వీఆర్వోపై ఇసుకాసురుల దాడి
కొయ్యలగూడెం : అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇసుకాసురులు అధికారులను, ఉద్యోగులను ఏమాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా.. శుక్రవారం ఎర్రకాలువ నుంచి ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్న ట్రాక్టర్లను అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్వోపై దాడికి తెగబడ్డారు. పంచాయతీ కార్యదర్శిపైనా దౌర్జన్యానికి దిగారు. వీఆర్వో స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. కొయ్యలగూడెం మండలం రాజవరం బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని మంగపతిదేవిపాలెం ప్రాంతంలో ఎర్రకాలువ వెంబడి భారీఎత్తున ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారంటూ కాలువ పరీవాహక ప్రాంతంలోని రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వో పి.చలపతిరావు మరికొందరు వీఆర్వోలతో కలిసి అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో సుమారు వందమంది 45కు పైగా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేస్తున్నారు. అప్పటికే ఇసుక వేసుకుని బయలుదేరిన ట్రాక్టర్లను వీఆర్వోల బృందం రాజవరం వంతెన వద్ద అడ్డుకుంది. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించి తాళాలను తీసుకున్నారు. దీంతో ఇసుక రవాణాదారులు అక్కడకు చేరుకుని పరుష పదజాలంతో వీఆర్వోలపై విరుచుకుపడ్డారు. రాజవరం వీఆర్వో చలపతిరావుపై దాడికి తెగబడ్డారు. మిగిలిన వీఆర్వోలను గెంటేసి వారి చేతుల్లో ఉన్న తాళాలను లాక్కుని ట్రాక్టర్లను తీసుకుని వెళ్లిపోయారు. రైతులు కలగజేసుకుని ఇసుక రవాణాదారులను నిలువరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పంచాయతీ కార్యదర్శి రమేష్ అక్కడకు చేరుకోగా, ఆయనపైనా వారంతా ఎదురు తిరిగారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేయిస్తున్నారని.. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే రవాణాకు సహకరిస్తున్న బంటా మేస్త్రిలు, కూలీలను వారిపైకి ఉసిగొల్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చలపతిరావుపై దాడి జరిగిన విషయం తెలిసి మండలంలోని వీఆర్వోలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.