vtol
-
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్‌లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
పక్షిలా ఎగిరే విమానం!... ఎలాగో తెలుసా!!:
ఫొటోలు చూశారుగా.. ఆకారంతోపాటు ఎగిరే క్రమంలోనూ పక్షిని పోలిన వినూత్నమైన ఎగిరే కారు ఇది. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇలాంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అలాంటివి వాస్తవ రూపం దాల్చింది తక్కువే. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అయితే వీటీఓఎల్ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. పక్షి మాదిరిగానే కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్‌వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకపోగా పైలట్ మోడ్‌తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారానూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లవచ్చని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... అనుకునే వారికి శుభవార్త! ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం అన్న నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంట్లో కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్లైట్ ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గా ఉండి, తక్కువ శబ్దంతోనూ, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవ్వడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యను కొంత అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కార్లు, టూ వీలర్స్ అయితే ఇంట్లోని సెల్లార్, లేదా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాం. కానీ ఈ జెట్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కేవలం ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనికి ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది.