Visva-Bharati
-
‘అమర్త్యసేన్ ఇంటిని కూలుస్తామంటే ఊరుకోం’
కోల్‌కతా: బుల్డోజర్ రాజకీయం పశ్చిమ బెంగాల్‌కు చేరింది. ఆర్థికవేత్త.. నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్(89) ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామంటూ విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఆ నోటీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందించారు. అలాంటి ప్రయత్నమే జరిగితే.. అడ్డుకునే యత్నంలో బుల్డోజర్ ముందుర ముందు తానే కూర్చుంటానంటూ ప్రకటించారామె. సేన్‌పై ప్రతీరోజూ దాడి జరుగుతోంది. కానీ, వాళ్లు(కేంద్రాన్ని ఉద్దేశించి..) మాత్రం వేడుక చూస్తున్నారు. ఆయన ఇంటిని ఎలా కూలుస్తారో నేనూ చూస్తా. అదే ప్రయత్నం జరిగితే.. అక్కడికి వెళ్తా. ధర్నాతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతా. బుల్డోజరా? మానవత్వమా? ఏది శక్తివంతమైందో తేల్చుకుంటా.. అని ఆమె వ్యాఖ్యానించారు. 👉 శాంతినికేతన్లో అమర్త్య సేన్ కుటుంబ సభ్యులుగా తరతరాలుగా ఉంటున్న నివాసం ‘ప్రతీచి’ ఉంది. ఆయన కుటుంబం తరతరాలుగా నివసిస్తోంది. అంతేకాదు.. ఆ ఇల్లు సేన్ తండ్రి అశుతోష్ పేరు మీదే ఉండేది. సేన్ తల్లిదండ్రులు మరణించాక.. అది ఆయన పేరు మీదకు బదిలీ అయ్యింది. అయితే.. అందులో అక్రమంగా కొంత స్థలాన్ని ఆక్రమించారని విశ్వభారతి యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. 👉 ఈ ఏడాది జవనరిలో ప్రతీచికి చెందిన 6,600కు పైగా గజాల స్థలానికి చెందిన అధికారిక పత్రాలను స్వయంగా సీఎం మమతా బెనర్జీనే శాంతినికేతన్లో సేన్‌ను కలసి అందించారు. అంతేకాదు.. ఆ స్థలం సేన్ కుటుంబానికే చెందుతుందని దీదీ కరాకండిగా చెబుతున్నారు. 👉 600 గజాల యూనివర్సిటీ జాగానే ఆయన ఆక్రమించారనేది విశ్వ భారతి యూనివర్సిటీ వాదన. ఈ మేరకు మే 6వ తేదీలోగా ఖాళీ చేయాలని, లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమిత ప్రదేశంలో ఉన్న కట్టడాల్ని కూల్చేస్తామని విశ్వ-భారతి ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది. 👉 ఆపై ఆయన్ని వివరణలు కోరుతూ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వరుసగా మూడుసార్లు నోటీసులు అంటించింది. దీంతో ఆయన స్పందించారు. 👉 అది తమ వారసత్వ నివాసమని, అందులో ఎలాంటి ఆక్రమిత స్థలం లేదని అమెరికా ఉన్న అమర్త్య సేన్ సైతం యూనివర్సిటీకి తాజాగా బదులు లేఖ రాశారు. 1943 నుంచి ఆ ప్రాంతం మా కుటుంబంతోనే ఉంది. ఆపై చుట్టుపక్కల కొంత స్థలం కొనుగోలు చేశాం. నా తల్లిదండ్రుల మరణానంతరం అది నా పేరు మీదకు వచ్చింది. జూన్‌లో నేను శాంతినికేతన్‌కు వస్తా. పూర్తి వివరాలు సమర్పిస్తా అని లేఖలో(మెయిల్) యూనివర్సిటీకి తెలియజేశారు. 👉 మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతీచి కేర్‌టేకర్ గీతికాంతా మజుందార్.. కోర్టుకు ఆశ్రయించారు. దీంతో.. జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. భీర్బూమ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ పోలీసుల పహారా ఉంటోంది. కాబట్టి, కూల్చివేతకు తాము అనుమతించబోమని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ యూనివర్సిటీ మాత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకుని తీరతామని అంటోంది. 👉 కానీ, సేన్ వివరణ తీసుకున్నాక కూడా తాజాగా.. మే 6వ తేదీలోపు ఖాళీ చేయాలనే డెడ్‌లైన్ విధించింది యూనివర్సిటీ. లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి.. బుల్డోజర్లతో కూల్చేస్తామని హెచ్చరించింది. 👉 తాజాగా సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. వర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు స్పందించడం లేదు. అయితే.. ప్రతీచి ప్లాట్‌లో ఆక్రమించుకున్న భాగాన్ని మాత్రం స్వాధీనపర్చుకుని తీరతామని ఓ యూనివర్సిటీ అధికారి పేర్కొన్నారు. ప్రతీచికి వాయవ్యంలో మూలన 600 గజాలను ఆక్రమించుకున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కాబట్టి, ఆ స్థలానికి గనుక స్వాధీనం చేసుకోవాలనుకుంటే.. బౌండరీ ఫెన్సింగ్‌ను పగలకొట్టి అక్కడ ఇనుప కంచె వేయాలనుకుంటున్నాం అని ఓ అధికారి పేర్కొన్నారు. 👉 ఈ వ్యవహారంలో విశ్వభారతి తీరుపై మేధావులు మండిపడుతున్నారు. ఇది పూర్తి రాజకీయ వ్యవహారం. సేన్‌ను వేధించడానికి బీజేపీ విశ్వభారతి యూనివర్సిటీని ఓ పావుగా వాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. ఆయన నివాసం ప్రతీచి ముందర డ్రామా నడిపించేందుకు సిద్ధమైంది. బుల్డోజర్ రాజకీయాలు సరికాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: చిన్నమ్మా.. ఎవరీ జ్యోతిష్కుడు? -
ప్రజాసేవే లక్ష్యం
ఆరు బంగారు పతకాలు సాధించిన వైద్య విద్యార్థి విశ్వభారతి మనోగతం బెంగళూరు: రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆరు బంగారు పతకాలు గెలుచుకున్న వైద్య విద్యార్థి విశ్వభారతి తెలిపారు. విభిన్న విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వైద్య విద్యార్థిని విశ్వభారతి బెంగళూరు మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆరు బంగారు పతకాలను అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. మూలతహా కారవార ప్రాంతానికి చెందిన విశ్వభారతి బెంగళూరులోనే నివసిస్తున్నారు. బెంగళూరు మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం బుధవారమిక్కడి కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విశ్వభారతి ఆరు బంగారు పతకాలను అందుకున్నారు. విశ్వభారతి మాట్లాడుతూ....‘నిమ్హాన్స్లో న్యూరో సర్జన్ విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలనేది నా లక్ష్యం. విదేశాలకు వెళ్లాలన్న ఆశ నాకు ఎంతమాత్రం లేదు. ఇక్కడే ఉండి కర్ణాటకలోని మారుమూల ప్రాంతాలకు చెందిన పేదలకు వైద్య సేవలు అందించడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను’ అని విశ్వభారతి తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. -
డ్రైవర్ అనారోగ్యమే.. ప్రమాదానికి కారణమా?
15 రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న తాత్కాలిక డ్రైవర్ అయినా నడపాలని ఒత్తిడి చేసిన కాకతీయ స్కూల్ యాజమాన్యం సంగారెడ్డి: డ్రైవర్‌కు అనారోగ్యమే ప్రమాదం జరగడానికి కారణమా.. ఆయనకు వయసు మీదపడి చూపు మందగించడంతోనే రైలును గమనించలేకపోయాడా? సంఘటన స్థలాన్ని, డ్రైవర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. భిక్షపతిగౌడ్ సీనియర్ డ్రైవర్. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటే మాసాయిపేట ముప్పుతప్పేదే. కానీ 15 రోజులుగా వైరల్ జ్వరంతో నీరసించిపోయిన ఆయన బస్సు ప్రమాదాన్ని నిలువరించడానికి సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోయాడు. డ్రైవర్ భిక్షపతి మూడున్నరే ళ్లుగా వర్గల్‌లోని విశ్వభారతి ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తీవ్ర జ్వరం రావడంతో 15 రోజుల నుంచి డ్యూటీకి రావటం లేదని, మనిషి కూడా నీరసించిపోయాడని అక్కడి స్కూల్ యాజమాన్యం ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. పని చేయకపోవడంతో తిండికి ఇబ్బందిగా మారగా భిక్షపతి స్వగ్రామం నాచారం వచ్చి ఉంటున్నారు. ఇదే సమయంలో కాకతీయ స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లలో ఒకరు సెలవుపెట్టి వెళ్లిపోవడంతో స్కూల్ యాజమాన్యం భిక్షపతిని పనిలో పెట్టుకున్నట్లు సమాచారం. రోజు కు రూ.400 ఇస్తామని, రెండు రోజులు పనిచేయాలని ఒత్తిడి తేవడంతో, మందుల ఖర్చులకు పనికొస్తాయని భిక్షపతి తాత్కాలిక డ్రైవర్‌గా ఈ నెల 22న మధ్యాహ్నం విధుల్లో చేరినట్లు నాచారం గ్రామస్తులు, స్కూలు విద్యార్థులు చెబు తున్నారు. భిక్షపతి డ్రైవింగ్ లెసైన్స్‌లో పేర్కొన్నదాని ప్రకారం ఆయన వయసు55 ఏళ్లకు పైనే ఉంది. దీనికి తోడు వైరల్ జ్వరంతో బాధపడటంతో చూపు మందగించి ఉంటుందని, ఆ కారణంతోనే రైలు ను గమనించలేకపోయి ఉండవచ్చని వైద్య నిపుణలు అంటున్నారు. ఈ జ్వరంతో ఎక్కువ రోజులు బాధపడిన వారికి వినికిడి శక్తి మీద ప్రభావం ఉటుందని వైద్యులు చెప్తున్నారు. వాస్తవానికి ఏ మాత్రం జాగ్రత్తపడినా.. ఇది నిలువరించగలిగే ప్రమాదమేనని రైల్వే అధికారులు చెప్తున్నారు. 30 మీటర్ల ముందే రైలు లోకో పెలైట్ సత్యనారాయణ ఎమర్జెన్సీ బ్రేక్ కూడా వేశారు. ట్రైన్ హారన్‌తోపాటు, కీచుమనే ఎమర్జెన్సీ శబ్దాన్ని విద్యార్థులు గమనించి కేకలు వేశారని, అయినా డ్రైవర్ బస్సును ముందుకే పోనిచ్చారని ప్రత్యక్ష సాక్షి మురళీకృష్ట ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. మాసాయిపేట ఘటనపై కమిటీ మాసాయిపేట ప్రమాద ఘటనపై జీఎం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ డివిజన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (లైన్స్)లతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఘటనపై విచారణ చేపడుతుంది.