volley ball tournament
-
తెలంగాణ పోలీస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్లో తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. ముషీరాబాద్ వాలీబాల్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ పోలీస్ 25–23, 25–20, 25–22తో గాంధీనగర్ జట్టుపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో తెలంగాణ పోలీస్ 25–20, 25–16, 25–19తో ఎల్బీ స్టేడియంపై గెలుపొందగా... గాంధీనగర్ జట్టు 20–25, 25–21, 25–19తో జీవైసీ జట్టును ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో వాలీబాల్ సీనియర్ కోచ్ నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. -
ఆలిండియా రైల్వేస్ వాలీబాల్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వేస్ వాలీబాల్ చాంపియన్‌షిప్ సోమవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈనెల 22 వరకు జరుగనున్న ఈ టోర్నీలో జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్, రైల్వే ప్రొటెక్టింగ్ ఫోర్స్‌లకు చెందిన 20 జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. జట్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు అర్జున్ ముండియా, కార్యదర్శి ఈవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ పోటీలు
చికాగో : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టీఏజీసీ) వాలీబాల్, త్రో బాల్ పోటీలను ఈ నెల 8వ తేదీన బౌలింగ్ బ్రూక్‌లోని పెలికాన్ హార్బర్ ఇండోర్ ఆక్వాటిక్ పార్కులో ఇండ్సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సహకారాలతో ఘనంగా నిర్వహించింది. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్ర ప్రతిపాదించిన బొబ్బిలి మాధవరెడ్డి జ్ఞాపక వాలీబాల్, త్రో బాల్ పోటీలను పిలవాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను టీఏజీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దివంగత మాధవ రెడ్డి అధ్యక్షుడిగా, టీఏజీసీ స్థాపక సభ్యుడిగా ఉన్నారు. టీఏజీసీ సభ్యులను, తెలుగు వారందరిని సరదాగా ఉండటానికి సాధారణ జీవితాల నుండి ఉపశమనం పొందడానికి, అలాగే కొత్త స్నేహితులను సంపాదించడానికి ప్రోత్సహించడం ఈ పోటీల యొక్క ప్రధాన లక్ష్యమని టీఏజేసీ పేర్కొంది. టీఏజీసీ కార్యవర్గం, క్రీడా విభాగం అంకితభావంతో ఈ సంవత్సరము నమోదు చేసిన జట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. టీఏజీసీ పురుషుల కోసం వాలీబాల్ టోర్నమెంట్‌ను 3 విభాగాలలో నిర్వహించింది. మహిళలకు త్రో బాల్ పోటీలను నిర్వహించారు. వాలీబాల్ విభాగంలో బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కేటగీరీల్లో పోటీలు జరిగాయి. మొత్తం ౩౦ వాలీబాల్ జట్లు, 4 గ్రూపులు, 90 పైగా మ్యాచ్‌లు జరిగాయి. 280 మంది పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఆటల పర్యవేక్షణ, విజయాలు, నష్టాలను నమోదు చేయడం, స్కోర్లను నవినీకరించడం, తదుపరి మ్యాచ్‌లకు కచ్చితంగా జట్లు మరియు రిఫరీలు సమకూర్చడము చేయడం వంటివి సమయానుసారంగా అందుబాటులో ఉన్నవాలంటీర్స్, బీఓడీ ప్రవీణ్ వేమలపల్లి, అవినాష్ లట్టుపల్లి, విజయ్ భీరమ్, అంజి కందిమళ్ల, రాము బిల్లకంటి, మమతా లంకల, ప్రదీప్ కందిమళ్ల, జ్యోతి చినాతలాపని, వాలంటీర్స్ శశి, రమణ కాల్వ, రోహిత్ అకులా, సంతోష్ కొండూరి ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఇండ్ సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సంస్థల యజమాని వినోజ్ చనుమోలు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులు, క్రీడా విభాగ సభ్యులతో కలిసి పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. త్రో బాల్ : విజేత: వెస్ట్ మాంట్ ఫ్యూరియస్ సిక్స్ రన్నరప్: రుద్ర జట్టు వాలీబాల్ (అడ్వాన్స్డ్): విజేత : వాలీబాల్ ఆడిక్ట్స్ రన్నరప్ : స్పార్టాన్స్ ఇంటర్మీడియట్ వాలీబాల్: విజేతలు : దేశీ బాయ్స్ -1 రన్నరప్ : చికాగో బుల్స్ పురుషుల వాలీ బాల్: విజేతలు :స్మ్న్-1 రన్నరప్ : దేశీ బాయ్స్ -2 టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే, ఇండోర్ త్రో బాల్. