంజినీరింగ్ కళాశాల (ఎస్ఆర్ఐటీ)ను సందర్శించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటన ఉంటుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యతో పాటు ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా నిలుస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారెడ్డి న్యాక్ పీర్ కమిటీ సభ్యులకు తెలిపారు.
ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం, వర్క్‌షాపులు, ట్రైనింగ్ ప్రోగ్రాం, ఇండస్ట్రియల్ విజిట్స్, గెస్ట్లెక్చర్స్ ఎప్పటికపుడు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ కల్పించడంతో ఉద్యోగ అవకాశాలపై అవగాహన, అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రతి మూడేళ్లకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తూ అధ్యాపకులు, విద్యార్థులకు తాజాగా పరిశ్రమల్లో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. న్యాక్ అక్రిడిటేషన్‌కు అర్హతయ్యే వర్సిటీ శాశ్వత అనుబంధ హోదా, యూజీసీ 2 (ఎఫ్), 12(బీ) గుర్తింపు కళాశాలకు దక్కిందన్నారు.
సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు
ఎస్ఆర్ఐటీ కళాశాలలోని వసతులు, ల్యాబ్‌లు, తరగతి గదులు, సెమినార్ హాలు, హాస్టళ్లు, క్యాంటీన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సదుపాయాలను న్యాక్ పీర్ కమిటీ సభ్యులు నరేంద్ర చౌదరి (డైరెక్టర్, ఎన్ఐటీ, నాగపూర్), డాక్టర్ వినాయక్ షేట్ (గోవా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్), డాక్టర్ రాజేష్ పంత్ (చైర్మన్, ప్రిసిషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నోయిడా) సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివా రెడ్డి, చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, సీఈఓ జగన్‌తో మాట్లాడి వారికి సలహా ఇచ్చారు.