ప్రతి సమాచారాన్ని అందించాలి..
సమాచార హక్కు చట్టం సామాజిక తనిఖీ విభాగం కన్వీనర్ వీవీ రావు
నిజామాబాద్ అర్బన్: ప్రజలు సమాచారం అడిగినప్పుడు కొందరు అధికారులు సక్రమంగా ఇవ్వడం లేదని సమాచార హక్కు చట్టం సామాజిక తనిఖీ విభాగం కన్వీనర్ వీవీ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కదా, రాష్ట్రం వచ్చింది కదా.. అంటూ దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ మహిళ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉద్యమాలలో పాల్గొన్నా నిబంధనల ప్రకారం సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు.
ప్రతి శాఖ వారు ఖచ్చితంగా సెక్షన్-4ను పాటించాలన్నారు. అడిగిన ప్రతి వ్యక్తికి పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలన్నారు. జాతీయ రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం ప్రకారం పీఓలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేటికీ జాతీయ పార్టీలు వీరి ఉసే ఎత్తడం లేదన్నారు. చట్టప్రకారం జాతీయపార్టీలు కూడా సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమలైతేనే పారదర్శకత ఉంటుందని చెప్పారు.