వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. పరీక్ష నిర్వహించిన నెల రోజుల్లోపే ఫలితాలు వెల్లడి కావడం..
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. పరీక్ష నిర్వహించిన నెల రోజుల్లోపే ఫలితాలు వెల్లడి కావడం.. వెనువెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం రావడంతో విజేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ర్యాంకుల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడి కాకపోవడం అభ్యర్థులను కాస్త నిరాశకు గురిచేసింది.
జిల్లాలో 105 వీఆర్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలో 66,788 మంది పోటీ పడ్డారు. వీరిలో వైట్నర్ ఉపయోగించడం.. దిద్దడం.. ఓఎంఆర్ షీట్ సరిగా భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో 4,697 జవాబు పత్రాలను తిరస్కరించారు.
జిల్లా స్థాయిలో మొదటి, మూడవ ర్యాంకులు కల్లూరువాసులకే దక్కడం విశేషం. కల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి(హాల్ టిక్కెట్ నెం.113100257) 98 మార్కులతో మొదటి ర్యాంకును.. పత్తికొండకు చెందిన ఎర్రం విజయకుమార్(హాల్ టిక్కెట్ నెం.113126999) 97 మార్కులతో రెండో ర్యాంకు.. కల్లూరుకు చెందిన కట్టా దస్తగిరి(హాల్ టిక్కెట్ నెం.1131223175) 96 మార్కులతో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో సీసీఎల్‌ఏ ఫలితాలను విడుదల చేయగా.. రాత్రి 7 గంటల ప్రాంతంలో మెరిట్ లిస్టు సీడీ జిల్లాకు చేరింది. ఆ వెంటనే రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితా తయారీకి కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఆదివారం మధ్యాహ్నం లోపు రోస్టర్ పాయింట్ ప్రకారం సెలెక్షన్ జాబితాను సిద్ధం చేయనున్నారు.
సోమవారం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 26న ఎంపిక ఉత్తర్వులు అందివ్వనున్నారు. వీఆర్‌ఏ పరీక్షకు 5,546 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 4,958 మంది హాజరయ్యారు. 399 మందికి చెందిన జవాబు పత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించారు. రెవెన్యూ డివిజన్ వారీగా వీఆర్‌ఏల ఫలితాల సీడీలను ఆర్డీఓలకు పంపారు. వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్‌గా.. వీఆర్‌ఏ పోస్టులను మండలం యూనిట్‌గా భర్తీ చేస్తున్నారు. వీఆర్‌ఏ రాత పరీక్షలో వెల్దుర్తి మండలం లక్ష్మీనగర్‌కు చెందిన బసిరెడ్డి గారి సత్యశీలారెడ్డి(హాల్ టిక్కెట్ నెం.0313100016) 95 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచినట్లు సమాచారం. వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి మండలం యూనిట్‌గా ర్యాంకులు ప్రకటించినట్లు తెలుస్తోంది. వీఆర్‌ఓలకు జిల్లాస్థాయిలో కలెక్టర్.. వీఆర్‌ఏలకు ఆర్డీఓలు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.