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ఇండ్ సాఫ్ట్ సీఈవో వినోజ్ చనుమోలు, హైదరాబాద్ హౌస్ శంబుర్గ్ వాసు వల్లభనేని, ఆటస్థలం నిర్వహణ యాజమాన్యానికి, వాలంటీర్లకు, రిఫరీలకు, లైన్ మెన్లకు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులకు, క్రీడా కమిటీ, జట్టు కెప్టెన్లు అలాగే అన్ని జట్ల సభ్యులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
గూడూరు: క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తేనే రాణించగలరని రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే గనబాబు పేర్కొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. పలు జిల్లాలకు చెందిన, పురుషులు, మహిళా జట్లకు ఉదయం 7.30 నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాజరైన గనబాబు మాట్లాడారు. గూడూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. సహకారం అందించిన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీని ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో స్థానం సాధించిన వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, మునిగిరీష్, తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ విజేత ఖమ్మం
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్-17 రాష్ట్రస్థాయి బాలబాలికల వాలీబాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలుర విభాగంలో విజేతగా ఖమ్మం జిల్లా జట్టు నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ మొదలు, సెమీస్, ఫైనల్స్ ఇలా మొత్తం 26 మ్యాచ్‌లను ఒకేరోజు నిర్వహించారు. క్రీడాకారులు తీవ్ర అలసటకు లోనయ్యారని ఆయా టీమ్‌ల యాజమాన్యాలు వాపోయాయి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో వరంగల్, తృతీయస్థానాన్ని విజయనగరం దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో వరంగల్, నిజామాబాద్ ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ బాలరాజు, డీఎస్డీవో కబీర్దాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ జి.శ్యాంప్రసాద్, కె.క్రిష్టపర్‌బాబు, షఫీ, క్రీడల పరిశీలకులు బాలరాజు, ఖమ్మం టూటౌన్ సీఐ సారంగపాణి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఈటీలు డీఈఓను సన్మానించారు. పీఈటీలు, క్రీడాకారులు సమన్వయంతో వ్యవహరించినప్పుడే విజయాలు సాధ్యమని డీఈఓ అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనన్నారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.శ్యాంబాబు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులు కె. రాందాస్ (నల్లగొండ), ఎమ్. సృజన్ (వరంగల్), కె.నరేష్ (ఖమ్మం), రాజు (ఖమ్మం), ఎస్.జగపతిబాబు (వరంగల్), ఎన్.రామకృష్ణ (గుంటూరు), కె.పాల్రాజు (శ్రీకాకుళం), నరేష్ (రంగారెడ్డి), ఎమ్.రామారావు (విజయనగరం), కె.పాల్‌రాజ్ (ప్రకాశం), మణికుమార్ (ఖమ్మం), బాషామియా (కర్నూల్), స్టాండ్‌బై గా ఎమ్.తిరుపతి (కరీంనగర్), మణికంఠ (తూర్పుగోదావరి), సాకిబ్ బాషా (చిత్తూర్) ఎంపికయ్యారు. జాతీయ జట్టుకు ఎంపికైన బాలికలు: యు. హంస (నిజామాబాద్), ఎమ్. శ్రీప్రియ (క్రిష్ణా), ఎస్కె. ఈస్తర్‌రాణి (క్రిష్ణా), ఎమ్.అఖిల (నిజామాబాద్), ఎ.జ్యోతి (వరంగల్), ఇ. నిర్మలాదేవి (వరంగల్), డి.నిరూషా (వరంగల్), ఎ.సాహితీరెడ్డి (రంగారెడ్డి), ఎస్. ఐశ్వర్య (తూర్పుగోదావరి), ఎస్.లావణ్య (నల్లగొండ), కె.లక్ష్మీశిరీష (కడప), బి.శ్రావణి (ఖమ్మం), స్టాండ్ బైగా షర్మిల (ప్రకాశం), ఆర్.వరలక్ష్మి (మెదక్), ఎమ్.భవాని (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు.