Vro VRA exams
-
శ్రమకు తగిన ‘ఫలితం’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. పరీక్ష నిర్వహించిన నెల రోజుల్లోపే ఫలితాలు వెల్లడి కావడం.. వెనువెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం రావడంతో విజేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ర్యాంకుల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడి కాకపోవడం అభ్యర్థులను కాస్త నిరాశకు గురిచేసింది. జిల్లాలో 105 వీఆర్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలో 66,788 మంది పోటీ పడ్డారు. వీరిలో వైట్నర్ ఉపయోగించడం.. దిద్దడం.. ఓఎంఆర్ షీట్ సరిగా భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో 4,697 జవాబు పత్రాలను తిరస్కరించారు. జిల్లా స్థాయిలో మొదటి, మూడవ ర్యాంకులు కల్లూరువాసులకే దక్కడం విశేషం. కల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి(హాల్ టిక్కెట్ నెం.113100257) 98 మార్కులతో మొదటి ర్యాంకును.. పత్తికొండకు చెందిన ఎర్రం విజయకుమార్(హాల్ టిక్కెట్ నెం.113126999) 97 మార్కులతో రెండో ర్యాంకు.. కల్లూరుకు చెందిన కట్టా దస్తగిరి(హాల్ టిక్కెట్ నెం.1131223175) 96 మార్కులతో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో సీసీఎల్ఏ ఫలితాలను విడుదల చేయగా.. రాత్రి 7 గంటల ప్రాంతంలో మెరిట్ లిస్టు సీడీ జిల్లాకు చేరింది. ఆ వెంటనే రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితా తయారీకి కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఆదివారం మధ్యాహ్నం లోపు రోస్టర్ పాయింట్ ప్రకారం సెలెక్షన్ జాబితాను సిద్ధం చేయనున్నారు. సోమవారం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 26న ఎంపిక ఉత్తర్వులు అందివ్వనున్నారు. వీఆర్ఏ పరీక్షకు 5,546 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 4,958 మంది హాజరయ్యారు. 399 మందికి చెందిన జవాబు పత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించారు. రెవెన్యూ డివిజన్ వారీగా వీఆర్ఏల ఫలితాల సీడీలను ఆర్డీఓలకు పంపారు. వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్‌గా.. వీఆర్ఏ పోస్టులను మండలం యూనిట్‌గా భర్తీ చేస్తున్నారు. వీఆర్ఏ రాత పరీక్షలో వెల్దుర్తి మండలం లక్ష్మీనగర్‌కు చెందిన బసిరెడ్డి గారి సత్యశీలారెడ్డి(హాల్ టిక్కెట్ నెం.0313100016) 95 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచినట్లు సమాచారం. వీఆర్ఏ పోస్టులకు సంబంధించి మండలం యూనిట్‌గా ర్యాంకులు ప్రకటించినట్లు తెలుస్తోంది. వీఆర్ఓలకు జిల్లాస్థాయిలో కలెక్టర్.. వీఆర్ఏలకు ఆర్డీఓలు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. -
వీఆర్వో, వీఆర్ఏ ఫలితాల్లో టాప్ వీరే
రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన 27వ తేదీకల్లా ప్రాథమిక నియామక ప్రక్రియ పూర్తి 4 వేల మంది డిప్యూటీ తహశీల్దార్లకు గెజిటెడ్ హోదా సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో ఫలితాల సీడీలను విడుదల చేశారు. వీఆర్వో పరీక్షలో ఎం.నరేంద్రరెడ్డి(చిత్తూరు జిల్లా), ఎం.శ్యామ్‌సుందర్‌రెడ్డి (నల్లగొండ) వందకు వంద మార్కులు సాధించారు. బి.యోగానందరెడ్డి(అనంతపురం) 99 మార్కులు పొందాడు. ఇక వీఆర్ఏ పరీక్షలో బోనాల ప్రభాకర్ (అనంతపురం జిల్లా), పల్లా వీరవెంకటకృష్ణారావు (తూర్పుగోదావరి), డి.రామకృష్ణ (నిజామాబాద్) వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు. ccla.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూడవచ్చు. జిల్లాల వారీగా ర్యాంకుల వివరాల సాఫ్ట్ కాపీలను కలెక్టర్లకు పంపించారు. వీఆర్వోలకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిరలో విలేకరులకు తెలిపారు. అప్పుడు నెలకు రూ.17 వేల జీతం వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది డిప్యూటీ తహశీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ మంత్రిగా ఈ ఉత్తర్వులపై చివరి సంతకం పెట్టినట్లు వివరించారు. జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో.. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) వీఆర్వోల భర్తీ చేపడుతుంది. ఆర్డీవో/సబ్ కలెక్టర్ నేతృత్వంలోని డివిజినల్ స్థాయి ఎంపిక కమిటీ వీఆర్ఏ భర్తీ నిర్వహిస్తుంది. ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ప్రాథమికంగా ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతోపాటు ఈనెల 24వ తేదీ నుంచి జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని ఎస్సెమ్మెస్‌లు పంపుతారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 27వ తేదీకల్లా ప్రాథమిక నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించారని మహంతి ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. రికార్డు సమయంలో (కేవలం రెండు నెలల్లో) ఇన్నివేల పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని సీసీఎల్ఏ కృష్ణారావు చెప్పారు. -
పంచాయతీకి పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు నిర్వహించిన స్ఫూర్తితో 23న జరిగే పంచాయతీ కార్యదర్శుల పోటీ పరీక్షలూ కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ చిరం జీవులు కోరారు. గురువారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో పరీక్షల విధులు కేటాయించిన అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పరీక్షలు రాసే అభ్యర్థులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోరాదన్నారు. కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే పోటీ పరీక్షలలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని సూచించారు. మొత్తం గా 59,793 మంది 133 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పుకార్లను కూడా అభ్యర్థు లు నమ్మరాదని, మనోధైర్యంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు. చిన్న పొరపాట్ల వల్ల హాల్‌టికెట్ నంబర్లు వేయడం, ఓఎంఆర్ షీట్లు పూరించడంలో అవగాహన రాహిత్యంతో అభ్యర్థులు అనర్హులవుతున్నారని, ఈ కారణంగా అభ్యర్థులందరూ హాల్‌టికెట్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేసిన పిదప మాత్రమే ఇన్విజిలేటర్లు సంతకాలు చేయాలని అధికార్ల ను ఆదేశించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని కోరారు. పరీక్ష కేంద్రా ల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికార్లను ఆదేశిం చారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు వీడియోగ్రఫీ చేపట్టాలని కోరారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే భవిష్యత్‌లో మరే పరీక్ష కూడా రాయకుండా అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. ఉపాధ్యాయులు పెలైటింగ్ ద్వారా గ్రామ కార్యదర్శి పరీక్షకు హాజరైనచో విధుల నుండి సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్రావు, ఏజేసీ నీలకంఠం, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీఓ జహీర్ పాల్గొన్నారు. -
ఫంక్షన్లు.. పరీక్షలు
కలెక్టరేట్/ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు చెదురుముదరు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కొంత మంది దూర ప్రాంతాల అభ్యర్థులు సమయం మించిపోయి పరీక్షకు హాజరుకాకపోగా, మరికొంత మంది అభ్యర్థులు సమయానికి బస్సులు దొరకక, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని హాజరుకాక వెనుదిరిగారు. పట్టణంలోని దస్నాపూర్ ప్రాంతంలో గల వంతెన ఇరుకుగా ఉండడంతో ఉదయం రోడ్డంతా ట్రాఫిక్‌తో నిండింది. రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచాయి. సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలవడంతో పరీక్ష సమయం మించి కొందరు అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలో జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల అభ్యర్థులు బెజ్జూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వాంకిడి ప్రాంతాల నుంచి అభ్యర్థులు రావడంతో సందడిగా మారింది. దూర ప్రాంతాల నుంచి కొందరు అభ్యర్థులు ఒక్క రోజు ముందుగానే చేరుకున్న, మరికొంత అభ్యర్థులు ఆదివారం ఉదయం వెళ్తూ, ఇక్కడున్న అభ్యర్థులు వేరే ప్రాంతాలకు వెళ్లడంతో సెలవు రోజైనా రద్దీగా కన్పించింది. దీంతో బస్సులు దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభ్యర్థుల ఉరుకులు, పరుగులతో బస్టాండ్ ప్రాంతం సాయంత్రం వరకు సందడిగా కన్పించింది. పరీక్ష కేంద్రాల పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ అధికారులు కేంద్రాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా, ఇదేరోజు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, రహదారులు రద్దీగా మారాయి. వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష నిర్వహణ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో డీఆర్వో రాజు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కేంద్రంలోని ప్రతీహాలును పరిశీలిస్తూ అభ్యర్థుల హాజరు శాతం, ఇన్విజిలేటర్లు రికార్డులో నమోదు చేస్తున్న విధానం, పరీక్షల నిర్వహణ, అభ్యర్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు. కొలాం ఉన్నత