పాపం.. పసివాళ్లు
వనపర్తి క్రైం/ వనపర్తి అర్బన్: ‘ఐరన్’ మాత్రలు వేసుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం వనపర్తిలో కలకలం రేపింది. తినక ముందు మాత్రలు వేయడం, వాటిని వేసుకునే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేయడంలో ఏఎన్ఎం, ఆశలు నిర్లక్ష్యం వహించడంతో 37 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ఏరియా ఆస్పత్రి మారుమోగింది. వివరాలిలా..
తినకుండా వేసుకోవడంతో..
మండలంలోని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గురువారం రాష్ట్రీయ బాలికల ఆరోగ్య పథకంలో భాగంగా (స్కూల్ హెల్త్) పాఠశాలలోని విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలు వేస్తారు. అయితే గురువారం సవాయిగూడెంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలను ఏఎన్ఎం, ఆశలు పంపిణీ చేశారు. అయితే విద్యార్థులు తిన్న తర్వాత మాత్రలు వేసుకోవాలి. కానీ కొంతమంది విద్యార్థులు ఉదయం తినకుండా పాఠశాలకు వచ్చారు. ఉదయం 11 గంటలకు ఏఎన్ఎం సాయిన్‌బేగం, ఆశ వెంకటేశ్వరమ్మ 63 మంది విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలు వేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 37 మంది విద్యార్థులకు వాంతులు కావడం, కడపునొప్పితో బాధపడటంతో ఉపాధ్యాయులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కొంతమంది విద్యార్థులను ఆటోలో, అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఒక్కో బెడ్డుపై ఇద్దరు విద్యార్థులను పడుకోబెట్టి చికిత్స చేశారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే..
ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఐరన్, సీ విటమిన్ మాత్రలు పంపిణీ చేయడం వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు మాత్రలు వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాత్రలు వేసే ముందు విద్యార్థులు తిన్నారో లేదో చూసుకోవాలి. అలా ఏదీ చూడకుండా విద్యార్థులకు ఉదయమే మాత్రలు వేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసి కడుకుంట్ల ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎం, ఆశలు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థు లు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్న తీరును చూసి ఖంగుతిన్నారు. విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.