ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ డిసీజెస్ స్వరజ్వరాలు
మన జీవితంలో మాట్లాడటానికీ తద్వారా ఎదుటివారికి మన భావాలు వ్యక్తం చేయడానికి స్వరం అవసరం. సంభాషణలకు మంచి స్వరం అందరికీ కావాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విచిత్రంగా ధ్వనిస్తే దాన్ని అవతలివారు సత్వరం గుర్తిస్తారు. ఇలా గొంతు విచిత్రంగా మారడానికి కొన్నిసార్లు వాళ్ల వృత్తి కూడా కారణమవుతుంది. వృత్తిపరంగా స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారిని ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ అంటారు. వీళ్లలో స్వరపేటికకు సంబంధించి వివిధ రకాల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటివారు గొంతు పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి స్వరాన్ని కోల్పోవచ్చు. ఇది జీవనోపాధిని దెబ్బతీయడం మాత్రమే గాక సమాజంతో కమ్యూనికేషన్‌కే ఒక ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అందుకే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారికి వచ్చే సమస్యలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.
ఎవరెవరిలో స్వర ఉపయోగం ఎక్కువ..?
ఉపాధ్యాయులు, రాజకీయవేత్తలు, పెద్దగా అరుస్తూ అమ్మకాలు సాగించే వీధి వర్తకుల వంటివారు నిత్యజీవితంలో గొంతుతో ఎక్కువగా పనిచేస్తుంటారు. వృత్తిరీత్యా పాటలు పాడుతూ తమ కళను ప్రదర్శించే గాయకులకూ, మిమిక్రీ కళాకారులకూ గొంతే తమ భావ, కళావ్యక్తీకరణ సాధనం. వీరంతా ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ కోవకే చెందుతారు. వీళ్లలో స్వరానికి, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇక మామూలు ప్రజల్లో సైతం గట్టిగా అరుస్తూ మాట్లాడేవారికి కూడా సమస్యలు వస్తాయి.
స్వరసమస్యల్లో రకాలు...
స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో వచ్చే సమస్యలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. ఆర్గానిక్ సమస్యలు
2. ఫంక్షనల్ సమస్యలు
ఆర్గానిక్ సమస్యలు: స్వరవ్యవస్థకు సంబంధించిన ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్‌గాని లేదా మాట్లాడేందుకు దోహదపడే శరీరపరమైన నిర్మాణ వ్యవస్థలోని ఏదైనా ప్రాంతంలో గడ్డలు, వాపులు రావడం, హార్మోన్లపరంగా ఏదైనా తేడాలు రావడం, గొంతుకు సంబంధించిన అలర్జీలు, గ్యాస్ కడుపులోంచి పైకి తన్నడం వల్ల వచ్చే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), శ్వాసతీసుకోవడంలో సమస్యలు, వినికిడిలోపం, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, సైనసైటిస్, స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం వల్ల స్వరానికి కలిగే ఇబ్బందులను వైద్యపరిభాషలో ఆర్గానిక్ సమస్యలుగా పేర్కొంటారు.
ఫంక్షనల్ సమస్యలు : ఇవి స్వరాన్ని మామూలు కంటే ఎక్కువగా ఉపయోగించడం, గొంతును మాట్లాడటానికి బదులుగా బాగా దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే సమస్యలు. కొన్ని సందర్భాల్లో ఈ ఫంక్షనల్ సమస్యలు... ఆర్గానిక్ సమస్యలకు దారితీయవచ్చు.
మాట్లాడే ప్రక్రియ ఎలా జరుగుతుంది?
మనం మాట్లాడే ప్రక్రియలో నాలుగు వ్యవస్థలు క్రియాశీలంగా పనిచేసి మనం సంభాషించగలిగేలా చేస్తాయి. అవి... 1) శ్వాసవ్యవస్థ, 2) స్వరవ్యవస్థ (ఫొనేటరీ), 3) రెజనేటరీ వ్యవస్థ 4) ఆర్టిక్యులేటరీ వ్యవస్థ. శరీర నిర్మాణపరంగా గొంతు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే ఈ నాలుగు వ్యవస్థలూ... తమ కార్యకలాపాలు నిర్వహించడానికి మెదడు, నరాలతో అనుసంధానితమై ఉంటాయి. ఈ నాలుగు చోట్లలో ఎక్కడ లోపం వచ్చినా మాట్లాడే స్వరంలో మార్పు వస్తుంది.
ముందుగా మనం గాలి పీల్చుకున్న తర్వాత అది ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి నుంచి గాలిగొట్టం (ట్రాకియా) ద్వారా గొంతులో ఉన్న స్వరపేటికలు ఉన్న లారింగ్స్ అనే భాగానికి చేరుతుంది. అక్కడ స్వరపేటికలోని కండరాలు స్పందించే తీరుకు అనుగుణంగా కొద్ది కొద్ది మోతాదుల్లో గాలి (పఫ్స్ ఆఫ్ ఎయిర్) పైకి వచ్చి ఫ్యారింగ్స్ అనే భాగాన్ని చేరుతుంది. అక్కడ ఒక్కొక్క భాగంలో గాలి ఒక శబ్దతరంగంగా మారుతుంది. ఈ శబ్దతరంగాలు నోరు, ముక్కురంధ్రాల నుంచి బయటకు వెలువడుతూ రకరకాల శబ్దాలను వెలువరిస్తాయి. ఆయా శబ్దాలన్నీ ఒక వరుస క్రమంలో వస్తూ మనకు అర్థమయ్యే భాషలా వినిపిస్తుంటాయి. ఇదీ మాట్లాడే సమయంలో జరిగే ప్రక్రియ.
ఎక్కువగా మాట్లాడేవారికి వచ్చే సమస్యలు...
1) లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ : దీన్నే సెలైంట్ రిఫ్లక్స్ అని కూడా అంటారు. మన జీర్ణవ్యవస్థలోని ఈసోఫేగస్ అనే భాగంలో రెండు చివరలా కడుపులోని పదార్థాలపై పనిచేసే యాసిడ్ బయటకు రావడానికి వీల్లేకుండా మూయడానికి స్ఫింక్టర్స్ అనే మూతలు ఉంటాయి. అవి సరిగా పనిచేయకకపోవడం వల్ల స్వరంలో మార్పులు వస్తాయి. దీని లక్షణాలు గ్యాస్‌ను బయటకు తన్నే జీఈఆర్డీ అనే సమస్యతో పోలి ఉన్నా ఇందులో నిర్దిష్టంగా కొన్ని మార్పులు ఉంటాయి.
2) మజిల్ టెన్షన్ డిస్ఫోనియా : ఇందులో శబ్దాన్ని వెలువరించడానికి అవసరమైన గొంతు కండరాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నా... సాధారణ వ్యక్తులతో పోలిస్తే అవి చాలా గట్టిగా ఉండి శబ్దాన్ని సృష్టిండానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమస్యను సంక్షిప్తంగా ‘ఎమ్టీడీ’ అని కూడా అంటారు.
3) వోకల్ నాడ్యూల్స్ : మన గొంతులో శబ్దాన్ని సృష్టించే స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్ అనే భాగంలో అదనపు కండ పెరగవచ్చు. ఇలా పెరిగిన అదనపు కండను ‘వోకల్ నాడ్యూల్స్’ అంటారు.
4) వోకల్ పాలిప్స్ : స్వరపేటికలో ఇరువైపులా ఎటైనా పెరిగే అదనపు కండను వోకల్ పాలిప్స్‌గా పేర్కొంటారు.