పాఠశాల, నలందా డిగ్రీ కళాశాల, చావా అకాడమీ, వివేకానంద బీఈడీ కళాశాల, రిమ్స్ ఆడిటోరియం, ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాలలో జరుగుతున్న వీఆర్వో పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా వీఆర్వో పరీక్ష నిర్వహణకు 244 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 64,681 మంది అభ్యర్థులకు 54,197 మంది వీఆర్వో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 10,484 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో వీఆర్వో పరీక్ష హాజరు 84.33 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన వీఆర్ఏ పరీక్షకు 1,998 మంది హాజరుకావాల్సి ఉండగా, 1685 మంది హాజరయ్యారు. 313 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష హాజరు 83.79 శాతంగా నమోదైంది. ఆర్టీసీకి రూ.13 లక్షల ఆదాయం ఆదివారం వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ఉండటంతో ఆర్టీసీకి దాదాపు రూ.13 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. జిల్లాలో పరీక్షల కోసమే 274 బస్సులు నడిపారు. సాధారణంగా రోజు ఆర్టీసీ సుమారు ఒక రోజుకు ఆదాయం రూ.57 లక్షల ఆదాయం వస్తుంది. ఈ రోజు మాత్రం రూ.70 లక్షలు వచ్చాయి. ఆదివారం పరీక్షలకు వేలాది మంది అభ్యర్థులు రావడంతో బస్టాండ్లు కిటకిటలాడాయి. ప్రత్యేకంగా ఆదిలాబాద్ డిపో నుంచి 43, ఆసిఫాబాద్ నుంచి 20, భైంసా నుంచి 20, మంచిర్యాల నుంచి 22, నిర్మల్ నుంచి 20, ఉట్నూర్ నుంచి 9 బస్సులు నడిపించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణతో అభ్యర్థులకు తిప్పలు తప్పాయి. -
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ప్రశాంతం
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అధికారుల కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. కడపలో 38, ప్రొద్దుటూరులో 12, రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. వీఆర్వో పరీక్షలు ఉద యం 10కి ప్రారంభమై 12 గంటలకు ముగిశాయి. ఈ పరీక్షల కోసం 28,661 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 24,981 మంది (87.16 శాతం) హాజరు కాగా, 3,680 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కడప గ్లోబల్ కళాశాలలో వీఆర్ఏ పరీక్ష లు జరిగాయి. మొత్తం 1240 మంది దరఖాస్తు చేసుకోగా, 1119 మంది (90.24 శాతం) హాజరయ్యారు. 121 మంది హాజరు కాలేదు. కడప గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో వీఆర్వో పరీక్ష రాసిన పోరుమామిళ్లకు చెందిన మహీధర్ అనే అభ్యర్థి పరీక్ష ముగిశాక పొరపాటున సమాధానపత్రాన్ని తన వెంట తీసుకు వెళుతుండగా అధికారులు గుర్తిం చారు. నిబంధనల మేరకు ఆయనపై అనర్హత వేటు విధించారు. అలాగే పలువురు అభ్యర్థులు పరీక్షాకేంద్రాల వద్దకు సెల్ఫోన్లు, స్టడీ మెటీరియల్, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కడప ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని పరీక్షా హాలులో ఓ టేబుల్‌పై కుప్పగా వేశారు. పరీక్ష ప్రారంభానికి కొద్దిగా ముందు కేంద్రం వద్దకు చేరుకున్న కొందరు అభ్యర్థులు తమకు కేటాయించిన గది ఎక్కడుందో వెతుక్కోవడానికి ఆందోళన పడ్డారు. మరికొందరు పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాలకు తాపీగా రావడంతో పోలీసులు వెనక్కి పంపివేశారు. పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందు వరకు మాత్రమే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండగా, కొందరు అభ్యర్థులు 9.30 గంటలకు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద హాల్ టిక్కెట్ల కోసం ప్రయత్నించి విఫలయ్యారు. నామినల్ రోల్స్‌లో అభ్యర్థుల సంతకాలు వేలిముద్రలు తీసుకోవాల్సి ఉండగా, అవగాహన లేని కొందరు ఇన్విజిలేటర్లు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి తెలుసుకున్నారు. మహిళా అభ్యర్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం కనిపించింది. పరీక్షా కేంద్రాల సందర్శన కలెక్టర్ శశిధర్ కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించా రు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ హరిత ఉన్నారు. డీఆర్వో ఈశ్వరయ్య గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, మదీనా ఇంజనీరింగ్ కళాశాల, జెడ్పీ ఉర్దూ హైస్కూలు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలను సందర్శించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి సి.గుణభూషణ్‌రెడ్డి, ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి రామనాధంశెట్టి పర్యవేక్షించారు.