పట్టభద్రులు అంతంతే
సాక్షి, మహబూబ్‌నగర్: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగుతోంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గతనెల 26వ తేదీ నుంచి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓటరుగా నమోదు కా ర్యక్రమం నెలరోజులుగా సాగుతున్నా.. ఒకసారి గడువు పెంచినప్పటికీ పట్టభద్రుల నుంచి అంతగా స్పందన కనిపిం చడం లేదు. తాజాగా నేటి(మంగళవారం)తో గడువు ముగియనుంది. అయినప్పటికీ జిల్లాలో పట్టభద్రుల నమోదు కార్యక్రమం చాలా పేలవంగా సాగింది. జిల్లాలో ఇప్పటివరకు 11,686 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిలో కేవలం 2,563 మాత్రమే ఓటర్లుగా నమోదయ్యాయి. ఇలా జిల్లాలో 41,674 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.
అత్యల్పంగా జిల్లాలోనే..
పట్టభద్రుల ఓటరు నమోదులో జిల్లా నుంచే అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ మూడు జిల్లాలకు కలిపి 57,816 దరఖాస్తులు రాగా, అత్యధికంగా హైదరాబాద్ నుంచి 26,376 దరఖాస్తులొచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 19,754 దరఖాస్తులు వచ్చాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కేవలం 11,686 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఏటా జిల్లా నుంచి 10వేల మంది డిగ్రీ చదువును పూర్తిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎంత లేదన్నా ఓటరు నమోదుకు 30వేలకు తగ్గకుండా దరఖాస్తులు వస్తాయని భావించిన నేపథ్యంలో కేవలం 11వేలు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద జిల్లాలో 41,674 మంది మాత్రమే పట్టభద్రులుగా నమోదవడాన్ని బట్టి చూస్తే జిల్లాలో గ్రాడ్యుయేట్లు ఇంతేమందా? అనే సందేహం కలుగుతుంది. అదే విధంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో లక్ష మందికి పైగా పట్టభద్రులుగా నమోదయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో మాత్రం కేవలం 41వేలు మాత్రమే పట్టభద్రులుగా ఉన్నారు.
అభ్యర్థుల ప్రచారం ముమ్మరం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కార్యక్రమ ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతున్నా..అభ్యర్థుల ప్రచారం మాత్రం ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్.రాంచందర్‌రావు, ఉపాధ్యాయ సంఘాల నుంచి పీఆర్టీయూ అభ్యర్థిగా వెంకట్‌రెడ్డి, టీపీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. తమ అనుమాయులతో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు.