కలెక్టరేట్/ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం జరిగిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు చెదురుముదరు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కొంత మంది దూర ప్రాంతాల అభ్యర్థులు సమయం మించిపోయి పరీక్షకు హాజరుకాకపోగా, మరికొంత మంది అభ్యర్థులు సమయానికి బస్సులు దొరకక, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని హాజరుకాక వెనుదిరిగారు. పట్టణంలోని దస్నాపూర్ ప్రాంతంలో గల వంతెన ఇరుకుగా ఉండడంతో ఉదయం రోడ్డంతా ట్రాఫిక్‌తో నిండింది. రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచాయి. సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలవడంతో పరీక్ష సమయం మించి కొందరు అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలో జరిగిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల అభ్యర్థులు బెజ్జూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వాంకిడి ప్రాంతాల నుంచి అభ్యర్థులు రావడంతో సందడిగా మారింది.
దూర ప్రాంతాల నుంచి కొందరు అభ్యర్థులు ఒక్క రోజు ముందుగానే చేరుకున్న, మరికొంత అభ్యర్థులు ఆదివారం ఉదయం వెళ్తూ, ఇక్కడున్న అభ్యర్థులు వేరే ప్రాంతాలకు వెళ్లడంతో సెలవు రోజైనా రద్దీగా కన్పించింది. దీంతో బస్సులు దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభ్యర్థుల ఉరుకులు, పరుగులతో బస్టాండ్ ప్రాంతం సాయంత్రం వరకు సందడిగా కన్పించింది. పరీక్ష కేంద్రాల పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ అధికారులు కేంద్రాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా, ఇదేరోజు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, రహదారులు రద్దీగా మారాయి.
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష నిర్వహణ
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో డీఆర్వో రాజు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కేంద్రంలోని ప్రతీహాలును పరిశీలిస్తూ అభ్యర్థుల హాజరు శాతం, ఇన్విజిలేటర్లు రికార్డులో నమోదు చేస్తున్న విధానం, పరీక్షల నిర్వహణ, అభ్యర్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు.
కొలాం ఉన్నత పాఠశాల, నలందా డిగ్రీ కళాశాల, చావా అకాడమీ, వివేకానంద బీఈడీ కళాశాల, రిమ్స్ ఆడిటోరియం, ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాలలో జరుగుతున్న వీఆర్వో పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా వీఆర్వో పరీక్ష నిర్వహణకు 244 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 64,681 మంది అభ్యర్థులకు 54,197 మంది వీఆర్వో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 10,484 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో వీఆర్వో పరీక్ష హాజరు 84.33 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన వీఆర్‌ఏ పరీక్షకు 1,998 మంది హాజరుకావాల్సి ఉండగా, 1685 మంది హాజరయ్యారు. 313 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష హాజరు 83.79 శాతంగా నమోదైంది.
ఆర్టీసీకి రూ.13 లక్షల ఆదాయం
ఆదివారం వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ఉండటంతో ఆర్టీసీకి దాదాపు రూ.13 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. జిల్లాలో పరీక్షల కోసమే 274 బస్సులు నడిపారు. సాధారణంగా రోజు ఆర్టీసీ సుమారు ఒక రోజుకు ఆదాయం రూ.57 లక్షల ఆదాయం వస్తుంది. ఈ రోజు మాత్రం రూ.70 లక్షలు వచ్చాయి. ఆదివారం పరీక్షలకు వేలాది మంది అభ్యర్థులు రావడంతో బస్టాండ్లు కిటకిటలాడాయి. ప్రత్యేకంగా ఆదిలాబాద్ డిపో నుంచి 43, ఆసిఫాబాద్ నుంచి 20, భైంసా నుంచి 20, మంచిర్యాల నుంచి 22, నిర్మల్ నుంచి 20, ఉట్నూర్ నుంచి 9 బస్సులు నడిపించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణతో అభ్యర్థులకు తిప్పలు తప్పాయి.
ఫంక్షన్లు.. పరీక్షలు
Published Mon, Feb 3 2014 3:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement