రెండు విడతల్లో 71 .63 శాతం పోలింగ్
బెంగళూరు: రాష్ట్రంలో రెండు విడతల్లో ఈనెల 13, ఈనెల 20వ తేదీల్లో జరిగిన జెడ్పీ, టీపీ ఎన్నికల్లో 71.63 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో 30 జిల్లాలు ఉండగా ఇందులోని 1,083 జిల్లా, 3,884 తాలూకా పంచాయతీ క్షేత్రాలకు రెండు దశలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 13న జరిగిన మొదట దశ ఎన్నికల్లో 1,46,31,858 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,08,50,742 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దీంతో మొదటి దశలో 73.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఈనెల 20న జరిగిన రెండో దశలో 1,46,88,853 ఓటర్లకు గాను 1,01,81,719 మంది మత్రమే (69.32) ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొదటి దశతో పోలిస్తే రెండోదశలో తక్కువ ఓటింగ్ నమోదైంది. మొత్తంగా 29364288 మందికిగాను 21032461 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 71.63 శాతం ఓటింగ్ నమోదైంది.