5) వోకల్ సిస్ట్స్, స్పాస్మోడిక్ డిస్ఫోనియా : వోకల్ సిస్ట్లోనూ స్వరపేటికలో కండ పెరగడం జరుగుతుంది. అయితే అది ఒక సంచిలా పెరిగి ఆ సంచిలో ఒకరకం ద్రవం నిండి ఉంటుంది.
6) వోకల్ ఫోల్డ్ స్కారింగ్ : స్వరపేటికలో స్వరతంత్రులు స్పందించే ముడుతల్లో (ఫోల్డింగ్స్లో) గాటులాంటిది ఏర్పడటాన్ని వోకల్ ఫోల్డ్ స్కారింగ్ అంటారు.
7) వోకల్ ఫోల్డ్స్‌లో మార్పులు : స్వరపేటికలోని స్వరతంత్రుల ముడుతలన్నీ ఒక నిర్ణీత క్రమంలో ఉంటాయి. వీటిలో ఏదైనా మార్పులు రావడం వల్ల స్వరం మారిపోవచ్చు. ఇలా వచ్చే మార్పులను వోకల్ ఫోల్డ్స్ ఛేంజెస్గా పేర్కొంటారు.
8) వయసు పరంగా స్వరంలో వచ్చే మార్పులు : వయసు పెరుగుతున్న కొద్దీ అన్ని కండరాల్లోనూ మార్పులు, బలహీనతలు వచ్చినట్టే స్వరపేటికలోని కండరాల్లోనూ మార్పులు వస్తాయి. ఫలితంగా వయసు పైబడ్డ కొద్దీ స్వరంలోనూ మార్పులు వస్తాయన్నమాట.
అధికంగా వచ్చే సమస్య వోకల్ ఫోల్డ్ నాడ్యూల్స్
వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ ఫోల్డ్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట.
ఎక్కువగా వచ్చే మరో సమస్య వోకల్ పాలిప్స్
ఇవి స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్ పైన ఉండే భాగాలు. వీటిలో ద్రవం నిండి ఉంటుంది. వోకల్ పాలిప్స్ కూడా నాడ్యూల్స్ లాగానే స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు సరిగా మూసుకుపోకుండా అడ్డుపడతాయి. ఫలితంగా మాట మధ్యమధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది.
మరో ముఖ్యమైన సమస్య వెంట్రిక్యులార్ డిస్ఫోనియా
వెంట్రిక్యులార్ డిస్ఫోనియా లేదా ప్లైకా వెంట్రుక్యులారిస్ అనే సమస్య కూడా వృత్తిపరంగా స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారిలో తరచూ కనిపిస్తుంటుంది. వీళ్లలోనూ ట్రూ వోకల్ ఫోల్డ్స్కు బదులుగా ఫాల్స్ వోకల్ఫోల్డ్స్ అనేవి స్పందిస్తుంటాయి. ఫలితంగా స్వరంలో తేడా వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో నాడ్యూల్స్గానీ లేదా పాలిప్స్గానీ ఏవీ ఉండవు. వీళ్ల స్వరం నూతి నుంచి వచ్చినట్లుగా, లోగొంతుకతో మాట్లాడుతున్నట్లుగా వస్తుంటుంది. మాటలో గరుకుతనం ఉన్నట్లు అనిపిస్తుంది. గాలిలో మాట్లాడినట్లుగా ఉంటుంది. మాట్లాడుతుంటే చాలా కష్టపడుతున్నట్లు (స్ట్రెయిన్డ్ వాయిస్) అనిపిస్తుంది.
లారింజైటిస్
స్వరపేటికలోగాని లేదా మన శ్వాసవ్యవస్థలోని లారింగ్స్ అనే భాగంలోగాని ఇన్ఫెక్షన్ రావడాన్ని లారింజైటిస్ అంటారు. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే గొంతులో మంట, ఇరిటేషన్, మాటల మధ్య దగ్గు రావడం, గొంతులో ఏదో వాచినట్లుగానూ లేదా ఏదో అడ్డుపడ్డట్లుగానూ అనిపిస్తుంది. లారింజైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం కూడా రావచ్చు. వీళ్లలో కొన్నిసార్లు స్వరం తాత్కాలికంగా పూర్తిగా పోతుంది.
ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో పై సమస్యలకు కారణాలు
వృత్తిపరంగా ఎక్కువగా తమ స్వరాన్ని ఉపయోగించే వారు తమ స్వరపేటికను ఎక్కువగా అలసిపోయేలా (స్ట్రెయిన్) చేస్తారు. గొంతు (స్వరపేటిక)కు తగినంత విరామం ఇవ్వకపోవడం, సామర్థ్యం కంటే ఎక్కువగా అరవడం, తమ పిచ్ రేంజ్‌కు మించి స్వరపేటికను ఉపయోగించడం చేస్తుంటారు. మన గొంతు ఎప్పుడూ తడిగా ఉండాలి. అప్పుడే స్వరానికి సమస్యలు రావు. వృత్తిపరంగా గొంతును ఎక్కువగా వాడే వారు మధ్యమధ్య మంచినీళ్లు తాగుతూ ఉండాల్సి రావడం చూస్తుంటాం. అప్పుడే మాట స్పష్టంగా ఉంటుంది. గొంతును తడిగా ఉంచడానికే ఇలా చేస్తుంటారన్నమాట. అయితే గొంతు పొడిబారిపోతున్నా దాన్ని పట్టించుకోకుండా అలాగే మాట్లాడటాన్ని కొనసాగించడం వంటి పనుల వల్ల స్వరపేటికపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల కూడా అక్కడి వోకల్ ఫోల్డ్స్ కండరాలు ఎక్కువగా అలసిపోతాయి. దాంతో స్వరపేటిక ఎక్కువ రాపిడికి గురవుతుంది. ఇది స్వరపేటికలో కొంత భౌతికమైన గాయాన్ని సైతం చేస్తుంది. ఫలితంగా ఆ గాయం ఉన్నచోట మరింత రాపిడి జరగడం వల్ల ఒక్కోసారి అక్కడ ఇన్ఫెక్షన్ లేదా వాపు కూడా రావచ్చు. అయినప్పటికీ అదేపనిగా స్వరపేటికను వాడుతూ ఉంటే క్రమంగా కొన్నాళ్లకు అది వోకల్ నాడ్యూల్స్ లేదా వోకల్ పాలిప్స్ వంటి సమస్యలతో పాటు లారింజియల్ ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు.
ఏయే పరీక్షలు అవసరం...?
ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో స్వరంలో ఏదైనా మార్పులు కనిపించనప్పడు గొంతుబొంగురుపోవడం ముందుగా కనిపిస్తుంది. ఇక మధ్యమధ్య మాటలు ఆగిపోవడం, చాలా శక్తి ఉపయోగిస్తే గాని గొంతు పెగలకపోవడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న అన్ని సమస్యల్లోనూ కొద్దిపాటి స్వల్పమైన తేడాలు మినహాయించి లక్షణాలన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. అందువల్ల స్వరంలో మార్పు వచ్చినప్పుడు అందుకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోవడం (కరక్ట్ డయాగ్నోజ్) ముఖ్యం. ఈ లక్షణాలు కనిపించగానే నిపుణులైన ఈఎన్టీ వైద్యులను, స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించాలి. వారు లారింగోస్కోపీ అనే ఉపకరణం ఆధారంగా సమస్యను నిర్దిష్టంగా నిర్ధారణ చేస్తారు. ఇక స్పీచ్ థెరపిస్ట్‌లు స్వరసంబంధిత పరీక్షలు చేసి స్వరంలోని మార్పులను పూర్తిగా విశ్లేషిస్తారు. దీనికోసం వారు రూపొందించే పరీక్ష ప్రణాళిక ఈ కిందివిధంగా ఉంటుంది.
1) ఈఎన్టీ పరీక్ష
2) లారింగోస్కోపీ / స్ట్రోబోస్కోపీ ఉపకరణంతో చేసే పరీక్ష
3) స్వరం వినిపించే తీరును అంచనా వేయడం (వాయిస్ అసెస్మెంట్)
4) లక్షణాల ఆధారంగా వ్యాధి చరిత్రను విపులంగా రావడం (డిటెయిల్డ్ కేస్ హిస్టరీ)
5) కొన్ని పరికరాలు / ఉపకరణాలతో పరీక్ష చేసి స్వరంలో లోపాలను విశ్లేషించడం (ఇన్స్ట్రుమెంటల్ వాయిస్ అనాలసిస్).
చికిత్స
ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో వచ్చే స్వర సమస్యలకు చికిత్స అన్నది ఆ సమస్యకు కారణాలను బట్టి, అది చూపే లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. కొన్ని సమస్యల్లో యాంటీబయాటిక్స్, యాంటీ రిఫ్లక్స్ మందులు వాడితే సరిపోతుంది. మరికొన్ని సమస్యలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ముఖ్యంగా వోకల్ నాడ్యూల్స్ వంటివి పెద్దవిగా పెరిగినప్పుడు వాటిని శస్త్రచికిత్సతో తొలగించాల్సి రావచ్చు. మొదట్లో చాలావరకు మందులు, వాయిస్ థెరపీ, వోకల్ హైజీన్ (స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడుకునే జాగ్రత్తలు... అంటే గొంతుకు తగిన విశ్రాంతి ఇవ్వడం, ఎప్పుడూ తడిగా ఉంచడం వంటి నివారణ చర్యలు), జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్) ద్వారా వీటిని తగ్గించవచ్చు. ఇక దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడేవారికి, వోకల్ నాడ్యూల్స్ పరిమాణం పెద్దగా ఉన్నవారికి ఫోనో సర్జరీ లేదా నాడ్యూల్ రిమూవల్ వల్ల ఉపశమనం కలుగుతుంది.
వాయిస్ థెరపీ / నివారణ
వాయిస్ థెరపీ చాలావరకు స్వర సమస్యల నివారణకూ తోడ్పడు తుందని అనుకోవచ్చు. ఇందులో స్వర సమస్యను అంచనా వేయడం, విశ్లేషించడం (వాయిస్ అసెస్మెంట్ అండ్ అనాలిసిస్) ద్వారా వాయిస్ థెరపీ చికిత్సకు ప్రణాళికను రచిస్తారు. వాటి ఆధారంగా ఈ చికిత్సను డిజైన్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా అవలంబించే మార్గాలు...
1) స్వరం వాడే విధానం, స్వరానికి సంబంధించిన అలవాట్లు, మాట్లాడే విధానంతో పాటు స్వరాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు.
2) మంచి నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు తరచూ తాగాల్సిన అవసరం గురించి వివరిస్తారు. అప్పుడే వోకల్ ఫోల్డ్స్ తడిగా ఉండి సమస్యలు రాకుండా ఉంటాయి.
3) అతిగా స్వరాన్ని వాడేవారికి స్వరపేటికకు ఇవ్వాల్సిన విశ్రాంతి గురించి వివరిస్తారు.
4) స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రక్రియల (వోకల్ హైజీన్ ప్రోగ్రామ్)ను వివరిస్తారు.
5) స్వరం నుంచి మాటలెలా వస్తాయి, ఎందుకీ స్వర సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న విషయాలను వివరిస్తూ, అందుకు తగిన చికిత్స గురించి రోగికి కౌన్సెలింగ్ ఇస్తారు.
6) వోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ బోధిస్తారు.
7) శ్వాస సంబంధిత వ్యాయామాలు వివరించి, వాటిని చేయిస్తారు. వీటివల్ల స్వరపేటికపై ఒత్తిడి తగ్గడంతో పాటు వాటిలోని పొరల్లో ఉండే కండరాలు సక్రమంగా పనిచేస్తాయి. ఈ ప్రక్రియలో మొదట శబ్దాలు, తర్వాత పదాలు, అటుపై వాక్యాలు, అనంతరం సంభాషణలు ప్రాక్టీస్ చేయిస్తారు.
8) వారి వృత్తిని వదులుకోవడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, వృత్తికి అవరోధం కలిగించకుండానే వారు స్వరం విషయంలో తీసుకోవాల్సిన / చేసుకోవాల్సిన మార్పులను వివరిస్తారు.
ఈ ప్రక్రియల వల్ల ఒకవేళ దీనితో సాధ్యం కానప్పుడు మందులు లేదా శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంతమేర కొన్ని వ్యాయామాల ప్రాక్టీస్‌లు అవసరమవుతాయి.
హోమియో విధానంలో స్వర సమస్యలకు చికిత్స / ఔషధాలు
అర్జంటమ్ నైట్రికమ్: దీర్ఘకాలికంగా గొంతుబొంగురుపోవడం, తాత్కాలికంగా స్వరం కోల్పోవడం వంటి సమస్యలకు వాడదగిన ఔషధం. గాయకులు పాటపాడుతూ ఉచ్ఛస్వరానికి వెళ్లినప్పుడు దగ్గురావడం వంటి సమస్యలకూ వాడవచ్చు. స్వరపేటిక వాపు, నొప్పి, శ్లేష్మం, గొంతులో మందంగా పూతలా ఏర్పడినవారికి, మింగడానికి కష్టంగా ఉండి, గొంతులో ఏదో పేడులా అడ్డుపడినట్లు అనిపించడం; ఆహారం తీసుకున్న తర్వాత గొంతులోనే ఉన్నట్లు అనిపించడం; ఊపిరిఆడనట్లు అనిపించడం... వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమస్యలు అర్ధరాత్రివేళల్లో, భయపడినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, తీపిపదార్థాలు తీసుకున్నప్పుడు, వేడిగా ఉండే గదిలో ఎక్కువవుతాయి. వీరికి చల్లగాలి వల్ల ఉపశమనం కలుగుతుంది.
అకోనైట్ : హఠాత్తుగా గొంతుబొంగురుపోవడం, గట్టిగా మాట్లాడినవారిలో స్వరపేటిక దెబ్బతినడం, ధ్వనిలో మార్పు, కొన్నిసార్లు, స్వరాన్ని తాత్కాలికంగా కోల్పోవడం వంటి లక్షణాలు... ముఖ్యంగా బాగా భయపడ్డవారిలో లేదా హఠాత్తుగా షాక్‌కు గురైనవారిలో లేదా చల్లగాలికి వెళ్లినప్పుడు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా పై లక్షణాలతో పాటు జ్వరం, బొంగురుగా దగ్గురావడం, గొంతుపొడిబారినట్లుగా ఉండటం, విశ్రాంతి లేకుండా అటూ ఇటూ తిరగడం వంటివి చేసినప్పుడు కూడా ఇక్కడ పేర్కొన్న లక్షణాలు చూడవచ్చు. రాత్రివేళలో, శ్వాసతీసుకున్నప్పుడు కూడా వీరికి పైన పేర్కొన్న లక్షణాలు ఎక్కువవుతాయి.
కాస్టికమ్ : దీర్ఘకాలికంగా స్వరపేటిక రాపిడికి గురైనవారిలోనూ, వోకల్కార్డ్స్ పక్షవాతానికి గురైన వారిలో వాడదగిన మందు ఇది. గొంతులో మంట, నొప్పి, పొడిబారినట్లుగా అనిపించడం, పొడిదగ్గు, గొంతుబొంగురుపోవడం... ముఖ్యంగా సభల్లో ప్రసంగించేవారికి, సింగర్స్‌కూ ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. చల్లగాలికీ, ఉదయాన్నే ఎక్కువ కావడం, తెమడ గొంతులో అడ్డం పడినట్లుగా అనిపించడం, బయటకు తీయడం కష్టంగా అనిపించడం, మధ్యరాత్రిలో విపరీతమైన పొడిదగ్గు, నిద్రకు భంగం కలగడం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మందు చక్కటి పరిష్కారం.
బెల్లడోనా : ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్‌లో ప్రధానంగా ఉపయోగిస్తారు. గొంతు ఎర్రగా ఉండి, పొడిబారినట్లుగా ఉంటుంది. గొంతు పట్టేసినట్లు, మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోగులు ముఖ్యంగా నిమ్మజాతి పండ్లనూ, పులుపునూ ఇష్టపడతారు. బెల్లడోనా లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి. అదేవిధంగా తగ్గిపోతాయి. దీనికారణంగా కంఠధ్వని కూడా బొంగురుపోయినట్లుగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు దగ్గు కూడా వస్తుంటుంది.
స్పాంజియా : ఇది గొంతు, స్వరపేటిక సమస్యలకు దివ్యౌషధం. వీరికి గొంతుపొడిబారిపోవడం, దగ్గుతో పాటు తెమడ రావడం జరుగుతుంది. గొంతువాపు, మంట ఉండి, మింగడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ లక్షణాలు తీపి పదార్థాలు తిన్న తర్వాత అధికమవుతాయి. లారింజైటిస్కి కూడా స్పాంజియా చక్కగా పనిచేస్తుంది.
డ్రొసెరా : ఇది ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. స్వరపేటికపై ప్రభావం పడటం వల్ల కంఠస్వరం బొంగురుపోయినట్లుగా ఉంటుంది. దగ్గు, తిన్న ఆహారపదార్థాలు వాంతి చేసుకోవడం, దగ్గుపొడిగా కోరింత దగ్గులా ఉంటుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి పడుకున్నప్పుడు, ద్రవపదార్థాలు తీసుకున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, పాటలు పాడటం వల్ల అధికం అవుతాయి.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, హోమియో వైద్య నిపుణులు, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
స్వరభేదం / స్వరభంగం
మనిషి మనిషికీ కంఠస్వరంలో తేడా కనిపిస్తుంది. దీనికి కారణం గొంతులోని స్వరపేటికలోని రచనావిశేషం. అంటే అక్కడ ఉన్న కండరాల నిర్మాణంలోని తేడాలన్నమాట. ఇది సృష్టిలోని ప్రకృతి ధర్మం. ఏ భాగమైనా సక్రమరీతిలో పనిచేయాలంటే, దానికి సంబంధించిన ‘రక్తప్రసరణ, నరాల పనితీరు, పోషకవిలువలు, వినాళ గ్రంథులపై ప్రభావం’ తగిన స్థాయిలో ఉండాలి. అంతేకాకుండా ఆ అవయవానికి సంబంధించి ‘వ్యాయామం’ (అంటే అది చేసే క్రియ) తక్కువ కాకూడదు. అలాగే మితిమీరీ ఉండకూడదు. వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా ఆ భాగపు పనితీరు దెబ్బతింటుంది. కంఠస్వరానికి బంధించిన ఈ వికారాన్ని ఆయుర్వేదకారులు ‘స్వరభేదం’గా వర్ణించారు. ‘బిగ్గరగా మాట్లాడటం, విషపదార్థాలు (అంటే ఆయా కణజాలాలను అసాత్మ్యంగా ఉంచే, హానికలిగించే పదార్థాలు) అధ్యయనం (అదేపనిగా నిరంతరం చదవడం, మాట్లాడటం, పాడటం, అరవడం మొదలగునవి), అభిఘాతం (దెబ్బతగలడం) వంటివన్నీ స్వరభేదానికి / స్వరభంగానికి ప్రధాన కారణాలు. (ఆధారం: మాధవాచార్యుల వారి శ్లోకం... అత్యుచ్ఛ భాషణ విషాధ్యయనాభిఘాతాః....)
పై సందర్భాల్లో స్వరం స్వభావం మారిపోయి మాట్లాడటం కష్టం కావడం, అతి చిన్న శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతుబొంగురుపోవడం, తాత్కాలిక స్వరనాశం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కారణాన్ని బట్టి దోషప్రాబల్యం మారుతుంటుంది. ఇతర లక్షణాలు కూడా (అంటే... జ్వరం, గొంతునొప్పి, మంట, దగ్గు వంటివి) మారుతుంటాయి. మరికొన్ని కారణాల వల్ల శాశ్వత స్వరఘ్నం కలగవచ్చునని ప్రాచీనాచార్యులు ప్రస్తావించారు.
నివారణ / చికిత్స
ఇందులో ముఖ్యమైనది ‘నిదాన పరివర్జనం’. అంటే కారణాన్ని దూరం చేయడం. కంఠకార్యానికి సాధనతో బాటు తగిన విశ్రాంతి కూడా అవసరమని గుర్తుంచుకోవాలి.
శీతలపానియాలు, ఐస్‌క్రీములు, మసాలాలు, కారం, ఉప్పుతో కూడిన నూనె పదార్థాలు మొదలైన వాటి జోలికి పోవద్దు.
వారానికి రెండు, మూడు సార్లు ‘తిలతైలం’తో పుక్కిలిపట్టి అనంతరం ‘త్రిఫలాకషాయం’తో కంఠాన్ని శుభ్రపరచుకోవాలి. (దీన్ని ‘గండూషం’ అంటారు.
రోజూ ‘ఖదిరాదివటి (రెండు మాత్రలు) ఒక పూట, ‘లవంగాదివటి’ (రెండు మాత్రలు) ఒకపూట చప్పరించి తినాలి. లేదా పొడి చేసి తేనెతో తినవచ్చు. అనంతరం గోరువెచ్చని నీళ్లు తాగాలి. అదేవిధంగా ‘కూకా’ అనే పేరుతో మాత్రలు ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. ఇవి కూడా సత్ఫలితాలనిస్తున్నాయి.
రసాయనంగా: ‘వాసాకంటకారీలేహ్యం’ ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. ఇది కంఠ, స్వర ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
జీడిపప్పు, బాదం, ఖర్జూరం వంటి శుష్క ఫలాలను ప్రతిరోజూ మితంగా తింటే శరీరానికి చక్కటి ఖనిజలవణాలంది, బలకరంగా ఉంటూ, స్వరానికీ ఆరోగ్యం చేకూరుతుంది.
యష్టిమధుచూర్ణాన్ని (నాలుగు గ్రాములు) తేనెతో రెండుపూటలా తింటే కంఠరసాయనంగా పనిచేస్తుంది.
త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), రెండు గ్రాముల తేనెతోరోజుకి ఒకటి లేక రెండుసార్లు తినాలి.
లశున క్షీరం : ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దంచిన వెల్లుల్లి రేకలు మూడు, కొంచెం బెల్లం కలిపి బాగా మరిగించి, వడగట్టి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు, రెండుపూటలా తాగాలి.
గమనిక : పైన పేర్కొన్న ఔషధాలలో ఏ రెండు లేక మూడింటిని వాడినా సరిపోతుంది. ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు.
ఈ చికిత్సాప్రక్రియల వల్ల గొంతు వ్యాధులు, స్వరపేటికకు సంబంధించిన వికారాలూ తగ్గుతాయి. ఉదా: జ్వరం, గొంతునొప్పి, గొంతుగరగర, దగ్గు, జలుబు, స్వరభేదం అన్నీ తగ్గుతాయి.
- డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హైదరాబాద్
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి