డ్రైవర్ అనారోగ్యమే.. ప్రమాదానికి కారణమా? | Driver .. Risk factors for poor health? | Sakshi
Sakshi News home page

డ్రైవర్ అనారోగ్యమే.. ప్రమాదానికి కారణమా?

Published Sat, Jul 26 2014 2:09 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

డ్రైవర్ అనారోగ్యమే.. ప్రమాదానికి కారణమా? - Sakshi

డ్రైవర్ అనారోగ్యమే.. ప్రమాదానికి కారణమా?

15 రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న తాత్కాలిక డ్రైవర్
అయినా నడపాలని ఒత్తిడి చేసిన కాకతీయ స్కూల్ యాజమాన్యం
 

సంగారెడ్డి: డ్రైవర్‌కు అనారోగ్యమే ప్రమాదం జరగడానికి కారణమా.. ఆయనకు వయసు మీదపడి చూపు మందగించడంతోనే రైలును గమనించలేకపోయాడా? సంఘటన స్థలాన్ని, డ్రైవర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. భిక్షపతిగౌడ్ సీనియర్ డ్రైవర్. ఆయన అనుభవాన్ని  ఉపయోగించుకుంటే మాసాయిపేట ముప్పుతప్పేదే. కానీ 15 రోజులుగా వైరల్ జ్వరంతో నీరసించిపోయిన ఆయన బస్సు ప్రమాదాన్ని నిలువరించడానికి సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోయాడు. డ్రైవర్ భిక్షపతి మూడున్నరే ళ్లుగా వర్గల్‌లోని విశ్వభారతి ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తీవ్ర జ్వరం రావడంతో 15 రోజుల నుంచి డ్యూటీకి రావటం లేదని, మనిషి కూడా నీరసించిపోయాడని అక్కడి స్కూల్ యాజమాన్యం ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు.
 
 పని చేయకపోవడంతో తిండికి ఇబ్బందిగా మారగా భిక్షపతి స్వగ్రామం నాచారం వచ్చి ఉంటున్నారు. ఇదే సమయంలో కాకతీయ స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లలో ఒకరు సెలవుపెట్టి వెళ్లిపోవడంతో స్కూల్ యాజమాన్యం భిక్షపతిని పనిలో పెట్టుకున్నట్లు సమాచారం. రోజు కు రూ.400 ఇస్తామని, రెండు రోజులు పనిచేయాలని ఒత్తిడి తేవడంతో, మందుల ఖర్చులకు పనికొస్తాయని భిక్షపతి తాత్కాలిక డ్రైవర్‌గా ఈ నెల 22న మధ్యాహ్నం విధుల్లో చేరినట్లు నాచారం గ్రామస్తులు, స్కూలు విద్యార్థులు చెబు తున్నారు. భిక్షపతి డ్రైవింగ్ లెసైన్స్‌లో పేర్కొన్నదాని ప్రకారం ఆయన వయసు55 ఏళ్లకు పైనే ఉంది. దీనికి తోడు వైరల్ జ్వరంతో బాధపడటంతో చూపు మందగించి ఉంటుందని, ఆ కారణంతోనే రైలు ను గమనించలేకపోయి ఉండవచ్చని వైద్య నిపుణలు అంటున్నారు. ఈ జ్వరంతో ఎక్కువ రోజులు బాధపడిన వారికి వినికిడి శక్తి మీద ప్రభావం ఉటుందని వైద్యులు చెప్తున్నారు. వాస్తవానికి ఏ మాత్రం జాగ్రత్తపడినా.. ఇది నిలువరించగలిగే ప్రమాదమేనని రైల్వే అధికారులు చెప్తున్నారు. 30 మీటర్ల ముందే రైలు లోకో పెలైట్ సత్యనారాయణ ఎమర్జెన్సీ బ్రేక్ కూడా వేశారు. ట్రైన్ హారన్‌తోపాటు, కీచుమనే ఎమర్జెన్సీ శబ్దాన్ని విద్యార్థులు గమనించి కేకలు వేశారని, అయినా డ్రైవర్ బస్సును ముందుకే పోనిచ్చారని ప్రత్యక్ష సాక్షి మురళీకృష్ట ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.


మాసాయిపేట ఘటనపై కమిటీ
 
మాసాయిపేట ప్రమాద ఘటనపై జీఎం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ డివిజన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ సేఫ్టీ  అధికారి, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (లైన్స్)లతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఘటనపై విచారణ చేపడుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement